కొనాల్సిన పనే ఉండదు.. ఇంట్లోనే బంతిపూలు గుత్తులు గుత్తులుగా కాస్తాయ్.. ఇలా చేస్తే చాలు..
చలికాలం వచ్చిందంటే చాలు ఇంటి బాల్కనీలో బంతి పువ్వులు విరగబూస్తుంటే ఆ అందమే వేరు.. కానీ ఎంతో ఇష్టంగా కుండీలో పెట్టిన బంతి మొక్కకు పూలు సరిగ్గా పూయడం లేదా? మొగ్గలు రాకుండా మొక్క వాడిపోతోందా? అయితే మొక్క పెంపకంలో మీరు ఈ చిన్న తప్పులు చేస్తున్నారేమో వెంటనే చెక్ చేసుకోండి..బంతిపూలు గుత్తులు గుత్తులుగా పూయాలంటే పాటించాల్సిన ఆ సీక్రెట్ టిప్స్ ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం..

చలికాలం వచ్చిందంటే చాలు ఇల్లు, వాకిలి అందమైన పూలతో కళకళలాడాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటారు. ముఖ్యంగా చలికాలంలో విరగబూసే బంతి పువ్వులు చూడటానికి ఎంతో ఆకర్షణీయంగా ఉండటమే కాకుండా, వాటి సున్నితమైన సువాసన మనసుకు ఎంతో హాయినిస్తుంది. అయితే మీ బాల్కనీలో లేదా ఇంటి ఆవరణలో బంతి మొక్కలు ఆరోగ్యంగా పెరిగి, గుత్తులు గుత్తులుగా పువ్వులు పూయాలంటే పెంపకంలో కొన్ని చిన్న జాగ్రత్తలు తీసుకోవాలి. బంతి మొక్కలు ఏపుగా పెరగాలంటే ముందుగా మట్టి విషయంలో జాగ్రత్త పడాలి. నీరు నిలిచిపోతే వేర్లు కుళ్లిపోయే ప్రమాదం ఉంది కాబట్టి నీరు సులభంగా ఇంకిపోయే మట్టిని సిద్ధం చేసుకోవాలి. మొక్క నాటడానికి కనీసం 8 నుంచి 10 అంగుళాల సైజు ఉన్న మట్టి కుండీని ఎంచుకోవడం ఉత్తమం. కుండీ అడుగు భాగంలో అదనపు నీరు బయటకు వెళ్లేందుకు తగినన్ని రంధ్రాలు ఉండేలా చూసుకోవాలి.
కనీసం 7-8 గంటల ఎండ తప్పనిసరి
బంతి మొక్క ఆరోగ్యంగా ఎదగడానికి, ఎక్కువ మొగ్గలు వేయడానికి సూర్యరశ్మి చాలా కీలకం. అందువల్ల కుండీని ప్రతిరోజూ కనీసం 7 నుంచి 8 గంటల పాటు నేరుగా ఎండ తగిలే ప్రదేశంలో ఉంచాలి. తగినంత సూర్యరశ్మి అందితేనే మొక్క బలంగా పెరిగి పువ్వులు బాగా వికసిస్తాయి.
నీరు – చీడపీడల నివారణ
మొక్కకు ఎప్పుడూ అధికంగా నీరు పోయకూడదు. కుండీలోని పైమట్టి ఆరిందో లేదో గమనించిన తర్వాతే తగినంత నీరు అందించాలి. ఇక బంతి మొక్కలపై తరచుగా శిలీంధ్ర వ్యాధులు, నల్ల కీటకాలు దాడి చేస్తుంటాయి. ఆకులను ఎప్పటికప్పుడు గమనిస్తూ, కీటకాల దాడి కనిపిస్తే సరైన మోతాదులో వేప నూనె ద్రావణాన్ని పిచికారీ చేయడం ద్వారా మొక్కను సురక్షితంగా కాపాడుకోవచ్చు.
కొమ్మల కత్తిరింపు – ఆధారం ఇవ్వడం
అన్నీ సరిగ్గా చేసినా మొక్కకు మొగ్గలు రాకపోతే, సరైన సమయంలో కొమ్మల చివర్లను కత్తిరించకపోవడమే కారణం కావచ్చు. కొమ్మల చివర్లను కత్తిరించడం వల్ల కొత్త రెమ్మలు వచ్చి ఎక్కువ పూలు పూస్తాయి. అలాగే, ఎక్కువ ఎరువులు వేయడం కూడా మానుకోవాలి. మొక్కకు పువ్వులు బాగా పూసినప్పుడు వాటి బరువుకు కొమ్మలు వంగి విరిగిపోయే అవకాశం ఉంటుంది. అలా జరగకుండా మొక్కకు సన్నని చెక్క కర్రలు లేదా పుల్లలతో ఆధారాన్ని కట్టాలి.
