కూర్చోవడం Vs నిల్చోవడం.. ఆరోగ్యానికి ఏది మంచిది..? కొత్త పరిశోధనలో షాకింగ్ విషయాలు..
Sitting vs standing: మీరు ఆఫీసులో గంటల తరబడి కుర్చీకే పరిమితమవుతున్నారా? లేదా పని ఒత్తిడిలో అలా నిలబడే ఉండిపోతున్నారా? అయితే ఇది మీకోసమే.. మీరు చేసే ఈ చిన్న పొరపాట్లు మీ ఆయుష్షును సైలెంట్‌గా తగ్గించేస్తున్నాయని మీకు తెలుసా..? ప్రపంచ ప్రఖ్యాత మెడికల్ జర్నల్ లాన్సెట్ తాజాగా విడుదల చేసిన అధ్యయనంలో షాకింగ్ నిజాలు వెలుగుచూశాయి. అవేంటన్నది ఇప్పుడు తెలుసుకుందాం..

ఆధునిక జీవనశైలిలో పని ఒత్తిడి వల్ల గంటల తరబడి ఒకే చోట కూర్చోవడం లేదా నిలబడటం సర్వసాధారణమైపోయింది. అయితే ఈ అలవాటు మీ ఆయుష్షును తగ్గించడమే కాకుండా ప్రాణాంతక గుండె జబ్బులకు దారితీస్తుందని తాజా అధ్యయనాలు హెచ్చరిస్తున్నాయి. ప్రముఖ వైద్య జర్నల్ లాన్సెట్‌లో వచ్చిన అధ్యయనం ప్రకారం.. రోజుకు కేవలం 30 నిమిషాల పాటు కూర్చునే అలవాటును తగ్గించుకుంటే, అకాల మరణం సంభవించే ప్రమాదం 10 శాతం తగ్గుతుంది. ఫిబ్రవరి 11న వెలువడిన మరో అధ్యయనం కూడా నిశ్చల జీవనశైలి వల్ల గుండె జబ్బుల ముప్పు పొంచి ఉందని స్పష్టం చేసింది.
ఎక్కువసేపు నిలబడితే వచ్చే ముప్పులివే..
చాలామంది కూర్చోవడం కంటే నిలబడటం మంచిదని భావిస్తారు. కానీ పరిమితికి మించి నిలబడటం వల్ల కూడా సమానమైన ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయని నిపుణులు చెబుతున్నారు. ఎక్కువసేపు నిలబడటం వల్ల కాళ్లలో నొప్పి, తిమ్మిర్లు, బరువుగా అనిపించడం, వాపు వస్తుంది. నిరంతరం నిలబడటం వల్ల కాళ్లలోని సిరలపై ఒత్తిడి పెరుగుతుంది. దీనివల్ల రక్తం గుండెకు తిరిగి చేరడం కష్టమవుతుంది. కాళ్ల కండరాలు కదలనప్పుడు రక్తం కింది భాగంలోనే పేరుకుపోయి చీలమండల వాపుకు, తీవ్ర అసౌకర్యానికి దారితీస్తుంది. ఇది దీర్ఘకాలంలో వెరికోస్ వెయిన్స్ సమస్యకు కారణం కావచ్చు.
నొప్పికి ఇతర కారణాలు
కేవలం నిలబడటమే కాకుండా.. కాల్షియం, విటమిన్ డి వంటి పోషకాహార లోపాలు, శారీరక ఒత్తిడి వల్ల కూడా కాళ్ల నొప్పులు రావచ్చు. ఇవి నిరంతరంగా వేధిస్తుంటే వైద్యులను సంప్రదించడం ఉత్తమం.
నిపుణులు సూచిస్తున్న పరిష్కారాలు
- మీ ఉద్యోగం లేదా వృత్తి రీత్యా గంటల తరబడి నిలబడాల్సి వస్తే ఈ జాగ్రత్తలు తప్పనిసరి..
- ప్రతి 30 నుండి 40 నిమిషాలకు ఒకసారి చిన్న విరామం తీసుకోండి.
- ఒకే చోట స్థిరంగా ఉండకుండా తరచుగా నడవడం లేదా కాళ్లను కదిలించడం చేయాలి.
- క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం వల్ల రక్తప్రసరణ మెరుగుపడుతుంది.
- ఇంటికి వెళ్ళాక కాళ్లను కాస్త ఎత్తులో ఉంచి విశ్రాంతి తీసుకోవడం వల్ల వాపులు తగ్గుతాయి.
మీ శరీరాన్ని ఒకే భంగిమలో బంధించకండి. కూర్చున్నా, నిలబడినా మధ్య మధ్యలో విరామం తీసుకోవడమే మీ ఆరోగ్యానికి శ్రీరామరక్ష.
మరిన్ని లైఫ్‌స్టైల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
