Amla Murabba: ఉసిరి తియ్యగా.. పుల్లగా.. తినాలంటే మురబ్బా చేయండి..
ఉసిరితో కేవలం కొన్ని రకాల వంటలు మాత్రమే తయారు చేసుకోగలం. వాటిల్లో ఈ స్వీట్ ఆమ్లా మురబ్బా ఒకటి. ఇది కాస్త వెరైటీగా ఉంటుంది. తియ్యగా, పుల్లగా, కారంగా ఉంటుంది. మరి ఈ ఆమ్లా మురబ్బా ఎలా చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం..
శీతా కాలంలో వచ్చే కార్తీక మాసంలో ఉసిరి చెట్టుకు చాలా ప్రాధాన్యత ఉంటుంది. ఉసిరి కాయ తిన్నా.. ఉసిరి చెట్టు కింద కూర్చున్నా.. దీపం వెలిగించినా చాలా మంచిదని ఆరోగ్య శాస్త్ర నిపుణులు చెబుతారు. ఉసిరిలో చాలా పోషకాలు ఉంటాయి. ఇందులో విటమిన్ సి, ఐరన్, క్యాల్షియం, ఫైబర్, యాంటీ ఆక్సిడెంట్లు ఎక్కువగా ఉంటాయి. ఇందులో అనేక ఇతర మినరల్స్, పోషకాలు కూడా కలిగి ఉంటాయి. అందుకే ఉసిరి తినాలని చెబుతారు. ఉసిరితో చేసే పాపులర్ స్వీట్స్‌లో మురబ్బా కూడా ఒకటి. సాధారణంగా యాపిల్, మామిడి పండ్లతో కూడా మురబ్బా చేస్తారు. కానీ ఉసిరితో చేసే ఈ మురబ్బా కాస్త వేరుగా ఉంటుంది. ఇది తియ్యగా, పుల్లగా ఉంటుంది. ఎంతో రుచికరంగా ఉండంతో పాటు ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. మరి ఈ ఉసిరి మురబ్బా ఎలా తయారు చేస్తారు? ఇందుకు కావాల్సిన పదార్థాలు ఏంటో ఇప్పుడు చూద్దాం.
మురబ్బాకు కావాల్సిన పదార్థాలు:
ఉసిరి, యాలకుల పొడి, మిరియాల పొడి, పంచదార, బ్లాక్ సాల్ట్.
మురబ్బా తయారీ విధానం:
ఈ మురబ్బాను ఎంతో ఈజీగా తయారు చేసుకోవచ్చు. పెద్దగా సమయం పట్టదు. తియ్యగా, పుల్లగా, కాస్త కారంగా ఉండటం ఇష్టపడేవారు ఈ రెసిపీని ఖచ్చితంగా ట్రై చేయండి. ముందుగా ఉసిరి కాయలను నీటితో కడిగి పొడిగా తుడిచి పక్కన పెట్టాలి. ఆ తర్వాత వీటిల్లో కొద్దిగా నీరు వేసి ఉడికించి పక్కన పెట్టాలి. ఉసిరి ఉడికాక నీరంతా తీసేసి.. కాస్త చల్లారనివ్వాలి. ఇప్పుడు ఓ పాన్‌లో పంచదార నీరు వేసి పాకం తీయాలి.
పంచదార కరిగాక యాలకుల పొడి, మిరియాల పొడి, బ్లాక్ సాల్ట్ వేసి కలపాలి. పాకాన్ని తీగ పాకం వచ్చినప్పుడు.. ఉసిరి కాయలు వేసి మొత్తం బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు పాకం మొత్తం ఉసిరి కాయలకు పట్టించాలి. ఆ తర్వాత స్టవ్ ఆఫ్ చేసి.. రాత్రంతా అలానే వదిలేయాలి. అంతే ఎంతో రుచిగా ఉండే ఉసిరి మురబ్బా సిద్దం. ఇది చేసేందుకు పెద్దగా సమయం కూడా పట్టదు. ఎవరైనా ఈజీగా చేయవచ్చు.