దేశంలో పెరిగిపోతున్న ఊబకాయం కేసులు.. పిల్లల్లో, మహిళల్లో అధికం.. కారణాలు ఇలా..?
Obesity: దేశంలో ఊబకాయ కేసులు విపరీతంగా పెరిగిపోతున్నాయి. తాజా జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే (ఎన్‌ఎఫ్‌హెచ్‌ఎస్) ప్రకారం.. 3 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలతో ఐ
Obesity: దేశంలో ఊబకాయ కేసులు విపరీతంగా పెరిగిపోతున్నాయి. తాజా జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే (ఎన్‌ఎఫ్‌హెచ్‌ఎస్) ప్రకారం.. 3 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలతో ఐదేళ్లలోపు పిల్లల్లో ఊబకాయం ఎక్కువగా ఉందని తేలింది. దీనికి కారణం శారీరక శ్రమ లేకపోవడం, చెడు ఆహార అలవాట్లని నిపుణులు చెబుతున్నారు. అధిక బరువు గల పిల్లల సంఖ్య NFHS-4లో 2.1 శాతం నుంచి NFHS-5లో 3.4 శాతానికి పెరిగింది. పిల్లలే కాదు, స్త్రీలు, పురుషులలో కూడా ఊబకాయం పెరిగింది.
NFHS-5 ప్రకారం.. అధిక బరువు గల స్త్రీల శాతం 20.6 శాతం నుంచి 24 శాతానికి పెరిగింది. పురుషులలో ఈ సంఖ్య 18.9 శాతం నుంచి 22.9 శాతానికి పెరిగింది. మహారాష్ట్ర, గుజరాత్, మిజోరం, త్రిపుర, లక్షద్వీప్, జమ్మూకశ్మీర్, ఉత్తరప్రదేశ్, ఢిల్లీ, పశ్చిమ బెంగాల్, ఆంధ్రప్రదేశ్, లడఖ్‌తో సహా అనేక రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో ఊబకాయం శాతంలో పెరుగుదల నమోదు చేశాయి. గోవా, తమిళనాడు, దాద్రానగర్ హవేలీ, డామన్ డయ్యూలలో మాత్రం ఐదు సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్న అధిక బరువు గల పిల్లల సంఖ్య తగ్గింది.
సర్వే డేటా ప్రకారం.. 30 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలు మహిళల్లో ఊబకాయం పెరుగుదలను నమోదు చేయగా, 33 రాష్ట్రాలు, యుటిలు పురుషులలో ఊబకాయం పెరుగుదలను నమోదు చేశాయి. వారి శరీర ద్రవ్యరాశి సూచిక 25.0 kg/m2 కంటే ఎక్కువ లేదా సమానంగా ఉన్నట్లు తేలింది. పిల్లలు, పెద్దలలో కూడా అనారోగ్యకరమైన ఆహార ఎంపికలు, శారీరక శ్రమ లేకపోవడం వల్ల ఊబకాయం పెరగడానికి కారణమని ఆరోగ్య సంరక్షణ నిపుణులు పేర్కొన్నారు.
భారతీయ స్త్రీలు, పురుషులు, పిల్లల్లో స్థూలకాయం పెరగడానికి కారణం పెరిగిన ఆదాయాలు అని సర్వే ఫలితాలు చెబుతున్నాయి. 2015-16లో NFHS-4 ప్రకారం.. అధిక బరువు లేదా ఊబకాయం ఉన్న పురుషుల నిష్పత్తి అత్యల్ప సంపద ఉన్న కుటుంబాలలో ఐదు శాతం ఉండగా అత్యధిక సంపద ఉన్న కుటుంబాలలో 33 శాతం ఉంది. తాజా లెక్కలలో అది ఆరుశాతం, 36 శాతంగా నమోదైంది. అంటే సంపన్నుల్లో ఊబకాయం బారినవారు చాలామంది ఉన్నారని లెక్కలు చెబుతున్నాయి.