AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Panchakshari Mantra: ఓం నమః శివాయకు ఇన్ని రూపాలున్నాయా? పంచాక్షరిలోని రకాల గురించి తెలుసా?

Panchakshari Mantra Significance Telugu: ఓం నమః శివాయ.. పరమశివుడికి అత్యంత ప్రీతికరమైన పంచాక్షరి మంత్రం. అయితే ఈ మంత్రానికి ఆరు రకాలు ఉన్నాయని మీకు తెలుసా? స్థూల, సూక్ష్మ, కారణ పంచాక్షరి సహా వాటి ఆధ్యాత్మిక విశిష్టత, జీవాత్మ-పరమాత్మ సంబంధం గురించి వివరంగా తెలుసుకుందాం.

Panchakshari Mantra: ఓం నమః శివాయకు ఇన్ని రూపాలున్నాయా? పంచాక్షరిలోని రకాల గురించి తెలుసా?
Panchakshari Mantra Significance
Rajashekher G
|

Updated on: Nov 16, 2026 | 7:44 PM

Share

Panchakshari Mantra Significance Telugu: హిందూ ఆధ్యాత్మిక సంప్రదాయంలో పరమశివుడిని ఆరాధించడానికి ఎన్నో మంత్రాలు ఉన్నాయి. వాటిలో అత్యంత శక్తివంతమైన, పవిత్రమైన మంత్రంగా’ఓం నమః శివాయ’ను భావిస్తారు. దీనినే పంచాక్షరి మంత్రం అంటారు. ఈ మంత్రాన్ని భక్తితో జపించడం వల్ల మనసుకు ప్రశాంతత, ఆధ్యాత్మిక చింతన, శివుడి అనుగ్రహం లభిస్తాయని భక్తుల విశ్వాసం. అయితే పంచాక్షరి మంత్రంలో వివిధ రూపాలు ఉన్నాయని ఆధ్యాత్మిక గ్రంథాలు చెబుతున్నాయి.

పంచాక్షరిలో రూపాలు:

  • స్థూల పంచాక్షరి: నమశ్శివాయ
  • సూక్ష్మ పంచాక్షరి: శివాయ నమః
  • కారణ పంచాక్షరి: శివాయ శివ
  • మహాకారణ పంచాక్షరి: శివాయ
  • మహామనువు లేదా ముక్తి పంచాక్షరి: శి

ఈ మంత్రంలోని ప్రతి అక్షరానికి ప్రత్యేకమైన ఆధ్యాత్మిక అర్థం ఉంది. ‘నమః’ అంటే నమస్కారం అని అర్థం. ‘శివాయ నమః’ అంటే పరమశివుడికి నమస్కారాలు సమర్పించడం. దేహదృష్టితో చూసినప్పుడు జీవుడు శివుడికి సేవకుడిగా భావించబడతాడు. అయితే ఆధ్యాత్మిక దృష్టితో పరిశీలిస్తే ఇందులో మరింత లోతైన తత్వం కనిపిస్తుంది.

‘నమః’ అనే పదం జీవాత్మను, ‘శివ’ అనే పదం పరమాత్మను సూచిస్తాయని ఆధ్యాత్మిక వివరణలు చెబుతాయి. ఇక ‘ఆయ’ అనే పదం జీవాత్మ, పరమాత్మల మధ్య ఉన్న సంబంధాన్ని, ఏకత్వ భావనను తెలియజేస్తుంది. ఈ విధంగా ‘శివాయ నమః’ అనే మంత్రం జీవాత్మ, పరమాత్మల ఏకత్వాన్ని గుర్తుచేస్తుంది. ఇది ఉపనిషత్తుల్లోని ‘తత్త్వమసి’ అనే మహావాక్య భావనకు దగ్గరగా ఉంటుంది.

ఇవి కూడా చదవండి

ప్రణవ మంత్రం (ఓంకారం), పంచాక్షరి మంత్రం రెండూ శివతత్వాన్ని తెలియజేసే పవిత్రమైన మంత్రాలుగా భావిస్తారు. వీటిని ఒకే ఆధ్యాత్మిక సత్యానికి బాహ్య, అంతర స్వరూపాలుగా ఉపమానిస్తారు. వరి గింజకు పొట్టు, లోపల బియ్యం ఎలా విడదీయలేని సంబంధం కలిగి ఉంటాయో, ప్రణవం, పంచాక్షరి కూడా అంతే పవిత్రమైన సంబంధాన్ని కలిగి ఉంటాయని వివరిస్తారు.

అంతేకాకుండా పంచాక్షరిలోని ఐదు అక్షరాలు శివుడి ఐదు దివ్యకార్యాలను సూచిస్తాయి. అవి సృష్టి, స్థితి, సంహారం, తిరోధానం, అనుగ్రహం. అలాగే ఇవి పంచభూతాలైన భూమి, నీరు, అగ్ని, వాయువు, ఆకాశాలకు ప్రతీకలుగా కూడా వివరించబడతాయి. ఈ ఐదు భూతాల కలయికతోనే సమస్త సృష్టి ఏర్పడిందని హిందూ తత్వశాస్త్రం చెబుతుంది. అందుకే పంచాక్షరి మంత్రం కేవలం శివనామ స్మరణ మాత్రమే కాదు.. సృష్టి రహస్యాన్ని, జీవాత్మ పరమాత్మ సంబంధాన్ని తెలియజేసే గొప్ప ఆధ్యాత్మిక మంత్రంగా భక్తులు భావిస్తారు.

(Disclaimer: ఈ కథనంలో పేర్కొన్న విషయాలు హిందూ ఆధ్యాత్మిక సంప్రదాయాలు, మత విశ్వాసాలు, తాత్విక వివరణల ఆధారంగా అందించబడ్డాయి. వీటిని భక్తి, ఆధ్యాత్మిక దృక్కోణంలో మాత్రమే పరిగణించాలి.)

మరిన్ని ఆసక్తికర ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us