Success Story:11 ఏళ్ల వయస్సులో ప్రమాదం.. చక్రాల కుర్చీకే పరిమితం.. నేడు రూ.7000 కోట్ల వ్యాపార సామ్రాజ్యానికి అధిపతి
Success Story of Sminu Jindal: అన్ని అవయవాలు, అవకాశాలు ఉండి తాము ఏమీ సాధించలేకపోతున్నామనుకునే వారికి ఆమె నుంచి నేర్చుకోవలసింది..
Success Story of Sminu Jindal: అన్ని అవయవాలు, అవకాశాలు ఉండి తాము ఏమీ సాధించలేకపోతున్నామనుకునే వారికి ఆమె నుంచి నేర్చుకోవలసింది ఎంతో ఉంది. జీవితం.. ఇది మనం ఊహించనట్లు ఉండదు.. అనుకోని సంఘటనలు ఎన్నో జరుగుతుంటాయి. వాటివలన జీవితంలో వచ్చిన మార్పులను అంగీకరించి.. ధైర్యంతో ముందడుగు వేయడానికి స్ఫూర్తినిస్తుంది స్మినూ జిందాల్. ఒక సంస్థ టర్నోవర్‌ని మూడొందలకోట్ల నుంచి ఏడువేల కోట్లకి చేర్చిన స్మినూ జిందాల్ గురించి ఈరోజు తెలుసుకుందాం..
స్మినూ జిందాల్ వ్యాపార కుటుంబంలో పుట్టారు. అయితే 11 ఏళ్ల వయసులో జరిగిన కారు ప్రమాదంలో వెన్నుపూసకు బలమైన గాయమైంది. సర్జరీ తర్వాత ఆమె శరీర కిందిభాగం మొత్తం చచ్చుబడిపోయింది. దీంతో ఇక తానెప్పటికీ నడవలేననీ, అందరి పిల్లల్లా బయటకు వెళ్లలేననీ అర్థంచేసున్నారు. ఆ వైకల్యం నుంచి బయటపడేందుకు చదువుపై దృష్టి పెట్టి ఎంబీఏ ఫైనాన్స్ పూర్తి చేశారు స్మినూ.
జిందాల్‌ది వ్యాపారస్థుల కుటుంబం. అయితే వారి వ్యాపార సామ్రాజ్యంలో మహిళలకు ఎటువంటి పాత్రలేని సాంప్రదాయ కుటుంబం. అందుకే స్మినూ వాళ్ల నానమ్మ, అమ్మకు కూడా వ్యాపారం గురించి ఏమీ తెలియదు. అంతెందుకు… స్మినూ ఇద్దరు చెల్లెళ్లూ గృహిణులుగానే స్థిరపడ్డారు. ఇక స్మినూ తాతయ్య కూడా ఆమె చిన్నతనంలో నువ్వు పెద్దదానివైతే పెళ్లిచేసేస్తామని చాలా సార్లు చెప్పారు కూడా. అయితే అనుకోని ప్రమాదం ఆమె జీవితాన్ని మార్చివేసింది. వ్యాపార రంగంలో అడుగు పెట్టేలా చేసింది. ఇప్పుడు సుప్రసిద్ధ పైపుల తయారీ సంస్థ ‘జిందాల్ సా’ కి మేనేజింగ్ డైరక్టర్. ఫార్చ్యూన్ శక్తిమంతమైన మహిళల జాబితాలో ఒకరు. అసలు తాను పారిశ్రామికవేత్తగా స్థిరపడతానని ఏ మాత్రం ఊహించలేదంటారు స్మినూ జిందాల్. వ్యాపార ప్రయాణంలో ఎన్నో మలుపులు, మరెన్నో సవాళ్లను దాటుకుంటూ తనదైన ముద్రవేశారు. ఈ స్థాయికి చేరుకోవడం కోసం ఎంతో కష్టపడ్డారు.
ఎంబీఏ తర్వాత స్మినూ వ్యాపారంలో మెళకులు నేర్చుకుని రాణించాలని ఉండేది. అందుకు స్మినూ తండ్రి అంగీకరించలేదు. చివరికి తండ్రి అంగీకారంతో జిందాల్ సా సంస్థలో రూ. 2700 జీతంతో ట్రైనీగా చేరారు. తాతగారు చేస్తున్న అవమానాలను తట్టుకుంటూ.. నిలబడడానికి తనకు చాలా సమయం పట్టిందని స్మినూ పలు సందర్భరాల్లో గుర్తు చేసుకున్నారు. స్మినూ పెళ్లి విషయంలో కూడా కుటుంబ సభ్యులను కాదని వ్యాపార నేపథ్యం లేని ఇంద్రదేశ్‌బాత్రా అనే మేనేజ్‌మెంట్ గ్రాడ్యుయేట్‌ని ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. మరోవైపు ఫ్యాక్టరీలోనూ అమ్మాయి అడుగు పెట్టడం స్వాగతించలేదు.. అనేక ఇబ్బందులు పెట్టేవారు. యజమాని కూతురుగా కాకుండా ఒక సామాన్య ఉద్యోగిగా సర్దుకుని పోయి అక్కడ ఉన్న ఉద్యోగుల్లో మార్పు తీసుకుని వచ్చారు. అన్నిటిని భరిస్తూ.. గుర్తింపు తెచ్చుకున్నారు.
జిందాల్ సా సంస్థకు మేనేజింగ్ డైరక్టర్ పదవిని చేపట్టారు. ఇప్పుడు భారత్ తో పాటు అమెరికా, యూరోప్, అరబ్ ఎమిరేట్స్‌తో పాటు ప్రపంచవ్యాప్తంగా పలు దేశాలకు విస్తరింపజేశారు. బాధ్యతలు తీసుకున్నాక రూ.300 కోట్ల నుంచి రూ.7000 కోట్ల టర్నోవర్‌కు సంస్థను చేర్చారు.
స్మినూ వ్యాపార వేత్తగా రాణిస్తూనే మరోవైపుకి సమాజానికి తనవంతు సేవ చేయాలనుకున్నారు. ముఖ్యంగా తనలా చక్రాల కుర్చీకే పరిమితం అయిన వారిఙకి అండగా నిలబడాలని భావించారు. “స్వయం” పేరుతో ఓ సంస్థను స్థాపించారు. ఈ సంస్థ ద్వారా దేశవ్యాప్తంగా రెండువేలకు పైగా పబ్లిక్ ప్లేస్‌లను గుర్తించి వైకల్యంతో బాధపడేవారికోసం వీల్‌ఛైర్లు ఏర్పాటు ప్రత్యేక ర్యాంప్‌లు వంటి కనీస మౌలిక సౌకర్యాలు ఏర్పాటు చేశారు. స్మినూ చేస్తున్న సేవలకు గుర్తింపుగా పలు అవార్డులను అందుకునాన్రు. లారియల్ పారిస్ ఫెమీనా ఫేవరెట్ ఫేస్ ఆఫ్ కాజ్ అవార్డు ఇచ్చి సత్కరించింది.
Also Read: శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి ఆలయ హుండీ లెక్కింపు.. గత 6 రోజుల్లో ఆదాయం ఎంతో తెలుసా