KFC Fried Chicken: రెస్టారెంట్ స్టైల్ లో ఇంట్లోనే KFC ఫ్రైడ్ చికెన్ తయారు చేసుకోండి.. రెసిపీ మీ కోసం
నాన్ వెజ్ ప్రియులకు చికెన్ అంటే అమితమైన ఇష్టం. కొంతమంది ముక్కలేక పొతే ముద్ద దిగదు అని కూడా అంటారు. అందుకనే వారంలో ప్రతి రోజూ చికెన్ పెట్టినా లొట్టలేసుకుంటూ తినేసేవారున్నారు. చికెన్ తో కూర, బిర్యానీ వంటి రకరకాల వంటకాలను తయారు చేస్తారు. అయితే ప్రస్తుతం పిల్లలు పెద్దలు అనే తేడా లేకుండా ఇష్టంగా KFC ఫ్రైడ్ చికెన్ ని తింటారు. అయితే రెస్టారెంట్ కి వెళ్లి తినాలంటే ఓ వైపు ధరల భయం.. మరోవైపు వాటిని ఎలా తయారు చేస్తున్నారో అనే భయం. ఈ నేపధ్యంలో ఇంట్లోనే KFC స్టైల్ ఫ్రైడ్ చికెన్ ను తయారు చేసుకోండి. రెసిపీ మీ కోసం..

మాంసాహారం ప్రియులు ఇష్టంగా తినే ఆహారాల్లో చికెన్ ఒకటి. దీనితో నూరూరించే రకరకాల వంటకాలు ఎన్నో.. వాటిల్లో ఒకటి KFC ఫ్రైడ్ చికెన్. క్రిస్పీగా ఉండే దీనిని చిన్న పిల్లలైతే తెగ ఇష్టంగా తినేస్తారు. అందుకనే ఫామిలీ తో కలిసి రెస్టారెంట్ కు వెళ్తే ఫ్రైడ్ చికెన్ ను ఆర్డర్ చేస్తారు. అయితే అవి ఎలాంటి చికెన్ తో తయారు చేస్తారు.. ఎంత హేల్తీ గా ఉందని అనేది ఎవరీ తెలియదు.పైగా ధర కూడా ఎక్కువే.. ఈ నేపధ్యంలో ఇంట్లోనే రెస్టారెంట్ స్టైల్ లో ఫ్రైడ్ చికెన్ ను తయారు చేసుకోండి. ఈ టిప్స్ పాటిస్తూ చేసుకున్నారంటే KFC షాప్ లో దొరికే ఫ్రైడ్ చికెన్ ను ఇంట్లోనే చేసుకోవచ్చు. రెసిపీ మీకోసం
కావాల్సిన పదార్థాలు :
చికెన్ లెగ్ పీస్ – 3
మైదా పిండి – 1 కప్పు
కార్న్ ఫ్లోర్ – అర కప్పు
అల్లం వెల్లుల్లి పేస్ట్ – 1 టీస్పూన్
చికెన్ మసాలా పొడి – టీస్పూన్
మిరియాల పొడి – టీస్పూన్
నిమ్మరసం – అర చెక్క
పెరుగు – పావు కప్పు
ఉప్పు – సరిపడా
కారం- టీస్పూన్
కోడి గుడ్లు – 3
నూనె – వేయించడానికి సరిపడా
తయారీ విధానం: ముందుగా చికెన్ లెగ్ పీస్ లు తీసుకుని.. వాటిని శుభ్రంగా కడిగి నీళ్లు గట్టిగా పిండుకోవాలి. తర్వాత చికెన్ ముక్కలకు చాకుతో సన్నగా గాట్లు పెట్టుకోవాలి. ఇపుడు ఒక బౌల్ తీసుకుని పెరుగు, మిరియాల పొడి, కారం, అల్లం వెల్లుల్లి పేస్ట్, చికెన్ మసాలా, నిమ్మరసం, పెరుగు, తగినంత ఉప్పు వేసి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఈ మిశ్రమంలో చికెన్ లెగ్ పీసులు వేసుకుని బాగా మిశ్రమం పట్టించి గిన్నె మూత పెట్టి ప్రిడ్జ్ లో పెట్టుకోవాలి.
ఇప్పుడు మరో గిన్నె తీసుకుని మిరియాల పొడి, ఉప్పు , వేసి కోడి గుడ్లు తెల్ల సోన వేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ ఎగ్ వైట్ మిశ్రమాన్ని కూడా ప్రిడ్జ్ లో పెట్టుకోవాలి. ఇంతలో మళ్ళీ ఒక బౌల్ తీసుకుని మైదా పిండి, కార్న్ ఫ్లోర్,చికెన్ మసాలా,ఉప్పు, మిరియాల పొడి, కారం వేసుకుని బాగా కలుపుకోవాలి.
ఒక గంట తర్వాత మారినేట్ చేసిన చికెన్ ను, మసాలా మిశ్రమాన్ని ఫ్రిజ్లో నుంచి బయటికి తీసుకోవాలి.ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టి వేయించడానికి సరిపడా నూనె పోసుకుని వేడి చేసుకోవాలి. ఇప్పుడు చికెన్ లెగ్ పీసు తీసుకుని మైదా పిండి మిశ్రమంలో వేసి కోట్ చేయాలి. ఆ తర్వాత లెగ్ పీస్ ను ఎగ్ వైట్ మిశ్రమంలో ముంచి.. మళ్ళీ మైదా పిండి మిశ్రమన్ని కోట్ చేసి ఒక ప్లేట్ లో పెట్టుకోవాలి. అన్నిటిని రెడీ చేసుకున్న తర్వాత వేయించిన నూనె లో కోట్ చేసిన లెగ్ పీస్ లు వేసి మీడియం మంట మీద గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. బంగారు రంగులోకి వచ్చిన తర్వాత చికెన్ పీసెస్ ను నూనె నుంచి తీసి ఒక ప్లేట్ లోకి తీసుకోవాలి. అంతే సూపర్ టేస్టీ KFC స్టైల్ ఫ్రైడ్ చికెన్ రెడీ. తర్వాత వీటిని టమాటా సాస్ తో సర్వ్ చేసుకోవాలి.
మరిన్ని లైఫ్ స్టైల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి








