AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Health Alert: బాబోయ్.. అతిగా కూర్చునేవారిలో ఆ వ్యాధి.. భారతీయ యువతలో కొత్త రకం లక్షణాలు..

మీరు చేసే ఉద్యోగం ఏదైనా సరే రోజులో ఎన్ని గంటల పాటు కూర్చుని పనిచేస్తున్నారో చెక్ చేసుకోవాల్సిన అవసరం వచ్చింది. ఎందుకంటే ఎయిమ్స్ శాస్త్రవేత్తలు తాజాగా వెల్లడించిన విషయాలు ఆందోళనకరంగా ఉన్నాయి. రోజంతా కూర్చుని పనిచేసే వారిలో భారతీయులే ఎక్కువగా ఉంటున్నారని.. దీంతో ప్రాణాలు పోయే వ్యాధి బారిన పడుతున్నారని తేలింది. వివరాల్లోకి వెళితే..

Health Alert: బాబోయ్.. అతిగా కూర్చునేవారిలో ఆ వ్యాధి.. భారతీయ యువతలో కొత్త రకం లక్షణాలు..
Indian Youth Sitting Heart Diseases
Bhavani
|

Updated on: Apr 11, 2025 | 12:34 PM

Share

భారతదేశంలో, ముఖ్యంగా యువతలో గుండె జబ్బులు వేగంగా పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో, ఆల్ ఇండియా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (ఎయిమ్స్) నుంచి ప్రముఖ హృద్రోగ నిపుణులు డాక్టర్ అంబుజ్ రాయ్, డాక్టర్ నితీష్ నాయక్ ఆరోగ్యకరమైన జీవనశైలి కోసం అత్యవసర సూచనలు జారీ చేశారు. రెగ్యులర్ వ్యాయామం, సమతుల ఆహారం, నిత్యం ఆరోగ్య పరీక్షలు గుండెను కాపాడుకోవడానికి కీలకమని వారు నొక్కి చెప్పారు. భారతదేశం ప్రపంచంలో కరోనరీ హార్ట్ డిసీజ్ రాజధానిగా మారుతున్న నేపథ్యంలో ఈ హెచ్చరికలు మరింత ప్రాముఖ్యత సంతరించుకున్నాయి.

కూర్చోవడం కొత్త ధూమపానంతో సమానం..

ఇండియా ఇంటర్నేషనల్ సెంటర్ (ఐఐసీ)లో జరిగిన “గుండె ఆరోగ్యానికి పది సూత్రాలు” అనే చర్చా కార్యక్రమంలో, డాక్టర్ అంబుజ్ రాయ్ ఇలా అన్నారు: “కూర్చోవడం ఇప్పుడు కొత్త ధూమపానంగా మారింది. ప్రతి 30 నిమిషాలకు ఒకసారి లేచి నడవడం లేదా కదలడం అవసరం.” ఆధునిక జీవనశైలిలో నిశ్చలంగా గడిపే సమయం పెరగడం వల్ల యువతలో గుండె సంబంధిత సమస్యలు విపరీతంగా పెరుగుతున్నాయని ఆయన హెచ్చరించారు. నార్వే (బీఎంసీ పబ్లిక్ హెల్త్, 2015) కెనడా (సీఎంఏజే ఓపెన్, 2014)లోని అంతర్జాతీయ అధ్యయనాల ప్రకారం, దక్షిణాసియా వాసులు ముఖ్యంగా భారతీయులు ఆయా దేశాల స్థానికులతో పోలిస్తే 50 నుంచి 100 శాతం ఎక్కువగా గుండె జబ్బుల బారిన పడుతున్నారు.

గుండె ఆరోగ్యానికి ఏం చేయాలి?

వారానికి 150 నిమిషాల మితమైన లేదా 75 నిమిషాల తీవ్రమైన శారీరక శ్రమ గుండె జబ్బు ప్రమాదాన్ని 40 శాతం వరకు తగ్గిస్తుంది. ధూమపానం గుండె జబ్బు ప్రమాదాన్ని మూడు రెట్లు, పొగాకు నమలడం (గుట్కా, పాన్ మసాలా) రెండు రెట్లు పెంచుతుంది. దీనిని పూర్తిగా మానేయండి. రోజుకు 400 గ్రాముల తాజా పండ్లు, కూరగాయలు తినండి. చేపలు, కోడి వంటి ఆరోగ్యకరమైన మాంసాన్ని చేర్చుకోవచ్చు.

బరువు నియంత్రణ:

బాడీ మాస్ ఇండెక్స్ (బీఎంఐ) 25 కిలోల కంటే తక్కువ, నడుము-తుంటి నిష్పత్తి 0.5 కంటే తక్కువగా ఉంచండి. రక్తపోటు 140/90 ఎంఎంహెచ్‌జీ కంటే తక్కువ, రక్తంలో చక్కెర 6-7 శాతం, కొలెస్ట్రాల్ 200 ఎంజీ/డీఎల్ కంటే తక్కువగా ఉండేలా చూసుకోండి. గుండె జబ్బు ఉన్నవారు లేదా గుండె శస్త్రచికిత్స చేయించుకున్నవారు జీవితకాలం ఆస్పిరిన్ వాడాలని, కొలెస్ట్రాల్ లేదా డయాబెటిస్ ఉన్నవారు స్టాటిన్స్ తీసుకోవాలని వైద్యులు సూచించారు.

సాంప్రదాయ ఆహారం వైపు మళ్లండి

ఈ ముప్పు నుంచి తప్పించుకోవాలంటే భారతీయ వంటకాల వైపు తిరిగి వెళ్లాలని వైద్యులు సూస్తున్నారు. విదేశీ ఆహారాలకు డిమాండ్ పెరుగుతుండటం ఆందోళనకరం. అవి అతిగా ప్రాసెస్ చేయబడినవి. మన వంటగదిని మళ్లీ ముఖ్యం చేయాల్సిన అవసరాన్ని వారు పేర్కొంటున్నారు. ఖడా మసాలాలు, సుగంధ ద్రవ్యాలు, మూలికలు (పుదీనా, తులసి, వెల్లుల్లి, అల్లం) రోజువారీ ఆహారంలో చేర్చాలని ఆమె సిఫార్సు చేశారు.

సాంప్రదాయ భారతీయ భోజనంతో పాటు కూరలు, కూరగాయలు, పప్పు, పెరుగు, సలాడ్‌లతో రంగురంగులుగా ఉండే భోజనం మంచిదంటున్నారు. ఇలా చేయడం వల్ల శరీరానికి అన్ని రకాల పోషకాలు అందుతాయి. జొన్నలు, రాగులు, సజ్జల వంటి ధాన్యాలు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయని, వంట విధానం నూనె ఎంపిక కీలకమని ఆమె వివరించారు.

అవన్నీ అపోహలే..

రెడ్ వైన్ గుండెకు మంచిదని కొందరు.. ఆల్కహాల్ ను రోజూ కొంచెం తీసుకుంటే నష్టం లేదని మరికొందరు వాదిస్తుంటారు. అయితే ఇవన్నీ కేవలం అపోహలు మాత్రమేనని వీటిని నమ్మొద్దని నిపుణులు చెప్తున్నారు. అలాగే ప్రోటీన్ షేక్స్ అతిగా వాడితే కిడ్నీ వైఫల్యం వచ్చే ప్రమాదం ఉంది. ఓజెంపిక్, మౌంజారో వంటి ఔషధాలు ఊబకాయం తగ్గించడంలో ప్రభావం చూపినా, దీర్ఘకాల సురక్షిత డేటా లేకపోవడంతో వీటిపై ఆధారపడటం సరికాదని డాక్టర్ యశ్‌దీప్ గుప్తా (ఎయిమ్స్ ఎండోక్రినాలజీ) హెచ్చరించారు.