Gold Jewellery: పాత బంగారు నగలు కొత్తవిలా ధగధగా మెరవాలంటే.. ఇంట్లోనే మెరుగు పెట్టేయండిలా..
ఎంత రేటు పెట్టి కొనుక్కున్నా సరే బంగారు నగలు కొన్ని రోజులకు మెరుపులు తగ్గిపోతాయి. ఒంటిపై వేసుకుంటే వేడి నీటి స్నానానికి డల్ గా మారిపోతాయి. అదే తీసి పక్కన పెట్టినా కొన్ని రోజులకు వన్నె తగ్గిపోతుంటాయి. ఇలా ప్రతి సారి మీరు వీటిని మెరుగు పెట్టించడం కుదరదు. అందుకే ఇంట్లో సింపుల్ గా దొరికే ఐటెమ్స్ తోనే మీ నగలను ధగధగా మెరిసేలా చేసేయొచ్చు. అదెలాగో చూడాండి..

బంగారు ఆభరణాలు మెరుపును కోల్పోతే అవి ఎంత మంచి డిజైన్ అయినా సరే వేసుకోవాలని అనిపించదు. అందుకే వాటికి మళ్లీ పాత వైభవం రావాలని డబ్బులు పోసి మెరుగుపెట్టిస్తుంటారు. ఇలా కాకుండా వాటిని ఇంట్లోనే తగిన సమయం కేటాయిస్తే ఏ పెళ్లిళ్లు ఫంక్షన్స్ లో అయినా మళ్లీ కొత్త వాటిలాగా వేసుకొళ్లొచ్చు. ఆభరణాలు నల్లబడిపోయినప్పుడు మార్కెట్‌లో దొరికే రకరకాల రసాయనాల జోలికి వెళ్లకుండా.. సాధారణ సబ్బు నీళ్లు, కుంకుడుకాయ రసం వంటివి ఉపయోగించినా సరిపోతుంది. మీరు కూడా ఈ సింపుల్ టిప్స్ ఓసారి ట్రై చేసి చూడండి.
టూత్ బ్రష్ టెక్నిక్..
మీ బంగారు నగలు ఏవైనా సరే వాటిని మెరిపించేందుకు మీకు నిత్యం అందుంబాటులో ఉండే టూత్ పేస్ట్ చాలా గొప్పగా పనిచేస్తుంది. అందుకోసం ముందుగా మీరు ఆభరణాలను కాసేపు సబ్బు నీటిలో ఉంచండి. ఆ తర్వాత ఇంట్లో దొరికే ఉపయోగం లేని టూత్ బ్రష్ తీసుకుని వాటిపై కొద్దిగా టూత్ పేస్ట్ వేసి రుద్దండి. సున్నితమైన ఆభరణాల విషయంలో జాగ్రత్తగా రుద్దాలి. లేదంటే అందులోని రాళ్లుపోయే ప్రమాదం ఉంటుంది. తర్వాత వాటిని ఒక కాటన్ వస్త్రంలో వేసి తుడవండి. ఇక అంతే అవి కొత్త వాటిలా మెరుస్తుంటాయి.
రాళ్లు పొదిగిన నగల క్లీనింగ్ ఇలా..
మీ దగ్గర ఎక్కువగా రాళ్లతో తయారు చేసిన నగలే ఉన్నాయా.. అయితే వాటి కోసం మరో టిప్ ను ఉపయోగించండి. డైమండ్స్, కెంపుల, పచ్చల వంటి ఖరీదైన స్టోన్స్ ఉండే నగలను కాస్త ప్రత్యేకంగా శుభ్రం చేయాల్సి ఉంటుంది. ముత్యాల వంటివి కూడా కాస్త డెలికేట్ గానే డీల్ చేయాల్సి ఉంటుంది. అందుకోసం వాటిని ఏమాత్రం డిస్ట్రబ్ చేయకుండా మెరిపించడానికి తేలిక పాటి షాంపూ మీకు బెస్ట్ ఆప్షన్. వీటిని షాంపూలో వేసి కాసేపు ఉంచి క్లాత్ తో సున్నితంగా రుద్దితే వాటికి ఉన్న మురికి త్వరగా వదిలిపోతుంది. వాటి రంగు కూడా మారకుండా ఉంటుంది.
హాట్ వాటర్ టెక్నిక్..
మీ బంగారు ఆభరణాలను కాస్త గోరువెచ్చని నీటిలో ముంచండి. దాని వల్ల నగల్లోని మూలాల్లో దాగి ఉన్న మురికి, జిడ్డు తొలగిపోతుంది. ఆ తర్వాత వాటిని సున్నితంగా బ్రష్ చేసి క్లాత్ తో తుడవండి. డెలికేట్ నగలకు ఇలా చేయడం ఉత్తమం. కొన్నిసార్లు రాళ్లు మాత్రమే మెరిస్తే చాలనుకుంటే వాటిపై థర్మాకోల్ ముక్కను కాసేపు రాపిడి చేయండి. రాళ్లు మళ్లీ కొత్తగా మారుతాయి.
వెండి కోసం ఇలా..
వెండి నగలను మనం బంగారు షాపుల్లో క్లీనింగ్ ఇచ్చినప్పుడు వారు చేసే మొదటి పని వాటిని కుంకుడు కాయల నురగతో క్లీన్ చేయడం. ఇది మీరు కూడా తేలికగా ఇంట్లోనే చేసుకోవచ్చు. మీ దగ్గర వెండి పట్టీలు నల్లగా మారిపోయి ఉన్నా.. దేవుడి దగ్గర ఉంచే సామాన్లైనా సరే వాటిని కాసేపు కుంకుడు కాయలు వేసిన నీటిలో వేసి ఉంచండి. ఆ తర్వాత కొన్ని కుంకుడు కాయలు చేతిలో పట్టుకుని వాటిని బ్రష్ తో రుద్దుతూ నురగ రానీయండి. ఆ వెంటనే మీ వెండి ఆభంరణాలను కూడా అదే నురగతో రుద్దండి. వీటి మెరుపు మీరు ఊహించని విధంగా వస్తుంది.
