Winter: చలికాలం ఈ కూరగాయల్ని తినకుండా ఉండటమే ఆరోగ్యానికి మంచిది! ఎందుకో తెలుసా?
చలికాలంలో మన ఆరోగ్యాన్ని కాపాడుకోవడంలో ఆహారం కీలక పాత్ర పోషిస్తుంది. ఈ సీజన్‌లో శరీరం నెమ్మదిగా పనిచేస్తుంది. అనారోగ్య సమస్యలు త్వరగా దరిచేరుతాయి. కాబట్టి, మనం తినే కూరగాయల ఎంపిక చాలా ముఖ్యం. కొన్ని కూరగాయలు శరీరానికి వేడిని అందించి రోగనిరోధక శక్తిని పెంచితే ..

చలికాలంలో మన ఆరోగ్యాన్ని కాపాడుకోవడంలో ఆహారం కీలక పాత్ర పోషిస్తుంది. ఈ సీజన్‌లో శరీరం నెమ్మదిగా పనిచేస్తుంది. అనారోగ్య సమస్యలు త్వరగా దరిచేరుతాయి. కాబట్టి, మనం తినే కూరగాయల ఎంపిక చాలా ముఖ్యం. కొన్ని కూరగాయలు శరీరానికి వేడిని అందించి రోగనిరోధక శక్తిని పెంచితే, మరికొన్ని కఫం, జలుబు వంటి సమస్యలను పెంచుతాయి. చలికాలంలో ఏవి అనారోగ్య సమస్యలను తగ్గిస్తాయి. వేటిని తీసుకుంటే ఆరోగ్యం బాగుంటుంది. చలికాలంలో ఏ కూరగాయలు తినాలి, ఏవి తినకూడదు. అనే విషయాలు తెలుసుకుందాం…
ఆకుకూరలు
చలికాలంలో ఆకుకూరలు తినడం ఆరోగ్యానికి ఎంతో మంచిది. పాలకూర, మెంతికూర, బచ్చలికూర, చుక్కకూర వంటి ఆకుకూరల్లో విటమిన్ A, C, K, ఐరన్, కాల్షియం వంటి పోషకాలు అధికంగా ఉంటాయి. ఇవి శరీరంలో రోగనిరోధక శక్తిని పెంపొందిస్తాయి. ముఖ్యంగా పాలకూరలో ఉండే యాంటీఆక్సిడెంట్స్ శరీరాన్ని లోపల నుంచి వేడిగా ఉంచడంలో సహాయపడతాయి.
రూట్ వెజిటెబుల్స్
క్యారెట్, బీట్‌రూట్, ముల్లంగి వంటి రూట్ వెజిటెబుల్స్ చలికాలానికి సరైన ఎంపిక అని చెప్పవచ్చు. ఇవి భూమిలో పెరుగుతాయి కాబట్టి సహజంగానే వేడి స్వభావాన్ని కలిగి ఉంటాయి. ఈ కూరగాయలు శరీరానికి లోపల నుంచి వేడిని అందిస్తాయి. క్యారెట్, బీట్‌రూట్‌లో ఉండే బీటా-కెరోటిన్, ఐరన్ రక్తహీనత సమస్యను తగ్గించడంలో సహాయపడతాయి. వీటిని సలాడ్లు, సూప్‌లు లేదా కూరల రూపంలో తీసుకోవడం ఉత్తమం.
కాలీఫ్లవర్, బ్రోకలీ, క్యాబేజీ వంటి క్రూసిఫెరస్ వెజిటెబుల్స్ కూడా చలికాలంలో శరీరానికి చాలా మేలు చేస్తాయి. వీటిలో ఫైబర్, విటమిన్ సి పుష్కలంగా లభిస్తాయి. ఇవి శరీరానికి వేడిని ఇవ్వడంతో పాటు, దేహంలోని టాక్సిన్లను బయటకు పంపుతాయి. విటమిన్ సి చలికాలంలో వచ్చే సాధారణ జలుబు, దగ్గు వంటి సమస్యలను నియంత్రిస్తుంది. దొండకాయ, బెండకాయ వంటివి కూడా తేలికగా జీర్ణమవుతాయి కాబట్టి ఈ సీజన్‌లో తీసుకోవచ్చు.
చలికాలంలో దూరంగా ఉంచాల్సిన కూరగాయలు
చలికాలంలో కఫం, జలుబు సమస్యలు పెరగకుండా ఉండాలంటే శరీరంలో చలిని పెంచే కొన్ని కూరగాయలకు దూరంగా ఉండటం మంచిది. దోసకాయ, బీరకాయ, కాకరకాయ వంటి కూరగాయల్లో అధికంగా నీరు ఉంటుంది. వీటిని ఉదయం లేదా రాత్రి తీసుకుంటే కఫం, జలుబు సమస్యలు మరింత ఎక్కువయ్యే అవకాశం ఉంది. ఎందుకంటే ఇవి శరీరంలో చలిని పెంచుతాయి.
అలాగే, టమాటను కూడా చలికాలంలో మితంగా తీసుకోవాలి. ఇది కొందరికి కడుపు సంబంధిత సమస్యలను తీసుకురావచ్చు. ముఖ్యంగా గ్యాస్, అసిడిటీ, కిడ్నీ సమస్యలు ఉన్నవారు చలికాలంలో టమాట తినడం తగ్గించాలి. చింతపండు, గుమ్మడికాయ కూడా కొన్ని సందర్భాల్లో శరీరంలో చలిని మరింత పెంచవచ్చు కాబట్టి వీటిని కూడా మితంగా తినడం మంచిది.
ఫ్రిజ్‌లో ఎక్కువ రోజులు నిల్వ చేసిన కూరగాయలు చలికాలంలో శరీరానికి హానికరం. వాటిని తినడం వల్ల రోగనిరోధక శక్తి తగ్గి సీజనల్ ఇన్ఫెక్షన్లు రావడానికి కారణమవుతాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. కాబట్టి, చలికాలంలో మీ ఆహారంలో వేడిని, రోగనిరోధక శక్తిని పెంచే కూరగాయలను చేర్చుకోవడం ద్వారా ఆరోగ్యంగా ఉండవచ్చని నిపుణులు సూచిస్తున్నారు.
NOTE: పైన పేర్కొన్న అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే జారీ చేయబడినవి.. వీటిని మేం దృవీకరించలేదు.. వీటిపై మీకు సందేహాలు ఉంటే వైద్యులను సంప్రదించండి.




