ఓర్నీ.. పెద్దగా కష్టపడక్కర్లేదు.. ఇలా పిండి కలిపితే మెత్తటి దూది లాంటి ఇడ్లీ సిద్ధం..
ఇంట్లో ఇడ్లీలు మెత్తగా, దూదుల్లా రావడం లేదా? అయితే ఈ సింపుల్ టిప్స్‌తో స్పాంజ్‌లాంటి సాఫ్ట్ ఇడ్లీలను సులభంగా తయారు చేసుకోవచ్చు. ఇడ్లీ రైస్, మినప్పప్పు, సగ్గుబియ్యంతో చేసే ఈ రెసిపీలో సరైన నానబెట్టడం, రుబ్బడం, పులియబెట్టడం ముఖ్యమైనవి. వంటసోడా లేకుండానే మెత్తటి ఇడ్లీలు తయారుచేసి సాంబార్, చట్నీతో రుచిగా ఆస్వాదించండి.

ఉదయాన్నే తినే ఆరోగ్యకరమైన టిఫిన్లలో ఇడ్లీ ఒకటి.. ఎలాంటి నూనె పదార్థాలను లేకుండా.. మంచిగా ఆవిరితోనే ఇడ్లీలను మంచి చేసుకుని తినొచ్చు.. మినుములు, ఇడ్లీ రవ్వతో చేసుకునే ఇడ్లీలలో మంచి పోషకాలుంటాయి.. అయితే.. ఎంత మంచిగా చేసినా.. కొంతమందికి సాఫ్ట్ ఇడ్లీలు చేయడం కొంత కష్టమవుతుంది.. అయితే, ఈ కథనంలో వివరించే టిప్స్ తో దూదుల్లాంటి, స్పాంజ్‌లాంటి ఇడ్లీలను ఇంట్లోనే సులభంగా తయారుచేసుకోవచ్చు. సాధారణంగా మనం చేసుకునే రవ్వ ఇడ్లీల కంటే ఇవి ఎంతో మృదువుగా, నోట్లో వేసుకుంటే వెన్నలా కరిగిపోయేలా ఉంటాయి. ఈ రెసిపీలో చెప్పిన కొలతలను, పద్ధతులను పాటిస్తే ఎవరైనా పర్ఫెక్ట్ ఇడ్లీలను తయారుచేసుకోవచ్చు..
కావలసిన పదార్థాలు:
- ఇడ్లీ రైస్ – 2 కప్పులు
- మినప్పప్పు – అర కప్పు
- సగ్గుబియ్యం – పావు కప్పు
- ఉప్పు – రుచికి సరిపడా
- నీళ్లు – తగినంత
తయారీ విధానం:
నానబెట్టడం: ముందుగా ఒక గిన్నెలో రెండు కప్పుల ఇడ్లీ రైస్ తీసుకోండి. వీటిని రెండు మూడు సార్లు శుభ్రంగా కడిగి, తగినన్ని నీళ్లు పోసి నానబెట్టండి. అలాగే, మరో గిన్నెలో అర కప్పు మినప్పప్పు తీసుకుని, రెండు మూడు సార్లు కడిగి, నీళ్లు పోసి నానబెట్టండి. ఆ తర్వాత, పావు కప్పు సగ్గుబియ్యాన్ని కూడా శుభ్రంగా కడిగి, నీళ్లు పోసి నానబెట్టండి. ఈ మూడు పదార్థాలను కనీసం ఎనిమిది గంటల పాటు బాగా నానబెట్టాలి. ఇలా బాగా నానడం వల్ల ఇడ్లీలు మెత్తగా వస్తాయి.
రుబ్బడం: ఎనిమిది గంటల తర్వాత, నానిన బియ్యం, మినప్పప్పు, సగ్గుబియ్యం నుండి నీళ్లను తీసివేయండి. మళ్లీ ఫ్రెష్ వాటర్ పోసి రెండు మూడు సార్లు కడిగి, వడకట్టండి. ఇప్పుడు వీటిని మిక్సీలో గాని, గ్రైండర్‌లో గాని రుబ్బుకోవాలి. మిక్సీలో రుబ్బుకుంటే, ఒక్కో పదార్థాన్ని విడివిడిగా రుబ్బుకోవాలి. ముందుగా బియ్యాన్ని కొద్దిగా నీళ్లు కలుపుతూ మెత్తటి పేస్ట్‌లా రుబ్బుకుని, ఒక పెద్ద గిన్నెలోకి తీసుకోండి. ఆ తర్వాత, మినప్పప్పును కూడా తగినన్ని నీళ్లతో మెత్తగా రుబ్బుకుని, అదే గిన్నెలో వేయండి. చివరిగా, సగ్గుబియ్యాన్ని కూడా మెత్తగా రుబ్బుకుని, మిగతా పిండితో పాటు గిన్నెలో వేయండి. గ్రైండర్‌లో అయితే అన్నింటినీ కలిపి రుబ్బుకోవచ్చు.
కలపడం, పులియబెట్టడం: రుబ్బుకున్న పిండినంతటినీ చేతితో బాగా కలిసేలా కలపండి. ఇది పిండి పులియడానికి సహాయపడుతుంది. బాగా కలిపిన తర్వాత, గిన్నెకు మూత పెట్టి, రాత్రంతా (సుమారు ఎనిమిది గంటలు) పులియబెట్టండి. పిండి బాగా పులిసిన తర్వాత, అది బాగా పొంగి, పరిమాణంలో రెట్టింపు అవుతుంది.
ఇడ్లీలు తయారుచేయడం: పులిసిన పిండిని ఒకసారి బాగా కలిపి, రుచికి సరిపడా ఉప్పు వేసి మరోసారి కలపండి. వంటసోడా వాడనవసరం లేదు, సోడా లేకుండానే ఇడ్లీలు ఎంతో మెత్తగా వస్తాయి. ఇప్పుడు ఇడ్లీ ప్లేట్లకు కొద్దిగా నూనె రాసి, పిండిని నింపండి. ఇడ్లీ పాత్రలో నీళ్లు పోసి, ప్లేట్లను పెట్టి మూత పెట్టండి. మీడియం ఫ్లేమ్‌లో పది నిమిషాల పాటు ఆవిరిపై ఉడికించండి.
వడ్డించడం: పది నిమిషాల తర్వాత, ఇడ్లీలను బయటకు తీసి, వేడివేడిగా వడ్డించండి. ఈ మెత్తటి ఇడ్లీలను సాంబార్, పల్లీ చట్నీ, కొబ్బరి చట్నీ లేదా టమాటా చట్నీతో పాటు ఆస్వాదించవచ్చు. ఒక్కసారి రుచి చూస్తే, మీరు రెగ్యులర్ ఇడ్లీలను మర్చిపోతారు. ఇంకెందుకు ఆలస్యం.. మీరు కూడా.. ఈ రెసిపీని ట్రై చేయండి..
మరిన్ని లైఫ్‌స్టైల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
