Rama Navami Recipe: అయోధ్య రామయ్యకు ఇష్టమైన ప్రసాదం.. ఈ నైవేద్యం పెడితే మీ ఇంట్లో సిరుల పంటే..!
శ్రీరామ నవమి అనేది హిందూ మతంలో పవిత్రమైన పండుగ. ఈరోజు భక్తులు రామునికి ఇష్టమైన నైవేద్యంగా అన్నం పాయసం సమర్పిస్తారు. శ్రద్ధతో తయారు చేసిన ఈ మధురమైన వంటకం భగవంతుడిని ప్రసన్నం చేస్తుందని నమ్మకం. ఇప్పుడు ఈ రుచికరమైన పాయసం ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకుందాం పదండి.

భారతదేశవ్యాప్తంగా శ్రీరామ నవమిని ఎంతో భక్తిశ్రద్ధలతో జరుపుకుంటారు. హిందూ సంప్రదాయాల్లో రాముని జన్మదినమైన ఈ రోజుకు ఎంతో ప్రాముఖ్యత ఉంది. పురాణాల ప్రకారం చైత్ర మాస శుక్ల పక్ష నవమి తిథినాడు శ్రీరాముడు అవతరించారని చెబుతారు. అందుకే ప్రతి సంవత్సరం ఈ తిథిని రామ నవమిగా జరుపుకుంటారు.
కొందరు భక్తులు అయోధ్యలో రాముని దర్శనం చేసుకునేందుకు వెళ్తుంటే.. మరికొందరు ఇంట్లోనే రాముని జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. అంతా బాగా చేసి ఆ శ్రీరాముడికి ఇష్టమైన వంట చేయకుంటే ఎలా. ఇవాళ మనం శ్రీరాముడికి ఎంతో ఇష్టమైన అన్నంతో చేసే పాయసంను ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకుందాం.
కావాల్సిన పదార్థాలు
- బియ్యం – 1/2 కప్పు
- పాలు – 4 కప్పులు
- చక్కెర – 1/2 కప్పు
- యాలకుల పొడి – 1/2 చెంచా
- బాదం, కాజు, పిస్తా, కిస్మిస్ లు – తగినన్ని
తయారీ విధానం
ముందుగా బియ్యాన్ని శుభ్రంగా కడిగి 20 నుంచి 30 నిమిషాలు నీటిలో నానబెట్టాలి. ఇలా చేయడం వల్ల బియ్యం మెత్తబడుతాయి, పాయసం మరింత రుచిగా ఉంటుంది. ఇప్పుడు బియ్యాన్ని నీటిని వడకట్టి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక పెద్ద పాత్రలో పాలు పోసి మరిగించాలి. పాలు బాగా మరిగిన తర్వాత అందులో నానబెట్టిన బియ్యం వేసి నిరంతరం బాగా కలుపుతూ ఉండాలి. ఇలా చేయకపోతే గిన్నెకి అడుగంటిపోతుంది.
బియ్యం మెత్తగా ఉడికిన తర్వాత చక్కెర, యాలకుల పొడి వేసి మరో 5 నుంచి 7 నిమిషాలు మరిగించాలి. చివరగా చిన్న ముక్కలుగా తరిగిన బాదం, కాజు, పిస్తా, కిస్మిస్ లు వేసి బాగా కలపాలి. ఆ శ్రీరాముడికి ఇష్టమైన పాయసం రెడీ అయ్యింది. ఇంకెందుకు ఆలస్యం కొద్దిగా చల్లారిన తర్వాత శ్రీరాముడికి నివేదించండి.