AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఏపీలో అమానుషం.. చేతులు, మెడకు తాళ్లతో కట్టి వీధుల్లో అర్ధనగ్నంగా ఊరిగించారు..

విజయనగరం జిల్లా భోగాపురంలో బైక్ డబ్బుల వివాదం దారుణ ఘటనకు దారితీసింది. రూ.30 వేల కోసం ఓ వ్యక్తిని రాత్రంతా నిర్బంధించి హింసించడంతో పాటు చేతులు, మెడకు తాళ్లు కట్టి అర్ధనగ్నంగా వీధుల్లో తిప్పారు. సమాచారం అందుకున్న పోలీసులు ఐదుగురు నిందితులను అరెస్ట్ చేశారు. వ్యక్తిగత వివాదాల్లో చట్టాన్ని చేతుల్లోకి తీసుకోవద్దని ఎస్పీ హెచ్చరించారు.

ఏపీలో అమానుషం.. చేతులు, మెడకు తాళ్లతో కట్టి వీధుల్లో అర్ధనగ్నంగా ఊరిగించారు..
Vizianagaram Crime News
Gamidi Koteswara Rao
| Edited By: |

Updated on: Sep 07, 2026 | 8:13 PM

Share

విజయనగరం జిల్లా భోగాపురం మండలంలో దారుణ ఘటన చోటుచేసుకుంది. బైక్ కొనుగోలు వ్యవహారంలో తలెత్తిన డబ్బుల వివాదం ఓ వ్యక్తి పై అమానుష దాడికి దారితీసింది. ఓ వ్యక్తిని రాత్రంతా నిర్బంధించి హింసించడంతో పాటు, తాళ్లతో కట్టి బహిరంగంగా వీధుల్లో తిప్పిన ఘటన రాష్ట్రవ్యాప్తంగా సంచలనం రేపింది. ఇంతకీ అసలు వివాదానికి కారణమేంటి? పోలీసుల యాక్షన్ ఏంటి? వివరాల్లోకి వెళ్తే.. విజయనగరం జిల్లా భోగాపురం మండలం రామచంద్రరాజుపేటకు చెందిన ఎల్లా రాజేష్ బైక్ కొనుగోలు చేసేందుకు మెకానిక్ వెన్ను మహేష్‌ ను కలిశాడు. అక్కడ మహేష్ తన బైక్ అమ్ముతానని చెప్పాడు. దీంతో బైక్‌ను ట్రయల్ రన్ కోసం తీసుకెళ్లిన రాజేష్ ట్రయిల్ రన్ లోనే ఓ కానిస్టేబుల్ కారు ఢీకొట్టాడు. ఆ ప్రమాదంలో కారుతో పాటు మెకానిక్ బైక్ కూడా ధ్వంసం అయ్యింది. అయితే కారు డ్యామేజ్ కు సంబంధించి సదరు కానిస్టేబుల్ తో ఆరు వేల రూపాయలకు ఒప్పందం చేసుకున్నారు. అయితే కానిస్టేబుల్ కి ఇవ్వాల్సిన ఆరు వేలు కూడా రాజేష్ దగ్గర లేకపోవడంతో మెకానిక్ మహేష్ కానిస్టేబుల్ కి ఆరు వేల రూపాయల చెల్లించాడు. అలా కొనుగోలుకు సంబంధించిన డబ్బులు, కానిస్టేబుల్ కి ఇచ్చిన ఆరువేలు మొత్తం కలిపి ముప్పై వేలు ఇవ్వాలని మెకానిక్ మహేష్ రాజేష్ ను డిమాండ్ చేశాడు. దీంతో రాజేష్ రెండు రోజుల్లో ఇస్తానని చెప్పి అక్కడ నుంచి వెళ్లిపోయాడు.

ఆ తరువాత కొంతకాలంగా రాజేష్ తప్పించుకుని తిరుగుతున్నాడనే ఆరోపణలు ఉన్నాయి. ఈ క్రమంలో శనివారం సాయంత్రం భోగాపురం మండలం సుందరపేట సమీపంలో మహేష్, అతని స్నేహితుడు లెంక శ్రీరామ్ కి రాజేష్ కనిపించడంతో వెంటనే వారిద్దరూ కలిసి రాజేష్‌ను తమ మెకానిక్ షెడ్‌కు తీసుకెళ్లి రాత్రంతా నిర్బంధించారు. తనకు ముప్పై వేలు డబ్బులు చెల్లించాలని ఒత్తిడి చేస్తూ హింసించారు. ఈ దాడిలో రాజేష్ పై హత్యాయత్నానికి పాల్పడ్డారు.. అనంతరం తెల్లవారుజామున మరో ముగ్గురు వ్యక్తులు మహేష్, నమ్మి గోవింద్, వెన్ను అప్పారావు సహకారంతో రాజేష్ చేతులు, మెడకు తాళ్లు కట్టి బహిరంగంగా వీధుల్లో తిప్పి అమానుషంగా వ్యవహరించారు. అయితే స్థానికుల ద్వారా సమాచారం అందుకున్న పోలీసులు ఘటన పై విచారణ చేపట్టారు.

వీడియో చూడండి..

బాధితుడిపై జరిగిన దాడి, నిర్బంధం, బహిరంగ అవమానానికి సంబంధించిన అంశాలను పరిశీలించి ఐదుగురు నిందితులపై హత్యాయత్నం, అట్రాసిటీ చట్టంలోని సంబంధిత నిబంధనలతో కేసు నమోదు చేసి అరెస్ట్ చేశారు. అయితే ఈ ఘటనలో బాధితుడు, నిందితులు క్లోజ్ ఫ్రెండ్స్ కావడం గమనార్హం. ఏది ఏమైనా చట్టాన్ని ఎవరూ తమ చేతుల్లోకి తీసుకోవద్దని జిల్లా ఎస్పీ దామోదర్ హెచ్చరించారు. వ్యక్తిగత వివాదాలు, ఆర్థిక లావాదేవీల పేరుతో ఎవరినైనా నిర్బంధించడం, హింసించడం లేదా బహిరంగంగా అవమానించడం వంటి చర్యలను ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించబోమని స్పష్టం చేశారు. ఇటువంటి ఘటనలకు పాల్పడే వారి పై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us