AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఆరోగ్యానికి, అందానికి మార్నింగ్ గ్లాస్ మంత్రం.. ఈ రహస్యం గురించి తెలిసినా 90శాతం మంది పాటించరు..

మన వంటింట్లో సులభంగా లభించే మెంతులు ఆరోగ్యానికి ఎన్నో ప్రయోజనాలు అందిస్తాయి. ముఖ్యంగా మెంతుల నీటిని ప్రతిరోజూ తీసుకోవడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిల నియంత్రణ, జీర్ణక్రియ మెరుగుదల, జుట్టు రాలడం తగ్గడం, చర్మం కాంతివంతంగా మారడం వంటి ప్రయోజనాలు లభిస్తాయని నిపుణులు చెబుతున్నారు.

ఆరోగ్యానికి, అందానికి మార్నింగ్ గ్లాస్ మంత్రం.. ఈ రహస్యం గురించి తెలిసినా 90శాతం మంది పాటించరు..
Fenugreek Water Benefits
Shaik Madar Saheb
|

Updated on: Jul 17, 2026 | 10:05 AM

Share

మెంతులు, మన భారతీయ వంటశాలలలో నిత్యం ఉపయోగించే ఒక సాధారణ సుగంధ ద్రవ్యం. అయితే, వాటి ఆరోగ్య ప్రయోజనాలు మాత్రం అసాధారణమైనవి. చాలా మందికి మధుమేహ నియంత్రణకు మెంతులు ఉపయోగపడతాయని మాత్రమే తెలుసు.. కానీ వాటి ఉపయోగాలు చర్మం, జుట్టు ఆరోగ్యం, జీర్ణక్రియను మెరుగుపరచడం వంటి అనేక విషయాలకు విస్తరించి ఉన్నాయి. మెంతుల నీటిని ప్రతిరోజు తీసుకోవడం ద్వారా సంపూర్ణ ఆరోగ్యాన్ని ఎలా పొందవచ్చో ఈ కథనంలో తెలుసుకుందాం..

మెంతుల నీటి తయారీ – వినియోగం:

మెంతుల నీటిని తయారు చేయడం చాలా సులభం. ఒక టేబుల్‌స్పూన్ మెంతులను తీసుకోండి. వాటిని సుమారు 250మి.లీ (ఒక గ్లాసు) నీటిలో రాత్రంతా నానబెట్టండి. మరుసటి రోజు ఉదయం, నానబెట్టిన మెంతులతో కూడిన ఆ నీటిని ఒక బౌల్‌లోకి మార్చి, స్టవ్ మీద పెట్టి గోరువెచ్చగా చేయండి. నీరు కొంచెం వెచ్చగా మారగానే తీసుకోని తాగవచ్చు..

మెంతులు తినడానికి ఇష్టం లేనివారు, ఆ నీటిని వడకట్టి కేవలం గోరువెచ్చని మెంతుల నీటిని తాగవచ్చు.

మెంతులను కూడా తినగలిగేవారు, నీటిని తాగిన తర్వాత నానబెట్టిన మెంతులను తినవచ్చు. మెంతులను తినడం వల్ల జీర్ణశక్తి మరింత మెరుగుపడుతుంది.

మెంతుల నీటి అద్భుత ప్రయోజనాలు:

మధుమేహ నియంత్రణ: మధుమేహం ఉన్నవారికి మెంతులు ఒక అద్భుతమైన ఔషధం. ఇవి రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడంలో సహాయపడతాయి. మెంతుల నీటిని క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల ఇన్సులిన్ సెన్సిటివిటీ మెరుగుపడుతుంది.

చర్మ సౌందర్యం: మెంతులలో చర్మ పోషణకు అవసరమైన విటమిన్లు – ఖనిజాలు పుష్కలంగా ఉంటాయి. మెంతుల నీటిని తాగడం వల్ల చర్మం లోపలి నుండి పోషణ పొంది, నిగారింపును సంతరించుకుంటుంది. ఇది చర్మాన్ని ఆరోగ్యంగా, కాంతివంతంగా ఉంచుతుంది.

జుట్టు ఆరోగ్యం: జుట్టు రాలడం, జుట్టు పలుచబడటం వంటి సమస్యలతో బాధపడేవారికి మెంతులు చాలా ప్రయోజనకరంగా ఉంటాయి. మెంతుల నీటిని తాగడం వల్ల జుట్టు ఎదుగుదల ప్రోత్సహించబడి, జుట్టు రాలడం తగ్గుతుంది.

మెరుగైన జీర్ణక్రియ: మెంతులు ఫైబర్ అధికంగా ఉండే ఆహారం. ఇవి జీర్ణవ్యవస్థను ఆరోగ్యంగా ఉంచడంలో సహాయపడతాయి. మెంతుల నీటిని తాగడం వల్ల జీర్ణక్రియ మెరుగుపడి, మలబద్ధకం వంటి సమస్యలు తగ్గుతాయి.

శరీర శుభ్రత: మెంతులు శరీరంలోని విష పదార్థాలను బయటకు పంపడంలో సహాయపడతాయి, తద్వారా అంతర్గత శుభ్రతను ప్రోత్సహిస్తాయి.

మెంతుల బాహ్య వినియోగం:

మెంతులను కేవలం లోపలికి తీసుకోవడమే కాకుండా, బాహ్యంగా కూడా ఉపయోగించవచ్చు. నానబెట్టిన మెంతులను మెత్తని పేస్ట్‌గా చేసి, దానిని పెరుగులో కలిపి హెయిర్ ప్యాక్‌గా ఉపయోగించవచ్చు. ఈ హెయిర్ ప్యాక్ జుట్టు రాలడాన్ని తగ్గించి, జుట్టుకు పోషణను అందిస్తుంది. అంతర్గతంగా మెంతుల నీటిని తాగడం, బాహ్యంగా హెయిర్ ప్యాక్ ఉపయోగించడం వల్ల జుట్టు ఆరోగ్యం రెట్టింపు అవుతుంది.

సంపూర్ణ ఆరోగ్యానికి సమగ్ర విధానం:

మెంతుల నీరు ఒక అద్భుతమైన సహజ నివారణ అయినప్పటికీ, సంపూర్ణ ఆరోగ్యం కోసం కేవలం దీనిపైనే ఆధారపడకూడదు. దీనితో పాటు శారీరక శ్రమను కూడా జోడించడం చాలా ముఖ్యం. ప్రతిరోజు ఉదయం లేత ఎండలో నడవడం, తేలికపాటి వ్యాయామాలు చేయడం, యోగా లేదా స్విమ్మింగ్ వంటివి చేయడం వల్ల రక్త ప్రసరణ మెరుగుపడి, చర్మం, జుట్టుకు మరింత ప్రయోజనం చేకూరుతుంది. శారీరక శ్రమ మధుమేహ నియంత్రణలో కూడా కీలక పాత్ర పోషిస్తుంది. ప్రస్తుతం ఫైవ్ స్టార్ హోటల్స్ లో కూడా ఉదయం పూట జీరా వాటర్ తో పాటు మెంతుల నీటిని అందిస్తున్నారంటే దీని ప్రయోజనాలను మనం అర్థం చేసుకోవచ్చు..

మెంతుల నీటిని మీ రోజువారీ దినచర్యలో భాగం చేసుకోవడం ద్వారా, మీరు అనేక ఆరోగ్య సమస్యలను నివారించడమే కాకుండా, మీ చర్మం, జుట్టుకు సహజమైన మెరుపును అందించవచ్చు. ఇది ముందుగానే జబ్బులను నివారించే ఒక అద్భుతమైన పద్ధతి.. అయితే.. ఏమైనా సమస్యలుంటే ముందుగా ఆరోగ్య నిపుణులను సంప్రదించడం మంచిది.

మరిన్ని లైఫ్‌స్టైల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us