పక్కా ఊర మాస్.. ఈ కర్రీ అంటే ప్రీతి జింటాకు ప్రాణం.. ఇంట్లో ఇలా చేశారంటే గిన్నె లేపాల్సిందే
బాలీవుడ్ నటి ప్రీతి జింటాకు ఇష్టమైన వంటకాలలో కొంకణి ఫిష్ కర్రీ ఒకటి. రావాస్ చేపతో చేసే ఈ ప్రత్యేక వంటకం మహారాష్ట్ర, గోవా ప్రాంతాల్లో ఎంతో ప్రసిద్ధి చెందింది. మసాలాల ఘాటు, చేప రుచి కలిసిన ఈ కర్రీని ఇంట్లోనే సులభంగా తయారు చేసుకోవచ్చు.. ఎలాగో ఈ కథనంలో తెలుసుకోండి..

ప్రీతి జింటా.. గురించి తెలియని వారంటూ ఉండరు.. బాలీవుడ్ నటి అయినా ప్రీతి జింటా హిందీ సినిమాలతో పాటు తెలుగు, పంజాబీ, ఇంగ్లీష్ సినిమాల్లో కూడా నటించారు. 1998లో దిల్ సే సినిమాతో తెరంగేట్రం చేసిన ఆమె.. తెలుగులో వెంకటేష్ సరసన ప్రేమంటే ఇదేరా.. మహేష్ బాబు సరసన రాజకుమారుడు సినిమాలో నటించింది. అయితే.. ప్రస్తుతం ప్రీతి జింటా ఐపీల్ జట్టు పంజాబ్ కింగ్స్ కో-ఓనర్ గా ఉన్నారు. అటు సినిమాల్లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు పొందిన ఆమె.. బిజినెస్ లో సైతం రాణిస్తున్నారు. అయితే.. ఆమె కు ఇష్టమైన ఫుడ్‌లలో కొంకణ్ ఫిష్ కర్రీ ఒకటి.. ఈ విషయాన్ని ప్రీతిజింటా పలు సందర్భాల్లో పేర్కొన్నారు. అయితే.. భారతదేశ పశ్చిమ తీరంలో అరేబియా సముద్రానికి, పశ్చిమ కనుమలకు మధ్య విస్తరించి ఉన్న సుందరమైన తీర ప్రాంతాన్ని ‘కొంకణ్’ అంటారు. ఇది మహారాష్ట్ర, గోవా, కర్ణాటక రాష్ట్రాల గుండా సుమారు 720 కి.మీల మేర విస్తరించి ఉంది. ఇక్కడ అద్భుతమైన బీచ్‌లు, చారిత్రక కోటలు – పచ్చని లోయలు ఉన్నాయి.. ఇక్కడ ఫిష్ కర్రీని పలు రకాలుగా అద్భుతంగా వండుతారు. దీన్ని చాలా మంది ఇష్టంగా తింటారు.
కొంకణ్ ఫిష్ కర్రీ తయారు చేసే విధానం తెలుసుకోండి..
కొంకణి ఫిష్ కర్రీ, ముఖ్యంగా రావాస్ చేపలతో తయారు చేసేది.. పశ్చిమ భారతదేశంలోని కొంకణ్ ప్రాంతపు ఒక ప్రసిద్ధ – రుచికరమైన వంటకం. ఈ కూర అన్నం, చపాతీ లేదా భాక్రీ వంటి వాటితో కలిపి తినడానికి చాలా రుచికరంగా ఉంటుంది. ఈ వ్యాసం కొంకణి రావాస్ ఫిష్ కర్రీని ఇంట్లో సులభంగా తయారుచేసే విధానాన్ని వివరిస్తుంది.
కావలసిన పదార్థాలు:
ఈ వంటకం కోసం 10 మధ్యస్థ పరిమాణపు రావాస్ చేప ముక్కలు లేదా సరిపోయేంతగా చేపలు తీసుకోవడం అవసరం.. మసాలా కోసం, ఉల్లిపాయ, కొత్తిమీర, కొంచెం చింతపండు, వెల్లుల్లి రెబ్బలు, టమోటాలు, పచ్చిమిర్చి, అర టీస్పూన్ జీలకర్ర అవసరం.. వంట కోసం, నూనె, ఆవాలు, కరివేపాకు, కొంకణి ఫిష్ మసాలా (లేదా మాల్వానీ మసాలా), కాశ్మీరీ కారం పొడి.. రుచికి సరిపడా ఉప్పు సిద్ధం చేసుకోవాలి.
తయారీ విధానం:
ముందుగా, మసాలా పేస్ట్ తయారుచేయాలి. ఒక మిక్సర్ జార్‌లో ఉల్లిపాయ, టమోటాలు, కొత్తిమీర, చింతపండు, వెల్లుల్లి, పచ్చిమిర్చి, జీలకర్రలను వేసి, నీరు కలపకుండా మెత్తని పేస్ట్ లాగా రుబ్బుకోవాలి. ఉల్లిపాయ, టమోటా నుండి వచ్చే నీరు మసాలాను రుబ్బడానికి సరిపోతుంది. మసాలాను చాలా మెత్తగా రుబ్బడం వలన గ్రేవీకి మంచి చిక్కదనం వస్తుంది.
తరువాత, ఒక కడాయిలో నూనెను వేడి చేయాలి. నూనె వేడెక్కిన తర్వాత, అర టీస్పూన్ ఆవాలు వేసి చిటపటలాడించాలి. ఆపై, కరివేపాకులను చేర్చి, ఒక నిమిషం పాటు వేయించాలి. ఇప్పుడు, ముందుగా తయారుచేసుకున్న ఉల్లిపాయ-టమోటా మసాలా పేస్ట్‌ను వేసి, అధిక మంట మీద రెండు నిమిషాలు వేయించాలి. మంట తగ్గించి, మూత పెట్టి, 3-4 నిమిషాలు ఉడికించాలి, తద్వారా మసాలా బాగా ఉడుకుతుంది.
మూత తీసి, మసాలాను ఒకసారి కలపాలి. ఇప్పుడు కొంకణి ఫిష్ మసాలా (లేదా మాల్వానీ మసాలా), కాశ్మీరీ కారం పొడి, రుచికి సరిపడా ఉప్పు చేర్చి, మధ్యస్థ మంట మీద మసాలా బాగా కలిసే వరకు వేయించాలి. మసాలా బాగా వేగిన తర్వాత, మంట తగ్గించి, మూత పెట్టి 2-3 నిమిషాలు గ్రేవీ నుండి నూనె తేలే వరకు ఉడికించాలి. ఈ దశ గ్రేవీకి మంచి సువాసనను ఇస్తుంది.
మసాలా బాగా ఉడికిన తర్వాత, రుబ్బిన జార్‌లో అర కప్పు నీళ్లు కలిపి, ఆ నీటిని గ్రేవీలో చేర్చాలి. బాగా కలిపి, మూత పెట్టి ఐదు నిమిషాల పాటు తక్కువ మంట మీద ఉడకనివ్వాలి. గ్రేవీ పైన నూనె పూర్తిగా తేలితే మసాలాలు బాగా వేగాయని అర్థం.
ఇప్పుడు, గ్రేవీలో సరిపోయేంతగా కొంచెం నీరు పోయాలి.. మీకు కావాల్సిన చిక్కదనాన్ని బట్టి నీటి పరిమాణాన్ని సర్దుబాటు చేసుకోవచ్చు. గ్రేవీని మరిగనివ్వాలి. గ్రేవీ బాగా మరిగిన తర్వాత, రావాస్ చేప ముక్కలను జాగ్రత్తగా వేయాలి. సురమయి, పాంఫ్రెట్ లేదా రొయ్యలు వంటి ఇతర రకాల చేపలను కూడా ఈ వంటకంలో ఉపయోగించవచ్చు. గరిటెతో మెల్లగా కలిపి చేపలు గ్రేవీలో మునిగేలా చూడాలి. మూత పెట్టి, మధ్యస్థ మంట మీద 8-10 నిమిషాలు చేప ముక్కలు ఉడికే వరకు ఉడికించాలి. చేపలను ఎక్కువసేపు ఉడికించకూడదు, లేదంటే అవి విరిగిపోయే అవకాశం ఉంది.
చివరగా, మూత తీసి, సన్నగా తరిగిన కొత్తిమీరతో అలంకరించాలి. ఫిష్ కర్రీ తయారైంది. వేడివేడిగా ఒక గిన్నెలోకి తీసుకుని అన్నం, చపాతీ లేదా భాక్రీతో తినొచ్చు.. ఇంకెందుకు ఆలస్యం.. ఈ కొంకణి ఫిష్ కర్రీ రెసిపీని ఇంట్లో ప్రయత్నించి, దాని అసలైన రుచిని ఆస్వాదించండి.
మరిన్ని లైఫ్‌స్టైల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..




