ఉల్లిపాయలపై నల్లటి మచ్చల వెనక ఇంత పెద్ద కథ ఉందా..? తింటే ఏమవుతుందో తెలుసుకోండి..
వంటింట్లో ఉల్లిపాయలు కోసేటప్పుడు వాటిపై నల్లటి మచ్చలు లేదా పొడి కనిపిస్తే ఏం చేస్తారు? సాధారణ మట్టి మచ్చలే కదా అని పైపొర తీసేసి, నీళ్లతో కడిగి కూరల్లో వేస్తున్నారా? అయితే వెంటనే జాగ్రత్త పడండి.. ఆ నల్లటి మచ్చలు మట్టి కాదు.. అది మీ ఆరోగ్యాన్ని దెబ్బతీసే ప్రమాదకరమైన ఫంగస్ కావొచ్చు. అసలు ఏ ఉల్లిపాయలు వాడాలి, వేటిని పారేయాలో ఇప్పుడు తెలుసుకుందాం..

మన వంటింట్లో ప్రతిరోజూ తప్పనిసరిగా వాడే కూరగాయలలో ఉల్లిపాయలు మొదటి స్థానంలో ఉంటాయి. కూరల నుంచి పచ్చి సలాడ్ల వరకు ఉల్లిపాయ లేనిదే రుచి రాదు. ఇవి జీర్ణక్రియను మెరుగుపరచడంతో పాటు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. అయితే మనం తరచుగా ఉల్లిపాయల తొక్క ఒలిచినప్పుడు వాటిపై నల్లటి పొడి లాంటి మచ్చలను గమనిస్తుంటాం. చాలామంది వీటిని సాధారణ మట్టి మచ్చలుగా భావించి, పైపొరను తీసేసి లేదా నీటితో కడిగేసి వంటల్లో వాడేస్తుంటారు. కానీ, ఇలా చేయడం ఆరోగ్యానికి తీవ్ర హాని కలిగిస్తుందని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.
అసలు ఈ నల్ల మచ్చలు ఏంటి..?
ఉల్లిపాయలపై కనిపించే ఈ నల్లటి మచ్చలు సాధారణ మురికి కాదు.. అది ఒక రకమైన బూజు. సాధారణంగా మట్టిలో ఉండే ఆస్పెర్‌గిల్లస్ నైగర్ అనే శిలీంధ్రం వల్ల ఉల్లిపాయలపై ఈ నల్లటి మచ్చలు ఏర్పడతాయి. ఉల్లిపాయలు మట్టిలో పెరుగుతాయి కాబట్టి తేమ, సరిగ్గా నిల్వ చేయకపోవడం వల్ల ఈ ఫంగస్ వాటిపై వేగంగా వృద్ధి చెందుతుంది.
ఎవరికి ఎక్కువ ప్రమాదం?
ఈ శిలీంధ్రం అందరికీ తీవ్రమైన ప్రాణాపాయం కలిగించకపోయినా, కొన్ని వర్గాల వారికి మాత్రం ప్రమాదకరంగా మారవచ్చు.
ఆస్తమా – శ్వాసకోశ సమస్యలు ఉన్నవారు: బూజుకు సంబంధించిన సూక్ష్మ కణాలు గాలి ద్వారా శ్వాసలోకి ప్రవేశించి శ్వాసకోశ అలెర్జీలను, ఆస్తమా లక్షణాలను తీవ్రతరం చేస్తాయి.
రోగనిరోధక శక్తి తక్కువగా ఉన్నవారు: ఇమ్యూనిటీ బలహీనంగా ఉన్నవారు, షుగర్ లేదా ఇతర దీర్ఘకాలిక అనారోగ్యాలతో బాధపడేవారు ఆహార పరిశుభ్రత విషయంలో చాలా అప్రమత్తంగా ఉండాలి. వీరు బూజు పట్టిన ఉల్లిపాయలను తింటే ఇన్ఫెక్షన్లు వచ్చే అవకాశం ఉంది.
ఏ ఉల్లిపాయలు వాడాలి? వేటిని పారేయాలి?
ఉల్లిపాయపై నల్లటి మచ్చలు కేవలం పై పొట్టుపై మాత్రమే ఉంటే, ఆ పొరను పూర్తిగా తీసివేసి, ఉల్లిపాయను శుభ్రంగా కడిగి లోపలి భాగాన్ని నిశితంగా పరిశీలించాలి. ఒకవేళ నల్లటి మచ్చలు లోపలి పొరలపై కూడా వ్యాపించి ఉంటే, ఆ ఉల్లిపాయను అస్సలు తినకూడదు. కేవలం మచ్చ ఉన్న భాగాన్ని కట్ చేసి మిగిలినది వాడటం కూడా సురక్షితం కాదు. ఉల్లిపాయ మెత్తగా మారినా, కుళ్లినట్లు అనిపించినా, లేదా ఏదైనా అసాధారణ వాసన వస్తున్నా వెంటనే పారవేయడమే ఉత్తమం.
ఉల్లిపాయలు పాడవకుండా ఎలా నిల్వ చేయాలి?
ఉల్లిపాయలను ఎప్పుడూ తేమ లేని, పొడిగా మరియు గాలి బాగా తగిలే ప్రదేశంలో నిల్వ చేయాలి. వీటిని ఎట్టి పరిస్థితుల్లోనూ బంగాళాదుంపలతో కలిపి ఉంచకూడదు. బంగాళాదుంపల నుంచి విడుదలయ్యే తేమ, వాయువుల వల్ల ఉల్లిపాయలు త్వరగా కుళ్లిపోయి బూజు పట్టే అవకాశం ఉంటుంది. సగం కోసిన ఉల్లిపాయలను బయట గాలికి వదిలేయకుండా, గాలి చొరబడని డబ్బాలో పెట్టి ఫ్రిజ్‌లో నిల్వ చేసుకోవాలి.
