మీ గ్యాస్ స్టవ్ బర్నర్లు నల్లగా మారి మంట తక్కువ వస్తుందా.. ఇలా చేస్తే కొత్తవాటిలా మెరిసిపోతాయ్..
వంటింట్లో గ్యాస్ బర్నర్లు నల్లబడి, మంట సరిగ్గా రావడం లేదా? అయితే ఈ సమస్యను తేలిగ్గా తీసిపారేయకండి.. రంధ్రాలు మూసుకుపోయిన బర్నర్ల వల్ల గ్యాస్ వృథా అవ్వడమే కాకుండా ప్రమాదకరమైన విష వాయువులు విడుదలవుతాయని తాజా అధ్యయనాలు హెచ్చరిస్తున్నాయి. ఎలాంటి ఖరీదైన కెమికల్స్ వాడకుండా ఇంట్లోనే దొరికే సాధారణ వస్తువులతో నల్లబడిన బర్నర్లను నిమిషాల్లో కొత్తవాటిలా ఎలా మెరిపించవచ్చో తెలుసుకుందాం..

వంటింట్లో ప్రతిరోజూ మహిళలకు గ్యాస్ స్టవ్ నిర్వహణ అత్యంత ముఖ్యం. వంట చేసే సమయంలో పాలు, నూనె, పులుసులు పొంగి బర్నర్లపై పడటం సర్వసాధారణం. అయితే వాటిని ఎప్పటికప్పుడు శుభ్రం చేయకుండా వదిలేస్తే, ఆ జిడ్డు వేడికి బాగా గట్టిపడి నల్లటి మసి మరకలుగా మారుతుంది. కాలక్రమేణా బర్నర్‌లోని చిన్న చిన్న రంధ్రాలు మూసుకుపోయి మంట సమానంగా రాదు. ఫలితంగా గ్యాస్ వృథా అవ్వడమే కాకుండా వంట పాత్రల అడుగుభాగం పూర్తిగా నల్లబడిపోతుంది. దీని కోసం ఖరీదైన కెమికల్ క్లీనర్లు కొనాల్సిన పనిలేదు. ఇంట్లో దొరికే బేకింగ్ సోడా, డిష్‌వాషింగ్ లిక్విడ్‌లను ఉపయోగించి బర్నర్లను తక్కువ శ్రమతో తళతళలాడేలా మెరిపించవచ్చు.
బర్నర్లలో మురికి పేరుకుంటే ఆరోగ్యానికి ముప్పే
చాలామంది బర్నర్లు నల్లబడినా, మంట సరిగ్గా రాకపోయినా పెద్దగా పట్టించుకోరు. కానీ ఎన్విరాన్‌మెంటల్ సైన్స్ – టెక్నాలజీ జర్నల్‌లో ప్రచురితమైన ఓ అధ్యయనం ఈ విషయంలో తీవ్ర హెచ్చరికలు జారీ చేసింది. ఐదు రకాల ఎల్‌పీజీ గ్యాస్ స్టవ్‌లపై సుమారు 89 రకాల ప్రయోగశాల పరీక్షలు నిర్వహించిన పరిశోధకులు ఒక కీలక విషయాన్ని వెల్లడించారు. బర్నర్ రంధ్రాలు మూసుకుపోయి, సరిపడా గాలి అందనప్పుడు ఇంధనం పూర్తిగా మండదు. దీంతో సాధారణంగా రావాల్సిన స్వచ్ఛమైన నీలి రంగు మంట స్థానంలో ప్రమాదకరమైన పసుపు రంగు మంట వస్తుంది. ఇలాంటి అసంపూర్ణ దహనం వల్ల ఇంట్లోని గాలిలోకి అత్యంత ప్రమాదకరమైన కార్బన్ మోనాక్సైడ్ వాయువుతో పాటు నల్లటి మసి సూక్ష్మ కణాలు భారీగా విడుదలవుతాయి. ఇవి ఇంట్లోని వారి శ్వాసకోశ ఆరోగ్యంపై తీవ్ర ప్రతికూల ప్రభావాన్ని చూపుతాయి.
ఇంట్లోనే బర్నర్లను శుభ్రం చేసుకునే సులభమైన పద్ధతులు
బేకింగ్ సోడా పద్ధతి
కావలసినవి: 3 చెంచాల బేకింగ్ సోడా, 1 చెంచా నీరు, మృదువైన బ్రష్, పొడి గుడ్డ.
చేసే విధానం:
- ముందుగా సిలిండర్ రెగ్యులేటర్‌ను ఆపివేసి, స్టవ్ పూర్తిగా చల్లబడేవరకు ఆగాలి.
- బర్నర్ క్యాప్‌లను జాగ్రత్తగా వేరు చేయాలి.
- బేకింగ్ సోడాలో కొద్దిగా నీరు కలిపి చిక్కటి పేస్ట్‌లా తయారుచేయాలి.
- ఈ పేస్ట్‌ను బర్నర్లపై ఉన్న నల్లటి మరకలకు పూసి 15 నుంచి 20 నిమిషాల పాటు వదిలేయాలి.
- అనంతరం పాత బ్రష్‌తో సున్నితంగా రుద్దితే మొండి జిడ్డు సులభంగా వదిలిపోతుంది. ఆపై శుభ్రమైన నీటితో కడిగి ఆరబెట్టాలి.
ముఖ్య గమనిక: బేకింగ్ సోడాను బర్నర్ వెంట్లపైన లేదా మంటలను నిరోధించే సున్నితమైన భాగాలపై నేరుగా రాయకూడదు. కొన్ని రకాల అల్యూమినియం, కోటెడ్ లోహాలకు ఇది సరిపడకపోవచ్చు.
డిష్‌వాషింగ్ లిక్విడ్ పద్ధతి
కావలసినవి: గోరువెచ్చని నీరు, కొన్ని చుక్కల డిష్‌వాషింగ్ లిక్విడ్, సాఫ్ట్ స్పాంజ్.
చేసే విధానం
- గోరువెచ్చని నీటిలో డిష్‌వాషింగ్ లిక్విడ్ వేసి బాగా కలపాలి.
- ఈ నీటిలో బర్నర్ క్యాప్‌లను 15 నుంచి 20 నిమిషాలు నానబెట్టాలి.
- నూనె జిడ్డు వదిలిన తర్వాత స్పాంజ్‌తో రుద్ది, మంచి నీటితో కడగాలి.
గ్యాస్ స్టవ్ నిర్వహణలో తప్పక పాటించాల్సిన జాగ్రత్తలు
- వంట పూర్తయి స్టవ్ చల్లారిన వెంటనే నూనె మరకలను తడి గుడ్డతో తుడిచివేయాలి.
- పాలు, పప్పు, పులుసులు పొంగి బర్నర్ రంధ్రాలలోకి చేరకుండా చూసుకోవాలి.
- రంధ్రాల్లో ఇరుక్కున్న మురికిని తొలగించడానికి సన్నటి పిన్ను లేదా సూదిని ఉపయోగించవచ్చు. అయితే రంధ్రాలు పెద్దవి కాకుండా సున్నితంగా శుభ్రం చేయాలి.
- బర్నర్లను శుభ్రం చేశాక పూర్తిగా ఆరిన తర్వాత మాత్రమే స్టవ్‌పై బిగించాలి. తడి ఉంటే మంట సరిగ్గా మండదు.
- బర్నర్ క్యాప్‌లు సరిగ్గా ఫిట్ అయ్యాయో లేదో చూసుకున్న తర్వాతే వెలిగించాలి.
- అన్ని జాగ్రత్తలు తీసుకున్నా బర్నర్ నుంచి నిరంతరం పసుపు రంగు మంట వస్తున్నా, పాత్రల అడుగున మసిపడుతున్నా వెంటనే గ్యాస్ కంపెనీ టెక్నీషియన్‌తో స్టవ్‌ను చెక్ చేయించాలి.
