హెయిర్ గ్రోత్ కోసం ఏవేవో చేస్తున్నారా? ఈ చిట్కాలతో నేచురల్‌గా మీ జుట్టుకు కొత్త జీవం
జుట్టు పెరగడం కోసం మనం ఎన్నో రకాల ప్రయత్నాలు చేస్తుంటాం. మార్కెట్లో దొరికే ఖరీదైన సీరమ్స్, ఆయిల్స్ ఇంకా మందులు వాడుతుంటాం. కానీ, చాలాసార్లు ఇవి ఆశించిన ఫలితాలను ఇవ్వవు. నిజానికి కృత్రిమ పద్ధతుల కంటే ప్రకృతి సిద్ధమైన ఇంటి చిట్కాలు జుట్టు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. ఈ పద్ధతులు పాటించడం కూడా చాలా సులభం. మన వంటింట్లో దొరికే సాదాసీదా వస్తువులతోనే పొడవైన, ఒత్తైన జుట్టును ఎలా సొంతం చేసుకోవచ్చో వివరంగా తెలుసుకుందాం.

జుట్టు సంరక్షణలో రసాయన ఉత్పత్తుల కంటే సహజ సిద్ధమైన ఇంటి చిట్కాలు అద్భుతంగా పనిచేస్తాయి. వంటింట్లో లభించే ఉల్లిపాయ రసం, మెంతులు, కలబంద వంటి పదార్థాలు కుదుళ్లను బలోపేతం చేసి జుట్టు ఒత్తుగా పెరిగేలా చేస్తాయి. అంతేకాదు, ఖర్చు లేకుండా పొడవైన కురులను సొంతం చేసుకోచ్చు. ఇవి జుట్టు ఎదుగుదలకు తోడ్పడటమే కాకుండా, చుండ్రు, తెల్ల జుట్టు వంటి అనేక సమస్యలను పరిష్కరిస్తాయి.
ఉల్లిపాయ రసం..
జుట్టు రాలడం అనేది నేడు అందరినీ వేధిస్తున్న సమస్య. దీనిని అరికట్టడానికి ఉల్లిపాయ రసం ఒక అద్భుతమైన మందులా పనిచేస్తుంది. ఉల్లిపాయలోని సల్ఫర్ కొత్త జుట్టు మొలవడానికి ఎంతగానో సహాయపడుతుంది. ఉల్లిపాయ రసాన్ని తలకు పట్టించడం వల్ల జుట్టు రాలిన చోట మళ్ళీ వెంట్రుకలు వస్తాయి. ఇది జుట్టుకు బలాన్ని ఇవ్వడమే కాకుండా, చిన్న వయసులో వచ్చే తెల్ల జుట్టును కూడా నివారిస్తుంది. అలాగే మెంతులు జుట్టు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి.
మెంతులను నానబెట్టి మెత్తని పేస్ట్‌లా చేసి తలకు పట్టించాలి. మెంతులలో ఉండే ఈస్ట్రోజెన్ జుట్టు ఎదుగుదలకు కీలక పాత్ర పోషిస్తుంది. ఇది చుండ్రును తగ్గించడంలో కూడా సమర్థవంతంగా పనిచేస్తుంది. కలబంద (అలోవెరా) జుట్టుకు సహజమైన మెరుపును, మృదుత్వాన్ని ఇస్తుంది. కలబంద గుజ్జును నేరుగా తలకు రాసుకుని, ఆరిన తర్వాత కడిగేస్తే జుట్టు సిల్కీగా మారుతుంది.
నూనెలతో మసాజ్
సాంప్రదాయ కొబ్బరి నూనెను మనం మర్చిపోతున్నాం, కానీ జుట్టు వేగంగా పెరగడానికి గోరువెచ్చని కొబ్బరి నూనెతో మసాజ్ చేయడం చాలా ముఖ్యం. ఇది రక్తప్రసరణను మెరుగుపరిచి కుదుళ్లను బలోపేతం చేస్తుంది. ఆవనూనెలో కరివేపాకు వేసి వేడి చేసి ఆ నూనెను వాడటం వల్ల తెల్ల జుట్టు సమస్య తగ్గుతుంది. ఆవనూనె ముఖ్యంగా పొడి జుట్టు ఉన్నవారికి ఎంతో మేలు చేస్తుంది. అలాగే ఆముదాన్ని కొబ్బరి నూనెతో కలిపి వాడటం వల్ల జుట్టు నల్లగా, ఒత్తుగా పెరుగుతుంది.
ఆముదం చాలా చిక్కగా ఉంటుంది కాబట్టి దానిని నేరుగా కాకుండా మరో నూనెతో కలిపి వాడటం శ్రేయస్కరం. బియ్యం కడిగిన నీటితో జుట్టును కడగడం కూడా ఒక మంచి పద్ధతి. బయట దొరికే రసాయన ఉత్పత్తుల కంటే మన ఇంట్లో దొరికే ఈ సహజ సిద్ధమైన పదార్థాలు జుట్టుకు ఎంతో రక్షణనిస్తాయి. ఓపికగా ఈ చిట్కాలు పాటిస్తే ఆరోగ్యకరమైన జుట్టు మీ సొంతమవుతుంది.
