పల్లీలు vs మఖానా.. బరువు తగ్గడానికి ఏది బెస్ట్..?
Peanuts vs Makhana: సాయంత్రం అయ్యిందంటే చాలు.. కడుపులో ఎలుకలు పరిగెడుతుంటాయి. ఆ సమయంలో టీ కప్పుతో పాటు ఏదైనా కరకరలాడే చిరుతిండి ఉంటే ఆ మజానే వేరు. అయితే బరువు తగ్గాలని డైటింగ్ చేసేవారికి మాత్రం ఒకటే టెన్షన్.. ఏది తింటే బరువు పెరగం? అని. పల్లీ, మఖానా ఆరోగ్యానికి చాలా మంచివి.మరి వీటిలో వెయిట్ లాస్ రేసులో గెలిచే సూపర్ స్నాక్ ఏది? అనేది తెలుసుకుందాం.

సాయంత్రం 4 లేదా 5 గంటలవుతుందంటే చాలు.. ఏదైనా కరకరలాడే స్నాక్ తినాలని మనసు లాగుతుంటుంది. ఆ సమయంలో వంటింట్లో డబ్బా తెరిస్తే మనకు కనిపించే రెండు ముఖ్యమైన ఆప్షన్లు.. పల్లీలు, మఖానా. ఈ రెండూ ఆరోగ్యకరమైనవే అయినప్పటికీ.. బరువు తగ్గడం విషయానికి వస్తే ఏది మంచిది..? అనే డౌట్ అందరిలో ఉంటుంది. ఆ విషయాలు ఈ స్టోరీలో తెలుసుకుందాం..
పల్లీ – శక్తి కేంద్రాలు
దశాబ్దాలుగా మన ఇళ్లలో వేరుశనగలు అత్యంత ఇష్టమైన చిరుతిండి. వీటిని పేదల బాదం అని కూడా పిలుస్తారు. ఇందులో ప్రోటీన్, ఆరోగ్యకరమైన కొవ్వులు పుష్కలంగా ఉంటాయి. ఇవి తిన్న తర్వాత కడుపు నిండుగా ఉన్న అనుభూతిని కలిగిస్తాయి. తద్వారా అనవసరమైన చిరుతిళ్లు తినకుండా నియంత్రిస్తాయి. పల్లీలలో కేలరీలు చాలా ఎక్కువ. రోజుకు ఒక చిన్న గుప్పెడు తింటే పరవాలేదు కానీ, రుచిగా ఉన్నాయని గిన్నెలు గిన్నెలు తింటే బరువు తగ్గడానికి బదులు పెరగడం ఖాయం.
మఖానా: వెయిట్ లాస్ స్పెషలిస్ట్
గత కొన్ని ఏళ్లుగా ఫిట్‌నెస్ ప్రేమికులకు మఖానా హాట్ ఫేవరెట్ అయిపోయింది. ఇవి చాలా తేలికగా ఉంటాయి. కేలరీలు, కొవ్వు శాతం చాలా తక్కువ. పీచు పదార్థం ఎక్కువగా ఉండటం వల్ల బరువు తగ్గాలనుకునే వారికి ఇది ఒక గొప్ప వరం. మఖానాను నెయ్యిలో లేదా నూనెలో వేయించి, ఉప్పు ఎక్కువగా కలిపి తింటే దాని అసలు ప్రయోజనం దెబ్బతింటుంది. సాధ్యమైనంత వరకు డ్రై రోస్ట్ చేయడం లేదా అతి తక్కువ నెయ్యితో వేయించడం ఉత్తమం.
బరువు తగ్గడంలో విజేత ఎవరు?
బరువు తగ్గే రేసుల మఖానా ముందుంటుంది. మీరు ఒక కప్పు మఖానా తిన్నా కూడా శరీరానికి అందే కేలరీలు చాలా తక్కువ. ఇది మీ కడుపుని నింపుతుంది కానీ బరువును పెంచదు. అదే పల్లీల విషయానికి వస్తే.. ఒక కప్పు మఖానాకు సమానమైన కేలరీలను పొందాలంటే కేవలం 10-15 వేరుశనగ గింజలు తింటే చాలు. కానీ అన్ని గింజలతో కడుపు నిండిన భావన రాదు, ఫలితంగా మనం ఎక్కువ తినే ప్రమాదం ఉంటుంది.
మరిన్ని లైఫ్‌స్లైట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
