AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

కదంబ చెట్టు.. ఈ చెట్టుకు రాధాకృష్ణులకు సంబంధం ఏంటి..? ఆశ్చర్యకరమైన విషయాలు మీకోసం..!

కదంబ చెట్టు మన సంస్కృతి, పురాణాలు, వైద్య శాస్త్రంలో ప్రత్యేక స్థానం కలిగింది. ఈ చెట్టు పసుపు రంగు పువ్వులు సువాసన తో ఆకట్టుకుంటాయి. కృష్ణుడి రాసలీలలకు సాక్షిగా నిలిచిన ఈ వృక్షం భక్తి, ప్రేమ, ఆనందానికి ప్రతీక గా భావించబడుతుంది.

కదంబ చెట్టు.. ఈ చెట్టుకు రాధాకృష్ణులకు సంబంధం ఏంటి..? ఆశ్చర్యకరమైన విషయాలు మీకోసం..!
Kadamba Tree
Prashanthi V
|

Updated on: Aug 31, 2025 | 9:05 PM

Share

కదంబ చెట్టును కదం లేదా బర్ పువ్వుల చెట్టు అని కూడా పిలుస్తారు. ఇది మన దేశంతో పాటు ఆగ్నేయాసియాలో వేగంగా పెరుగుతుంది. ఈ చెట్టు గుండ్రని, మంచి వాసన ఉన్న పువ్వులు, విశాలమైన నీడతో చాలా ప్రత్యేకంగా కనిపిస్తుంది. ఈ చెట్టు గురించి ఆశ్చర్యకరమైన విషయాలను మనం ఇప్పుడు తెలుసుకుందాం.

ప్రేమ వృక్షం

మన పురాణాల ప్రకారం శ్రీకృష్ణుడు రాసలీలలు ఈ చెట్టు కింద ఆడాడని చెబుతారు. అందుకే ఇది ప్రేమ, భక్తి, ఆనందానికి గుర్తుగా మారింది. రాధా కృష్ణుల కలయికకు సాక్షిగా నిలిచినందువల్ల దీన్ని ప్రేమ వృక్షం అని కూడా పిలుస్తారు.

దేవతల సంబంధం

పురాతన సంస్కృత గ్రంథాలలో దుర్గాదేవికి కదంబ తోటలు ఇష్టమని రాసి ఉంది. అలాగే తమిళ సంప్రదాయాల్లో ఈ చెట్టును మురుగన్ స్వామితో ముడిపెడతారు. బౌద్ధ మతంలో కూడా ఇది జ్ఞానానికి ప్రతీకగా భావిస్తారు.

పూజల్లో వాడకం

ఈ చెట్టు పసుపు రంగు పువ్వులను పూజలకు, సువాసనల తయారీకి, పూజా సామాగ్రిలో వాడుతుంటారు. ఆలయాల్లో ఈ చెట్టును పవిత్రంగా భావించి పూజిస్తారు.

వైద్య గుణాలు

కదంబ చెట్టు కేవలం పురాణాల్లోనే కాదు.. ఆయుర్వేదంలో కూడా ఒక మంచి ఔషధంగా వాడతారు. దీని బెరడు, ఆకులు, పువ్వులు, వేర్లు అన్నీ ఆరోగ్యానికి ఉపయోగపడతాయి.

  • షుగర్ కంట్రోల్.. కదంబ ఆకులు, వేర్లు, బెరడు నుంచి తీసిన రసాలు రక్తంలో షుగర్ లెవెల్స్ తగ్గించడంలో సహాయపడతాయి.
  • గాయాలు మాన్పడం.. కదంబ ఆకుల కషాయాలు గాయాలను త్వరగా మాన్పడానికి.. మచ్చలు తగ్గించడానికి వాడతారు.
  • నొప్పి, వాపు.. ఈ ఆకులను గాయాలపై కడితే నొప్పి తగ్గుతుంది. అలాగే దీని బెరడు వాపు తగ్గించే గుణాలు కలిగి ఉంది.
  • బ్యాక్టీరియా నిరోధం.. కదంబలో ఉండే పదార్థాలు హానికరమైన సూక్ష్మజీవులను అడ్డుకుంటాయి. చర్మ వ్యాధుల నివారణకు కదంబ పేస్టులను వాడతారు.
  • కీళ్ల నొప్పులు.. ఇది ఆర్థరైటిస్, కీళ్ల నొప్పుల వంటి సమస్యలకు కూడా ఉపశమనం ఇస్తుంది.
  • పేగు పురుగులు.. కదంబలోని ఔషధ గుణాలు పేగుల్లోని పురుగులను నాశనం చేస్తాయి.

కదంబ చెట్టును పెంచడం ఎలా..?

ఈ చెట్టు వేగంగా పెరుగుతుంది. దీనికి వెచ్చని, తేమ ఎక్కువగా ఉండే ప్రదేశాలు అనుకూలం. సారవంతమైన నేలలో ఇది బాగా పెరుగుతుంది. 25 నుంచి 30 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత వద్ద ఈ చెట్టు బాగా పెరుగుతుంది. ఈ చెట్టు సుమారు 45 మీటర్ల ఎత్తు వరకు పెరుగుతుంది. 4 నుంచి 5 ఏళ్లలో పూయడం మొదలుపెడుతుంది. దీనిని విత్తనాల ద్వారా లేదా కొమ్మలు నాటడం ద్వారా సులభంగా పెంచవచ్చు. కదంబ చెట్టు పవిత్రత, వైద్యం, ఆధ్యాత్మికం, అందం అన్నీ కలిగిన ఒక అద్భుతమైన చెట్టు.