AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఇంట్లోనే రెస్టారెంట్ స్టైల్లో ఫిష్ ఫ్రై బిర్యానీ చేయండి.. టేస్ట్ అదిరిపోద్ది..!

చేపల ఫ్రై బిర్యానీ పేరు వినగానే నోరూరుతుంది కదా. మామూలుగా పులుసు, ఫ్రైలు ఎప్పుడూ చేస్తూండేవే. ఈసారి స్పెషల్‌గా దమ్ స్టైల్‌లో బిర్యానీ ట్రై చేయండి. ఇంట్లోనే రెస్టారెంట్ స్టైల్ రుచి పొందాలంటే ఈ రుచికరమైన చేపల ఫ్రై బిర్యానీ తయారీ విధానాన్ని తప్పకుండా ఓసారి ప్రయత్నించండి.

ఇంట్లోనే రెస్టారెంట్ స్టైల్లో ఫిష్ ఫ్రై బిర్యానీ చేయండి.. టేస్ట్ అదిరిపోద్ది..!
Fish Recipe
Prashanthi V
|

Updated on: Apr 18, 2025 | 7:58 PM

Share

చేపల ఫ్రై, పులుసు అంటే చాలా మందికి బాగా ఇష్టం. వారానికి ఒక్కసారి కాకపోయినా నెలకి రెండుసార్లు మాత్రం చేపల వంటలు తప్పవు. అయితే చేపల ముక్కలతో పులుసు, ఫ్రై మాత్రమే కాకుండా.. బిర్యానీ కూడా చేసుకోవచ్చు. దమ్ స్టైల్‌లో చేస్తే ఫిష్ ఫ్రై బిర్యానీ టేస్ట్ చాలా రిచ్‌ గా ఉంటుంది. చికెన్ బిర్యానీ కన్నా కూడా రుచిగా ఉంటుంది. ఇవాళ మనం ఈ ఫిష్ ఫ్రై బిర్యానీ రెసిపీని ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకుందాం.

కావాల్సిన పదార్ధాలు

  • బాస్మతి రైస్ – 2 కప్పులు (గంట నానబెట్టాలి)
  • అనాసపువ్వులు – 2
  • నీళ్లు – 2 లీటర్లు
  • దాల్చినచెక్క – 3
  • లవంగాలు – 6
  • మరాఠి మొగ్గ – 2
  • యాలకులు – 6
  • ఉప్పు – రుచికి సరిపడా
  • బిర్యానీ ఆకులు – 2
  • పచ్చిమిర్చి – 3
  • అల్లం వెల్లుల్లి పేస్ట్ – 1 టీస్పూన్
  • షాజీరా – అరకప్పు

ఫిష్ మ్యారినేషన్ కోసం

  • బోన్‌లెస్ చేప ముక్కలు – 500 గ్రాములు
  • కొత్తిమీర తరుగు – 1/4 కప్పు
  • పుదీనా తరుగు – 1/4 కప్పు
  • ఫ్రైడ్ ఆనియన్స్ – 1/4 కప్పు
  • గరం మసాలా – 1 టీస్పూన్
  • ధనియాల పొడి – 1 టీస్పూన్
  • యాలకుల పొడి – 1 టీస్పూన్
  • పసుపు – 1/4 టీస్పూన్
  • కారం – 1.5 టేబుల్ స్పూన్లు
  • వేపిన జీలకర్ర పొడి – 1 టీస్పూన్
  • మిరియాల పొడి – 1/2 కప్పు
  • అల్లం వెల్లుల్లి పేస్ట్ – 1.5 టేబుల్ స్పూన్లు
  • పెరుగు – 1 కప్పు
  • నూనె – అవసరమైనంత
  • షాజీరా – 1 టీస్పూన్
  • లవంగాలు – 3
  • దాల్చినచెక్క – 1 చిన్న ముక్క
  • మరాఠి మొగ్గ – 1 చిన్నటి
  • కశ్మీరీ రెడ్ చిల్లీ పౌడర్ – 1 టీస్పూన్

ఫిష్ ఫ్రై కోసం

  • మైదా పిండి – 1/4 కప్పు
  • పచ్చిమిర్చి – 1 (తరుగు)
  • గరం మసాలా – 1/2 కప్పు
  • అల్లం – 1/2 కప్పు (తరుగు)
  • ధనియాల పొడి – 1/2 కప్పు
  • మిరియాల పొడి – 1/4 టీస్పూన్
  • వేపిన జీలకర్ర పొడి – 1/2 కప్పు
  • కారం – 1 టీస్పూన్
  • కరివేపాకు – అవసరమైనంత (తరుగు)
  • కార్న్‌ఫ్లోర్ – 1.5 టేబుల్ స్పూన్లు
  • నిమ్మరసం – అవసరమైనంత

తయారీ విధానం

బిర్యానీ హండీలో కొత్తిమీర, పుదీనా, ఫ్రైడ్ ఆనియన్స్, గరం మసాలా, ఉప్పు, ధనియాల పొడి, యాలకుల పొడి, పసుపు, కారం, జీలకర్ర పొడి, మిరియాల పొడి, అల్లం వెల్లుల్లి పేస్ట్, పెరుగు, నూనె, షాజీరా, లవంగాలు, దాల్చినచెక్క, మరాఠి మొగ్గ వేసి బాగా కలపాలి. అందులో శుభ్రంగా కడిగిన ఫిష్ ముక్కలు, కశ్మీరీ చిల్లీ పౌడర్ వేసి బాగా కలపాలి. ఈ మిశ్రమాన్ని కనీసం ఒక గంట పాటు పక్కన పెట్టాలి.

ఫిష్ ఫ్రై తయారు చేయడానికి ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకుని అందులో మైదా పిండి, తరిగిన పచ్చిమిర్చి, గరం మసాలా, తరిగిన అల్లం, మిరియాల పొడి, ధనియాల పొడి, వేపిన జీలకర్ర పొడి, కారం, తరిగిన కరివేపాకు, కార్న్‌ఫ్లోర్, నిమ్మరసం వేసి బాగా కలిపాలి. ఈ పదార్థాలు అన్నీ కలిసి మసాలా మిశ్రమంలా మారేలా కొద్దిగా నీళ్లు వేసి మెత్తగా కలపాలి. మిశ్రమం గట్టిగా ఉండాలి, పలుచగా చేయకూడదు.

ఇప్పుడు ముందుగా సిద్ధం చేసుకున్న బోన్‌లెస్ చేప ముక్కలను ఈ మిశ్రమంలో వేసి బాగా కలిపి ప్రతి ముక్కకి మసాలా బాగా పట్టించాలి. తర్వాత ఒక కడాయిలో తగినంత ఆయిల్ వేసి బాగా వేడి చేయాలి. నూనె బాగా వేడయ్యాక మసాలా పట్టు ఉన్న చేప ముక్కలను ఒక్కొక్కటిగా వేసి బంగారు రంగు వచ్చే వరకు మధ్య మంటపై ఫ్రై చేయాలి. ముక్కలు బయట నుంచి క్రిస్పీగా, లోపల నుంచి సాఫ్ట్‌గా ఫ్రై అవ్వాలి. ఇలా ఫ్రై వేసిన తర్వాత టిష్యూ పేపర్ మీద పెట్టి అదనపు నూనె తొలగించాలి. ఇలా చేసిన ఫిష్ ఫ్రై రుచికరంగా ఉండటంతో పాటు స్పైసీగా కూడా ఉంటుంది.

రైస్ ఉడికించడం.. నీళ్లు మరిగాక అందులో అనాసపువ్వులు, లవంగాలు, దాల్చినచెక్క, యాలకులు, మరాఠి మొగ్గ, బిర్యానీ ఆకులు, ఉప్పు, షాజీరా, పచ్చిమిర్చి, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి కలపాలి. బాస్మతి రైస్ వేసి 80 శాతం వరకూ ఉడికించాలి. బిర్యానీ మిశ్రమంలో ఒక కప్పు మరిగిన నీళ్లు, కొద్దిగా నిమ్మరసం, చేపల ఫ్రైలో వాడిన నూనె వేసి కలపాలి.

దమ్ విధానం.. ఉడికిన రైస్ బిర్యానీ మిశ్రమం మీద స్ప్రెడ్ చేయాలి. పైన కొత్తిమీర, పుదీనా, కరివేపాకు, గరం మసాలా, ఫ్రైడ్ ఫిష్ ముక్కలు, ఫ్రైడ్ ఆనియన్స్, కొద్దిగా ఆయిల్ చల్లాలి. మైదా పిండి ముద్దను హండీ అంచులపై రాసి మూత పెట్టాలి. హై ఫ్లేమ్‌లో 5 నిమిషాలు, లో ఫ్లేమ్‌లో 3 నిమిషాలు దమ్ చేసి స్టౌ ఆఫ్ చేయాలి. తరువాత అరగంట వదిలేయాలి. ఇంతే సింపుల్ రెడీ అయ్యింది రెసిపీ. ఇంట్లోనే రెస్టారెంట్ స్టైల్‌లో తినచ్చు. ఓసారి మీరు ప్రయత్నించి చూడండి.. చాలా రుచిగా ఉంటుంది.