Health Tips: ఈ సంకేతాలు కనిపిస్తే ఉప్పు ఎక్కువగా తింటున్నారని హెచ్చరిక.. రోజుకి ఎంత ఉప్పు తినాలంటే…
ఉప్పు శరీరానికి అవసరం. అయితే అతి సర్వత్రా వర్జయేత్ అన్నట్లుగా రుచి కోసం అంటూ ఉప్పుని అపరిమిత పరిమాణంలో.. శరీరానికి కావాల్సిన దానికన్నా ఎక్కువగా తీసుకుంటే.. అది ఆరోగ్యంపై చెడు ప్రభావాన్ని చూపుతుంది. ఎక్కువ ఉప్పు తినడం వల్ల శరీరం కొన్ని సంకేతాల ద్వారా హెచ్చరిస్తుంది. ఆ సంకేతాలు ఏమిటి? ఒక రోజులో ఎంత ఉప్పు తినాలో నిపుణులు చెప్పిన విషయాల గురించి తెలుసుకుందాం

ఉప్పు ఆహారం లేదా ఏదైనా పానీయం రుచిని పెంచడంలో సహాయపడుతుంది. ఇది శరీరానికి అనేక విధాలుగా ప్రయోజనకరంగా ఉంటుంది. అయితే దీనిని పరిమిత పరిమాణంలో తీసుకోవాలి, ఎందుకంటే దీనిని అధికంగా తీసుకోవడం వల్ల ఆరోగ్యానికి హాని కలుగుతుంది. ముఖ్యంగా అధిక రక్తపోటు, మూత్రపిండాలు , గుండె సంబంధిత వ్యాధుల ప్రమాదాన్ని పెంచుతుంది. కనుక ఆహారంలో ఉప్పుని తక్కువగా తీసుకోవడం మంచిది.
అయితే ఎవరు ఎన్ని చెప్పినా కొంతమంది ఉప్పు లేకపోతే తినలేం అంటూ రోజూ తినే ఆహారంలో ఎక్కువ ఉప్పును ఉపయోగిస్తారు. దీని ప్రభావం కొంత సమయం తర్వాత వారి ఆరోగ్యంపై కనిపిస్తుంది. అయితే శరీరంలో ఉప్పు ఎక్కువగా ఉందని శరీరం కొన్ని సంకేతాల ద్వారా తెలియజేస్తుంది. వీటిని గుర్తించి తద్వారా రోజూ ఎక్కువ ఉప్పు తీసుకుంటున్నామని గుర్తించి.. ఈ అలవాటుని తగ్గించుకోవచ్చని నిపుణులు చెబుతున్నారు. ఆ సంకేతాలు ఏమిటో ఈ రోజు తెలుసుకుందాం.
ఎక్కువ ఉప్పు తింటే కనిపించే సంకేతాలు ఏమిటంటే అపోలో స్పెక్ట్రా హాస్పిటల్‌లోని ఇంటర్నల్ మెడిసిన్ కన్సల్టెంట్ డాక్టర్ రోహిత్ శర్మ మాట్లాడుతూ ఎక్కువ ఉప్పు తినడం వల్ల ఆరోగ్యానికి హాని కలుగుతుందని.. దీనిని అర్థం చేసుకోవడం, ఉప్పు పరిమాణాన్ని పరిమితం చేయడం చాలా ముఖ్యమని చెప్పారు. ఉప్పు ఎక్కువగా తీసుకుంటే కడుపులో తరచుగా వాపు, వేళ్లు లేదా పాదాలలో వాపు, తలనొప్పి, రక్తపోటు పెరగడం లేదా తరచుగా దాహం వంటి లక్షణాలు కనిపిస్తాయి. ఎవరికైనా ఈ సంకేతాలు కనిపిస్తే మీరు ఎక్కువ ఉప్పు తీసుకుంటున్నారని అర్ధం. అటువంటి వ్యక్తులు వెంటనే వైద్య నిపుణుడిని సంప్రదించాలని తెలిపారు.
ఈ విషయాలను జాగ్రత్తగా చూసుకోండి ఎక్కువ ఉప్పు తినడం వల్ల శరీరంలో నీరు నిలిచిపోతుంది. అప్పుడు శరీరం వాపు, రక్తపోటు పెరుగుదలకు దారితీస్తుంది. మూత్రపిండాలపై ఒత్తిడిని కూడా కలిగిస్తుంది. గుండె సంబంధిత సమస్యల ప్రమాదాన్ని పెంచుతుంది. అందువల్ల ఉప్పుని తక్కువ మొత్తంలో తీసుకోవాలి. ముఖ్యంగా తాజా ఆహారాన్ని తినడానికి ప్రయత్నించండి. ప్యాక్ చేసిన, జంక్ ఫుడ్ వంటి ప్రాసెస్ చేసిన ఆహారాన్ని తీసుకోవడం తగ్గించండి. ఎందుకంటే వీటిల్లో అధిక మొత్తంలో ఉప్పు ఉంటుంది. రుచి కోసం ఆహారంలో ఉప్పును తగ్గించి..పరిమిత పరిమాణంలో మూలికలు, సుగంధ ద్రవ్యాలను ఉపయోగించవచ్చు.
ఒక రోజులో ఎంత ఉప్పు తినాలంటే ఒక వ్యక్తికి ఒక రోజులో 5 గ్రాముల ఉప్పుని తినడం మంచిదని.. అది శరీరంలో 2000 మిల్లీగ్రాముల సోడియంను పూర్తి చేస్తుందని నిపుణులు అంటున్నారు. ఎందుకంటే ఎక్కువ ఉప్పు తీసుకోవడం వల్ల శరీరంలో సోడియం పరిమాణం పెరుగుతుంది. ఇది రక్తపోటుకు సంబంధించిన సమస్యలను కలిగిస్తుంది. అంతేకాదు అధిక రక్తపోటు లేదా మూత్రపిండాల సమస్యలు వంటి వాటితో ఇబ్బంది పడేవారు తక్కువ ఉప్పు తీసుకోవడం మంచిది.
మరిన్ని లైఫ్ స్టైల్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..
(NOTE: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణులు అందించిన సమాచారం ప్రకారం ఇక్కడ తెలియజేయడమైనది. ఆరోగ్యరీత్యా ఎలాంటి సమస్యలు ఉన్నానేరుగా వైద్య నిపుణులను సంప్రదించడం మంచిది)








