Andhra Pradesh: కేవలం 2 గంటల్లోనే చెన్నైకు.. ఏపీలో అందుబాాటులోకి మరో నేషనల్ హైవే.. ఎక్కడినుంచంటే..?
ఏపీ ప్రజలకు సూపర్ న్యూస్. మరో నేషనల్ హైవే అందుబాటులోకి వచ్చింది. చిత్తూరు నుంచి చెన్నైకు కేవలం 2 గంటల్లోనే ఈ జాతీయ రహదారి గుండా చేరుకోవచ్చు. ప్రస్తుతం 90 కిలోమీటర్ల పనులు పూర్తవ్వడంతో వాహనాలను అనుమతిస్తున్నారు. త్వరలో పూర్తిస్థాయి నిర్మాణ పనులు పూర్త కానున్నాయి.

ఏపీ ప్రజలకు భారీ గుడ్ న్యూస్. రాష్ట్రంలో మరో కొత్త నేషనల్ హైవే అందుబాటులోకి రానుంది. చిత్తూరు-తచ్చూరు మధ్య నిర్మించిన ఆరు లైన్ల గ్రీన్ ఫీల్డ్ యాక్సెస్ కంట్రోల్ జాతీయ రహదారి(NH-716బి) ప్రారంభమైంది. ఈ హైవేలో వాహనాలను అధికారులు అనుమతిస్తున్నారు. ఏపీలోని చిత్తూరు నుంచి చెన్నైలోని కామరాజార్ పోర్ట్, కట్టుల్లి పోర్టులకు కనెక్టివిటీ కల్పిస్తూ దీనిని నిర్మించారు. మొత్తం 116.5 కిలోమీటర్ల మేర ఈ హైవే ఉండనుండగా.. ప్రస్తుతానికి 92 కిలోమీటర్ల పనులు పూర్తయ్యాయి. దీంతో వాహనాలను గత కొద్ది రోజుల నుంచి అనుమతిస్తున్నారు. ఏపీలో 75 కిలోమీటర్ల మేర హైవే ఉంటుంది. దీంతో రాష్ట్రంలో మరో గ్రీన్‌ఫీల్డ్ యాక్సెస్ హైవే అందుబాటులోకి వచ్చినట్లయింది.
అత్యాధునిక సౌకర్యాలు
దాదాపు రూ.5488 కోట్ల బడ్జెట్‌లో ఈ హైవే నిర్మిస్తున్నారు. కేంద్ర సహకారంతో ఈ పనులు చేపడుతున్నారు. ప్రస్తుతం కొంతమేర పూర్తవ్వడంతో ప్రయోగాత్మకంగా హైవే అధికారులు వాహనాలను అనుమతిస్తున్నారు. మొత్తం రెండు పోర్టులకు కనెక్టివిటీ కల్పించేలా ఈ నేషనల్ హైవే నిర్మించారు. ప్రయోగాత్మకంగా ఇప్పుడు వాహనాలను అనుమతించడంలో రాకపోకలు కొనసాగుతున్నాయి. అయితే ఈ యాక్సెస్ కంట్రోల్ ఎక్స్‌ప్రెస్‌వేపై అనేక సౌకర్యాలు ఏర్పాటు చేశారు. ఈ రూట్లో అడ్వాన్స్‌డ్ ట్రాఫిక్ మేనేజ్‌మెంట్ సిస్టం ఏర్పాటు చేశారు. అలాగే భద్రత కోసం 115 స్పెషల్ కెమెరాలు, 120 సర్వైలైన్స్ కెమెరాలు ఏర్పాటు చేశారు. ఇక 58 వీడియో ఇన్సిడెంట్ డిటెక్షన్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ సిస్టమ్స్‌తో పాటు వాహనాల వేగాన్ని అంచనా వేసేందుకు అత్యాధునిక టెక్నాలజీతో కూడిన కెమెరాలు ఏర్పాటు చేశారు. దీంతో ఏమైనా ప్రమాదాలు జరిగినా, ట్రాఫిక్‌కు అంతరాయం కలిగినా అధికారులు వెంటనే గుర్తించవచ్చు.
2 గంటల్లోనే చెన్నైకు..
గతంలో చిత్తూరు నుంచి చెన్నైకు వెళ్లడానికి 4 గంటల సమయం పట్టేది. కానీ ఈ హైవే వల్ల 2 గంటల్లోనే చేరుకోవచ్చు. దాదాపు 2 గంటల ప్రయాణ సమయం తగ్గనుంది. ఏపీ నుంచి చెన్నైకు వెళ్లేవారికి ఈ హైవే ఎంతో ఉపయోగపడనుంది. ఇక ఏపీ పరిధిలో 75 కిలోమీటర్ల పొడవున హైవే ఉండగా.. రోడ్డు పనులు పూర్తయ్యాయి. ఇక తమిళనాడులో 17 కిలోమీటర్ల రోడ్డు పనులు పూర్తయ్యాయి. దీంతో వాహనాలను అనుమతిస్తున్నారు. చిత్తూరు జిల్లాలోని గంగాసాగరం నుంచి తమిళనాడులోని ఉతుక్కొట్టై వరకు అనుమతిస్తున్నారు. తమిళనాడులో రోడ్డు పనులన్నీ పూర్తి చేస్తే ఇది పూర్తి స్థాయిలో అందుబాటులోకి రానుంది. ఈ హైవేకు చిత్తూరు జిల్లాలో 11 ఎంట్రీ, ఎగ్జిట్ పాయింట్లు ఉండగా.. త్వరలో టోల్ ఫీజు వసూలు చేయనున్నారు. వెహికల్ ఎంత దూరం ప్రయాణిస్తే అంత దూరానికి మాత్రమే టోల్ చెల్లించేలా అత్యాధునిక వ్యవస్థ ప్రవేశపెట్టారు.
