AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Andhra Pradesh: సీన్ రివర్స్.. ఇప్పుడు వై నాట్ పులివెందుల.. క్లీన్ స్వీప్ చేసేందుకు టీడీపీ మాస్టర్ ప్లాన్..

ఆట మారింది... దశాబ్దాల చరిత్ర తిరగరాసే అసలైన సమరం మొదలైంది. అవును.. ఏపీ పాలిటిక్స్‌లో ఇప్పుడు అందరి చూపు ఆ ఒక్క నియోజకవర్గంపైనే. మొన్నటికిమొన్న  మున్సిపాలిటీల్లో గెలిచారు.. నిన్న పరిషత్‌లోనూ జెండా ఎగురవేశారు.. ఇప్పుడు క్లైమాక్స్ వార్‌కి రెడీ అయ్యారు. ఇంతకు ఆ నియోజకవర్గం ఏంటి...? ఆ నియోజకవర్గాన్ని టార్గెట్‌ చేస్తున్నదెవరు..? అక్కడ పంచాయతీ ఎన్నికల ఫలితాలు ఎలా ఉండబోతున్నాయి...?

Andhra Pradesh: సీన్ రివర్స్.. ఇప్పుడు వై నాట్ పులివెందుల.. క్లీన్ స్వీప్ చేసేందుకు టీడీపీ మాస్టర్ ప్లాన్..
Tdp Eyes Clean Sweep Across 95 Panchayats In PulivendulaImage Credit source: AI Image
Krishna S
|

Updated on: Nov 16, 2026 | 10:07 PM

Share

కడప… ఈ పేరు వినగానే టక్కున గుర్తొచ్చేది వైఎస్ ఫ్యామిలీ… ఆ తర్వాత పులివెందుల నియోజకవర్గమే.. దశాబ్దాలుగా వైసీపీకి తిరుగులేని అడ్డాగా ఉన్న ఈ గడ్డపై.. 2024 ఎన్నికల తర్వాత పొలిటికల్ సీన్ పూర్తిగా రివర్స్ అయ్యింది. కడప కోటపై పసుపు జెండా ఎగురవేయడమే లక్ష్యంగా టీడీపీ పక్కా యాక్షన్ ప్లాన్‌తో ముందుకెళ్తోంది. గతంలో వైసీపీ హయాంలో వై నాట్ కుప్పం అంటూ ఎలాగైతే టార్గెట్ చేశారో.. ఇప్పుడు దానికి రిటర్న్ గిఫ్ట్‌గా వై నాట్ పులివెందుల నినాదాన్ని టీడీపీ తెరపైకి తెచ్చింది. ఇప్పటికే మున్సిపల్, జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల్లో సత్తా చాటిన తెలుగు తమ్ముళ్లు… ఇప్పుడు పంచాయతీ ఫైట్‌తో ఫైనల్ పంచ్ ఇచ్చేందుకు రెడీ అయ్యారు.

పులివెందుల నియోజకవర్గంలోని ఏడు మండలాల పరిధిలో మొత్తం 95 గ్రామ పంచాయతీలున్నాయి. గత పంచాయతీ ఎన్నికల్లో ఇక్కడ టీడీపీ కనీసం ఖాతా కూడా తెరవలేకపోయింది. 95కి 95 పంచాయతీలను వైసీపీ క్లీన్ స్వీప్ చేసింది. కానీ ఈసారి ఆ రికార్డును బ్రేక్ చేయాలని టీడీపీ పట్టుదలతో ఉంది. 95 నాటౌట్ టార్గెట్‌తో బరిలోకి దిగుతోంది. ప్రతి పంచాయతీలోనూ బలమైన, గెలుపు గుర్రాలనే బరిలోకి దించేలా మాస్టర్ ప్లాన్ సిద్ధం చేసింది. అంతేకాదు వీలైనన్ని ఎక్కువ పంచాయతీలను ఏకగ్రీవం చేసుకోవడం ద్వారా ఎన్నికలకు ముందే ప్రత్యర్థిపై పైచేయి సాధించాలని తెలుగు తమ్ముళ్లు వ్యూహాలు రచిస్తున్నారు.

ఒకవేళ పోలింగ్ అనివార్యమైతే.. అక్కడ కూడా వైసీపీకి కనీసం ఒక్క పంచాయతీ కూడా దక్కకుండా చెక్ పెట్టేలా టీడీపీ గ్రౌండ్ వర్క్ చేస్తోంది. ఇప్పటికే మున్సిపల్, పరిషత్ ఎన్నికల్లో దెబ్బతిన్న వైసీపీ.. ఇప్పుడు పంచాయతీ పోరులోనైనా తమ పట్టు నిలుపుకోవాలని చూస్తోంది. కంచుకోటలో ఉనికి కాపాడుకోవడం వైసీపీకి సవాల్‌గా మారితే.. వరుస విజయాలతో జోష్ మీదున్న టీడీపీకి పంచాయతీ ఎన్నికలు ప్రతిష్టాత్మకంగా మారాయి. పురపోరులో గెలిచాం.. పరిషత్‌లో జెండా ఎగురవేశాం.. ఇక పంచాయతీ పోరులోనూ 100 శాతం స్ట్రైక్ రేట్ కొడతామని టీడీపీ నేతలు ఛాలెంజ్ చేస్తున్నారు.

మొత్తంగా పులివెందుల పంచాయతీ ఎన్నికలు ఏపీ రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా మారాయి. మరిత క్లీన్ స్వీప్ టార్గెట్‌తో దూసుకెళ్తున్న టీడీపీ.. వైసీపీ కంచుకోటను పూర్తిగా బద్దలు కొడుతుందా…? లేక పంచాయతీ పోరులో వైసీపీ బౌన్స్ బ్యాక్ అవుతుందా…? తెలియాలంటే ఎన్నికల ఫలితాల వరకు వేచి చూడాల్సిందే.

Follow Us