కందిపప్పు వీరికి విషంతో సమానం.. తిన్నారంటే ఈ సమస్యలు పక్కా..
కందిపప్పుతో కమ్మని ముద్ద తినడం అందరికీ ఇష్టమే. ప్రోటీన్లకు చిరునామాగా నిలిచే కందిపప్పు ప్రతి ఇంట్లోనూ నిత్యం వండే వంటకం. అయితే అందరికీ ఈ పప్పు ఆరోగ్యాన్ని ఇస్తుందనుకుంటే పొరపాటే. కొన్ని ప్రత్యేక ఆరోగ్య సమస్యలు ఉన్నవారికి కందిపప్పు అమృతం కాదు.. అది విషంతో సమానమని వైద్యులు హెచ్చరిస్తున్నారు. ఇంతకీ ఏయే వ్యాధులు ఉన్నవారు కందిపప్పుకు దూరంగా ఉండాలి? అనేది తెలుసుకుందాం..

భారతీయ భోజనంలో పప్పు లేనిదే ముద్ద దిగదు. ముఖ్యంగా కందిపప్పు ప్రోటీన్లకు నిలయం. అయితే అందరికీ ఈ పప్పు ఆరోగ్యాన్ని ఇవ్వదు. కొన్ని రకాల అనారోగ్య సమస్యలు ఉన్నవారు కందిపప్పును అతిగా తీసుకుంటే అది అమృతం కాస్త విషంగా మారే ప్రమాదం ఉందని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. కందిపప్పుకు దూరంగా ఉండాల్సిన వారు ఎవరు..? ఎందుకు..? అనేది తెలుసుకుందాం
కిడ్నీ సమస్యలు ఉన్నవారు
కిడ్నీ సంబంధిత వ్యాధులతో బాధపడేవారికి కందిపప్పు ఒక సవాలుగా మారుతుంది. కందిపప్పులో పొటాషియం చాలా ఎక్కువగా ఉంటుంది. కిడ్నీలు బలహీనంగా ఉన్నప్పుడు రక్తంలోని అధిక పొటాషియాన్ని అవి బయటకు పంపలేవు. ఇది గుండె సంబంధిత సమస్యలకు దారితీయవచ్చు. ఇందులోని ఆక్సలేట్లు కిడ్నీలో రాళ్లు ఏర్పడే ప్రక్రియను వేగవంతం చేస్తాయి.
యూరిక్ యాసిడ్- కీళ్ల నొప్పులు
శరీరంలో యూరిక్ యాసిడ్ లెవల్స్ ఎక్కువగా ఉన్నవారు కందిపప్పుకు దూరంగా ఉండటమే మేలు. కందిపప్పులో ప్యూరిన్లు అధికంగా ఉంటాయి. ఇవి శరీరంలో విచ్ఛిన్నమైనప్పుడు యూరిక్ యాసిడ్ ఉత్పత్తి అవుతుంది. ఇది కీళ్లలో పేరుకుపోయి తీవ్రమైన నొప్పులు, వాపులకు కారణమవుతుంది. వీరు కందిపప్పుకు బదులు పెసరపప్పు తీసుకోవడం సురక్షితం.
జీర్ణక్రియ సమస్యలు – గ్యాస్ట్రిక్
చాలా మందికి కందిపప్పు తిన్న తర్వాత కడుపు ఉబ్బరం లేదా గ్యాస్ వస్తుంటుంది. కందిపప్పులోని ప్రోటీన్ కాంప్లెక్స్‌గా ఉంటుంది. దీనిని విచ్ఛిన్నం చేయడానికి జీర్ణవ్యవస్థకు ఎక్కువ శ్రమ పడుతుంది. మూలవ్యాధి ఉన్నవారిలో కందిపప్పు మలబద్ధకాన్ని పెంచి, సమస్యను జటిలం చేస్తుంది. గ్యాస్ సమస్య ఉన్నవారు పప్పు వండే ముందు కనీసం 2 గంటలు నానబెట్టి, బాగా ఉడికించి తీసుకోవాలి.
గుండెల్లో మంట
తరచుగా ఎసిడిటీ లేదా గుండెల్లో మంటతో బాధపడేవారు రాత్రిపూట కందిపప్పు తినకపోవడమే మంచిది. ఇది జీర్ణం కావడానికి ఎక్కువ సమయం పడుతుంది కాబట్టి పడుకునే ముందు తింటే యాసిడ్ రిఫ్లక్స్ సమస్య తలెత్తుతుంది.
నిపుణులు సూచించే పరిష్కారాలు
ఒకవేళ మీరు పైన చెప్పిన సమస్యలతో బాధపడుతూ పప్పు తినాలనుకుంటే కొన్ని జాగ్రత్తలు పాటించాలి. కందిపప్పుకు బదులుగా తేలికగా జీర్ణమయ్యే పెసరపప్పు లేదా మసూర్ పప్పు తక్కువ పరిమాణంలో తీసుకోండి. పప్పు వండేటప్పుడు అందులో చిటికెడు ఇంగువ, అల్లం, వెల్లుల్లి చేర్చండి. ఇవి గ్యాస్ సమస్యను తగ్గిస్తాయి. వండడానికి ముందే పప్పును నానబెట్టడం వల్ల అందులోని యాంటీ-న్యూట్రియెంట్స్ తొలగిపోయి జీర్ణక్రియ సులభమవుతుంది.
గమనిక: ఈ సమాచారం ప్రాథమిక అవగాహన కోసం మాత్రమే. మీకు తీవ్రమైన ఆరోగ్య సమస్యలు ఉంటే ఆహారంలో మార్పులు చేసే ముందు తప్పనిసరిగా డాక్టర్ లేదా డైటీషియన్‌ను సంప్రదించండి.
మరిన్ని లైఫ్‌స్టైల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
