AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

చికెన్, మటన్, ఫిష్.. ఏది ఎక్కువ ప్రమాదమో తెలుసా..? ఈ నిజాలు తెలిస్తే కళ్లు తేలేస్తారు..

Chicken vs mutton vs fish: మాంసాహార ప్రియులకు తరచుగా తలెత్తే ప్రశ్న.. చికెన్, మటన్, చేపలు - వీటిలో ఏది ఆరోగ్యానికి మంచిది, ఏది ప్రమాదకరం? ఈ విషయంపై అమెరికన్ జర్నల్ ఆఫ్ క్లినికల్ న్యూట్రిషన్ ఇటీవల నిర్వహించిన పరిశోధన ఆసక్తికరమైన విషయాలను వెల్లడించింది.

చికెన్, మటన్, ఫిష్.. ఏది ఎక్కువ ప్రమాదమో తెలుసా..? ఈ నిజాలు తెలిస్తే కళ్లు తేలేస్తారు..
Chicken, Mutton, Fish
Shaik Madar Saheb
|

Updated on: May 24, 2026 | 12:17 PM

Share

మాంసాహారం అనేది చాలా మంది ఆహారపు అలవాట్లలో ఒక భాగం. ముఖ్యంగా ఆదివారాలలో నాన్-వెజ్ వంటకాలు చాలా ఇళ్లలో సర్వసాధారణం. చికెన్, మటన్, చేపలు, రొయ్యలు, పీతలు వంటివి నాన్-వెజ్ వంటకాలలో ప్రముఖంగా ఉంటాయి. ఈ మాంసాహారాన్ని రెడ్ మీట్, వైట్ మీట్ గా విభజిస్తారు. రెడ్ మీట్ కింద బీఫ్, మటన్, పోర్క్ వంటివి వస్తాయి. వైట్ మీట్ అంటే చేపలు, కోడి మాంసం, రొయ్యలు, పీతలు, పక్షుల మాంసం వంటివి.. ముఖ్యంగా మాంసంలో బీ 12 తోపాటు.. ప్రోటీన్ పుష్కలంగా ఉంటుంది.. అయితే.. చికెన్, మటన్, చేపలు వీటిలో ఏది ఆరోగ్యానికి మంచిది, ఏది ప్రమాదకరం? ఈ విషయంపై అమెరికన్ జర్నల్ ఆఫ్ క్లినికల్ న్యూట్రిషన్ ఇటీవల నిర్వహించిన పరిశోధన ఆసక్తికరమైన విషయాలను వెల్లడించింది.

పరిశోధన ఫలితాలు..

ఏది ఆరోగ్యానికి మంచిది అనే అంశంపై అమెరికన్ జర్నల్ ఆఫ్ క్లినికల్ న్యూట్రిషన్ సంస్థ ఇటీవల ఒక ముఖ్యమైన పరిశోధన చేసింది. ఈ పరిశోధన ఇప్పటివరకు రెడ్ మీట్‌లోనే కొలెస్ట్రాల్ ఎక్కువగా ఉంటుందని భావించిన అభిప్రాయాన్ని మార్చేసింది. పరిశోధన ఫలితాల ప్రకారం, రెడ్ మీట్ – వైట్ మీట్ రెండూ కూడా కార్డియోవాస్కులర్ జబ్బులకు (గుండె సంబంధిత వ్యాధులు) కారణమవుతాయని తేలింది. మాంసం అనేది రెడ్ మీట్ అయినా, వైట్ మీట్ అయినా కొలెస్ట్రాల్‌పై ఒకే రకమైన ప్రభావాన్ని చూపుతుందని గుర్తించారు.

రెడ్ మీట్ – కార్నిటైన్ ప్రమాదాలు

కేవలం కొలెస్ట్రాల్ మాత్రమే కాకుండా, బీఫ్ (రెడ్ మీట్), గొర్రె వంటి జంతువుల మాంసాలలో కార్నిటైన్ అనే పదార్థం ఉంటుంది. ఈ కార్నిటైన్ గుండెకు రక్తాన్ని సరఫరా చేసే రక్తనాళాలను మూసివేస్తుందని, దానివల్ల గుండె దెబ్బతినే ప్రమాదం అధికంగా ఉంటుందని పరిశోధనలు వెల్లడించాయి. మటన్‌లో ప్రోటీన్‌తో పాటు కొవ్వు పదార్థాలు కూడా ఎక్కువగా ఉంటాయి. కొవ్వు అధికంగా ఉండే ఆహారాన్ని తీసుకోవడం వల్ల శరీరంలో LDL (చెడు కొలెస్ట్రాల్), ట్రై గ్లిజరైడ్‌లు పెరుగుతాయి. ఇది అధిక బరువుకు దారితీసి, హార్ట్ ఎటాక్‌ల ప్రమాదాన్ని పెంచుతుంది. కాబట్టి, కొవ్వు పదార్థాలు ఎక్కువగా ఉండే మాంసాహారాన్ని తక్కువగా తీసుకోవడం మంచిది.

Neu5Gc చక్కెర కణాల ప్రభావం

మాంసాహారం వల్ల కలిగే మరో ముఖ్యమైన ప్రమాదం Neu5Gc చక్కెర కణాలు. చేపలు, పాల ఉత్పత్తులలో CMAH అనే జన్యువు ఉంటుంది, ఇది Neu5Gc అనే చక్కెర కణాలను ఉత్పత్తి చేస్తుంది. మనుషులలో కూడా CMAH జన్యువు ఉన్నప్పటికీ, కొన్ని మార్పుల వల్ల Neu5Gc చక్కెర కణాలు ఉత్పత్తి కావు. అయితే, రెడ్ మీట్ వంటివి తిన్నప్పుడు వాటిలోని Neu5Gc చక్కెరలు శరీరంలోకి చేరుతాయి. అప్పుడు శరీర రోగనిరోధక వ్యవస్థ వీటిని పరాయి కణాలుగా గుర్తించి స్పందిస్తుంది. ఈ స్పందన వాపు, మంటలు, కీళ్ల నొప్పులు, చివరకు క్యాన్సర్‌కు కూడా దారితీసే అవకాశం ఉందని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. మానవులలో CMAH జన్యువు పనిచేయకుండా పోవడం పరిణామ క్రమంలో కొన్ని వ్యాధుల నుంచి రక్షణ పొందేందుకు జరిగిన మార్పు అని, కొన్ని జంతువులు, చేపల్లో ఈ జన్యువు అలాగే ఉండటం వల్ల వాటి మాంసం తీసుకోవడం సమస్యలను సృష్టిస్తుందని శాస్త్రవేత్తలు గుర్తించారు.

ఆరోగ్యకరమైన మాంసాహార ఎంపికలు

ప్రతిరోజూ మాంసాహారం తినే అలవాటు ఉన్నవారు కొవ్వు తక్కువగా ఉండే నాన్-వెజ్‌ని ఎంచుకోవాలి. చికెన్ – చేపలు, రొయ్యలు వంటి వాటిలో ప్రోటీన్లు అధికంగా ఉంటాయి, కొవ్వు పదార్థాలు తక్కువగా ఉంటాయి. బరువు తగ్గాలనుకునే వారికి చికెన్ ఒక మంచి ఆప్షన్. ముఖ్యంగా, సాల్మన్ చేపలు శరీరానికి ఎంతో మేలు చేస్తాయి. వీటిలో ఒమేగా-3 ఫ్యాటీ ఆమ్లాలు, ప్రోటీన్లు, విటమిన్ A పుష్కలంగా ఉంటాయి. వారానికి రెండు, మూడు సార్లు సాల్మన్ చేపను తీసుకోవడం వల్ల మెదడు చురుగ్గా పనిచేయడం, కంటిచూపు మెరుగుపడడం, క్యాన్సర్ ప్రమాదం తగ్గడం, మంచి నిద్ర, ఎముకలకు పుష్టి వంటి ప్రయోజనాలు లభిస్తాయి.

మితం, శాకాహారం ప్రాముఖ్యత

శాకాహారం తీసుకోవడం వల్ల ఎటువంటి దుష్ప్రభావాలు ఉండవు, అప్పుడప్పుడు అలర్జీలు మినహా. అయితే, మాంసాహారాన్ని ఎక్కువగా తీసుకుంటే గుండె సంబంధిత సమస్యలు, అధిక కొలెస్ట్రాల్, ఊబకాయం, అనేక వ్యాధులు సంక్రమించే అవకాశం ఉంది.

అయితే.. మితంగా తీసుకోవడం అనేది అన్నింటికీ వర్తిస్తుంది. సీఫుడ్స్ – చికెన్ లాంటివి రెడ్ మీట్ అంత హానికరం కానప్పటికీ, అన్ని రకాల మాంసాహారాలనూ మితంగా తీసుకోవాలి. రెడ్ మీట్‌ను సాధ్యమైనంత వరకు తగ్గించి, కొవ్వు తక్కువగా ఉండే ప్రోటీన్ అధికంగా ఉండే చికెన్, సాల్మన్ వంటి చేపలను తగు మోతాదులో తీసుకోవడం ద్వారా ఆరోగ్యంగా ఉండవచ్చు.

ఇది కేవలం అవగాహన కోసం మాత్రమే.. ఏమైనా సందేహాలు.. సమస్యలున్నా.. ఆరోగ్య నిపుణులను సంప్రదించండి.

మరిన్ని లైఫ్‌స్టైల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us