బాలీవుడ్ సెలబ్రిటీల ఫేవరెట్ బ్రేక్‌ఫాస్ట్ ఏంటో తెలుసా? రైస్ కంజి గురించి ఈ విషయాలు తెలుసా
రైస్ కంజి లేదా పులియబెట్టిన అన్నం అనేది కేవలం పేదవాడి ఆహారం కాదు.. అదొక పోషకాల గని. దీనిని బెంగాల్‌లో 'పాంతా భాత్' అని, తమిళనాడులో 'పళంగంజి' అని కూడా పిలుస్తారు. రాత్రంతా అన్నాన్ని నానబెట్టడం వల్ల అందులో మేలు చేసే బ్యాక్టీరియా అభివృద్ధి చెంది, జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది.

మన దేశంలో ఒక్కో ప్రాంతంలో ఒక్కో రకమైన అల్పాహారం ఫేమస్. ఉత్తరాదిన పరాటా, దక్షిణాదిన ఇడ్లీ-దోశలు రాజ్యమేలుతుంటే.. తూర్పు భారత దేశంలో ముఖ్యంగా ఒడిశాలో ‘రైస్ కంజి’ అమృతంలా భావిస్తారు. దీనినే అక్కడ ‘పఖాలా’ అని కూడా పిలుస్తారు. ప్రస్తుతం ఈ ప్రాచీన వంటకం బాలీవుడ్ స్టార్స్ అయిన ఆర్. మాధవన్, నీతూ కపూర్ వంటి వారికి ఫేవరెట్ బ్రేక్‌ఫాస్ట్‌గా మారిపోయింది. వేసవి తాపాన్ని తగ్గించడమే కాకుండా, పేగుల ఆరోగ్యానికి మేలు చేసే ఈ ‘ప్రోబయోటిక్’ వంటకం విశేషాలు చూద్దాం.
కావలసిన పదార్థాలు
- ఉడికించిన అన్నం (రాత్రి మిగిలిన అన్నం అయితే మరీ మంచిది)
- పెరుగు లేదా మజ్జిగ
- ఉల్లిపాయ ముక్కలు
- ఉప్పు
- పోపు కోసం : ఆవాలు, కరివేపాకు, కొద్దిగా నూనె
తయారీ విధానం
- రాత్రి ఉడికించిన అన్నంలో నీళ్లు పోసి, ఒక మట్టి పాత్రలో ఉంచి మూత పెట్టాలి. దీనిని 10 నుండి 12 గంటల పాటు అలాగే వదిలేయాలి.
- ఉదయాన్నే ఆ అన్నంలో సరిపడా పెరుగు, సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు మరియు రుచికి తగినంత ఉప్పు వేసి బాగా కలపాలి.
- ఒక చిన్న పాన్‌లో ఆవాలు, కరివేపాకు వేసి తాలింపు పెట్టుకుని ఆ మిశ్రమంలో కలిపితే రుచికరమైన రైస్ కంజి సిద్ధం.
ఆరోగ్య ప్రయోజనాలు
- ఎండల వల్ల పెరిగే శరీర వేడిని తగ్గించడంలో ఈ కంజి అద్భుతంగా పనిచేస్తుంది.
- ఇది తేలికగా జీర్ణమవుతుంది. గ్యాస్, అసిడిటీ వంటి సమస్యలతో బాధపడేవారికి ఇది ఒక దివ్యౌషధం.
- ఇందులో కేలరీలు తక్కువగా ఉండి, కడుపు నిండుగా అనిపించేలా చేస్తుంది. ఇది బరువు తగ్గాలనుకునే వారికి మంచి ఎంపిక.
- పని ఒత్తిడిలో ఉండేవారికి మరియు బిజీగా ఉండే ఉద్యోగులకు ఇది అతి తక్కువ సమయంలో తయారయ్యే పోషక ఆహారం.
ఒకప్పుడు పల్లెటూరి వంటకంగా భావించిన రైస్ కంజి, నేడు తనలోని ఆరోగ్య రహస్యాలతో ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందుతోంది. ఈ వేసవిలో మీరు కూడా సెలబ్రిటీల బాటలో నడిచి, ఉదయాన్నే ఈ ఆరోగ్యకరమైన ఆహారాన్ని రుచి చూడండి. ఒక్కసారి దీనిని అలవాటు చేసుకుంటే, ఇక వదిలిపెట్టరు!
