60 వేల విష సర్పాలతో సామ్రాజ్యం..! పాములతో సాహస సావాసం చేస్తున్న భామ
చూడగానే ఒళ్లు గగుర్పొడిచే దృశ్యం అది. చుట్టూ వేల సంఖ్యలో విష సర్పాలు.. ఏ మాత్రం తేడా వచ్చినా ప్రాణాలు గాల్లో కలవడం ఖాయం. కానీ ఈ యువతి మాత్రం ఆ పాములను తన కుటుంబ సభ్యుల్లా భావిస్తోంది. చైనాలోని గ్వాంగ్జీ ప్రావిన్స్‌కు చెందిన క్విన్ అనే యువతి సాహస గాథ ఇప్పుడు ప్రపంచాన్ని ఆశ్చర్యపరుస్తోంది. యూనివర్సిటీ డిగ్రీ పూర్తి చేసిన రెండేళ్లకే తిరిగి తన సొంతూరికి వచ్చిన ఈమె, తండ్రి వారసత్వంగా నడుపుతున్న ప్రమాదకరమైన వృత్తినే కెరీర్‌గా ఎంచుకుంది.

పాముల ఫాం నడపడం అంటే ప్రాణాలతో చెలగాటమని తండ్రి వారించినా ఆమె వెనక్కి తగ్గలేదు. చిన్నప్పటి నుంచి పాములను చూస్తూ పెరగడం వల్ల వాటి పట్ల ఆమెకు భయం కంటే ఇష్టమే పెరిగింది. పట్టుదలతో తండ్రి వ్యాపారాన్ని అద్భుతంగా డెవలప్ చేసింది. ప్రస్తుతం ఆమె ఫాంలో ఏకంగా 60 వేల విష సర్పాలు ఉన్నాయి. అందులో 50 వేల ‘పంచదశల’ పాములు (ఫైవ్ స్టెప్ వైపర్స్), మరో 10 వేల నాగుపాములు బుసలు కొడుతూ కనిపిస్తాయి. ఆ ఫాంలో అడుగుపెడితే ఎటు చూసినా పాములే కనిపిస్తాయి.
పాములతో వ్యాపారం
పాము కరిస్తే ఆ నొప్పి ఎలా ఉంటుందో క్విన్ వివరిస్తూ భయంకరమైన నిజాలు చెప్పింది. పాము కరిచినప్పుడు కలిగే బాధ వర్ణనాతీతమని, చేతికి కరిస్తే ఆ నొప్పి అరికాళ్ల వరకు గుంజుతుందని తెలిపింది. ఆ మంట తట్టుకోలేక బాధితులు తమ చేయిని నరికేయమని అడిగేంత తీవ్రత ఉంటుందని వివరించింది. ఇన్ని ప్రమాదాలు ఉన్నా ఆమె ఈ వృత్తిలో రాణిస్తోంది. దీనికి ప్రధాన కారణం చైనాలో పాము ఉత్పత్తులకు ఉన్న విపరీతమైన డిమాండ్. పాము విషం, ఎండబెట్టిన పాము మాంసం, పాము నూనె వంటివి అక్కడ సంప్రదాయ మందుల తయారీలో విరివిగా ఉపయోగిస్తారు.
ఆమె ఫాంలో నాణ్యతను బట్టి ఒక్కో పాము ధర వేలల్లో పలుకుతోంది. ముఖ్యంగా పాము విషానికి మార్కెట్‌లో భారీ ధర ఉంది. ఖర్చులన్నీ పోగా క్విన్ ఏటా దాదాపు రూ.1.35 కోట్లు లాభం సంపాదిస్తోంది. కేవలం ఫాం నడపడమే కాకుండా “పాము విషం తీసే పిల్ల” పేరుతో సోషల్ మీడియాలో వీడియోలు చేస్తూ లక్షలాది మంది అభిమానులను సంపాదించుకుంది. ఆమె ధైర్యాన్ని చూసి నెటిజన్లు ఆశ్చర్యపోతున్నారు. చూస్తుంటేనే గుండె జారిపోతుందని, అలాంటిది వేల పాముల మధ్య ఆడుకుంటున్న నీ కష్టానికి తగిన ప్రతిఫలం దక్కుతోందంటూ నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు. చదువుకున్న చదువుకు, ఎంచుకున్న సాహసానికి తోడుగా ఆమె ఇప్పుడు కోట్లలో సంపాదిస్తూ ఎందరికో ఆదర్శంగా నిలుస్తోంది.
