Parenting: పిల్లలను ఒంటరిగా వదిలి పనికెళ్తున్నారా?.. ఈ 5 విషయాలు గుర్తుంచుకోండి!
ఉరుకులు పరుగుల జీవితంలో చాలామంది తల్లిదండ్రులు పనిలో నిమగ్నమై ఉంటారు. దానివల్ల పిల్లలను ఒంటరిగా ఇంట్లో వదిలి వెళ్ళడం తప్పనిసరి అవుతుంది. కానీ, ఒక్క చిన్న పొరపాటు కూడా పిల్లలను ఆందోళనకు గురిచేయవచ్చు. అయితే, కొన్ని చిన్నపాటి జాగ్రత్తలు తీసుకుంటే ఈ పరిస్థితిని సురక్షితంగా మార్చవచ్చు. పిల్లలను ఒంటరిగా వదిలేటప్పుడు ప్రతి తల్లిదండ్రి తప్పనిసరిగా చేయాల్సిన 5 పనులు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం.

ఈ రోజుల్లో పిల్లలను ఇంట్లో ఒంటరిగా వదిలి వెళ్లడం తల్లిదండ్రులకు ఒక సవాలుగా మారింది. పని ఒత్తిడి, సమయం లేకపోవడం లాంటి కారణాల వల్ల ఇది తప్పనిసరి అవుతోంది. కానీ, ఇటీవల కాలంలో ఇంట్లో ఒంటరిగా ఉన్న పిల్లలపై జరిగిన దాడులు, లైంగిక వేధింపులు, ప్రమాదాలు తల్లిదండ్రులను కలవరపెడుతున్నాయి. అపరిచితులు సులభంగా లోపలికి రావడం, ప్రమాదవశాత్తు ఇంట్లో అగ్ని ప్రమాదాలు వంటి దారుణాలు కూడా జరుగుతున్నాయి. ఈ పరిస్థితిలో తల్లిదండ్రులు తమ పిల్లలను ఇంట్లో ఒంటరిగా వదిలి వెళ్ళే ముందు కొన్ని ముఖ్యమైన జాగ్రత్తలు పాటించాలి.
తల్లిదండ్రులు చేయాల్సిన 5 పనులు:
భద్రతా నియమాలు నేర్పండి: పిల్లలకు కొన్ని ప్రాథమిక భద్రతా నియమాలు నేర్పండి. గ్యాస్ స్టవ్, విద్యుత్ ఉపకరణాలు వాడకూడదని చెప్పండి. అపరిచితులకు తలుపు తెరవకూడదని స్పష్టం చేయండి. ఫోన్, ఇంటర్నెట్ సరిగా వాడటం నేర్పండి.
అవసరమైన ఫోన్ నంబర్లు సిద్ధంగా ఉంచండి: దగ్గరి బంధువులు, పొరుగింటివారి, అత్యవసర సేవల నంబర్లు (100, 101, 108) వారికి గుర్తు చేయండి. నంబర్లను రాసి ఫ్రిజ్‌పై అతికించండి.
ఇంటిని సురక్షితం చేయండి: పనికి వెళ్లే ముందు ఇంట్లో ప్రమాదకర వస్తువులు లేకుండా చూసుకోండి. పదునైన వస్తువులు, మందులు వారికి అందకుండా జాగ్రత్తపడండి. కీలు పడేశాక ఇంట్లో మూసిపెట్టండి.
ఆహారం సిద్ధం చేయండి: పిల్లలకు ఆకలి వేస్తే వారే వంట చేయడానికి ప్రయత్నించవచ్చు. దీనివల్ల ప్రమాదం ఉంటుంది. అందుకే బయటకు వెళ్లే ముందు తినడానికి సులభంగా ఉండే ఆహారాన్ని ఫ్రిజ్‌లో లేదా టేబుల్‌పై ఉంచండి.
పిల్లలతో నిరంతరం సంప్రదింపులు జరపండి: మధ్యమధ్యలో ఫోన్ చేయండి. వీడియో కాల్ ద్వారా మాట్లాడండి. ఇది పిల్లలకు ఒంటరితనాన్ని దూరం చేస్తుంది. వారి ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. పిల్లలను ఒంటరిగా వదిలి వెళ్ళడం కొన్నిసార్లు తప్పనిసరి. కానీ, ఈ జాగ్రత్తలతో ఆ పరిస్థితిని సురక్షితంగా చేయవచ్చు.




