Pain During Periods: నెలసరి నొప్పుల నుంచి ఉపశమనాన్ని కోరుకుంటున్నారా..? అయితే ఈ సమాచారం మీ కోసమే..
స్త్రీ జీవితంలో నెలసరి అనేది అత్యంత కీలకమైన దశ. ఇక యువతి మహిళగా మారే క్రమంలో ఈ దశలోనే పునరుత్పత్తి వ్యవస్థ పెరుగుతుంది. కానీ చాలా మంది టీనేజీ అమ్మాయిలకు ఈ దశ అత్యంత..
స్త్రీ జీవితంలో నెలసరి అనేది అత్యంత కీలకమైన దశ. ఇక యువతి మహిళగా మారే క్రమంలో ఈ దశలోనే పునరుత్పత్తి వ్యవస్థ పెరుగుతుంది. కానీ చాలా మంది టీనేజీ అమ్మాయిలకు ఈ దశ అత్యంత చిరాకుగా, అసౌకర్యంగా అనిపించడం సహజం. అలాగే నెలసరి సమయంలో భావోద్వేగాలు అదుపు తప్పడం, నడుము, కాళ్లలో నొప్పులు, తలనొప్పి, అలసట సమస్యలు కూడా ఎదురవుతూనే ఉంటాయి. అయితే శరీర వాతతత్వం కలిగినవారికి నెలసరి ముందు నుంచి లేదా నెలసరి మొదలైన వెంటనే విపరీతమైన నొప్పులు మొదలవుతాయి. పొత్తికడుపు, నడుములో క్రమక్రమంగా నొప్పులు మొదలై కదలలేనంతగా పెరిగిపోతాయి. అలాగే పిత్త దోషం కలిగినవారిలో నెలసరి ముందుగా కాకుండా రక్తస్రావం పెరిగిన వెంటనే నొప్పులు కూడా మొదలవు తాయి.
ఈ సమయంలో పెద్ద రక్తపు గడ్డలు కనిపించడమే కాక రాత్రివేళ విపరీతమైన రక్తస్రావంతో మెలకువ వస్తుంది. రక్తస్రావం సమయంలో తల తిరగడం, అయోమయం వంటి ఇబ్బందులు ఉంటాయి. ఇక కఫదోషం ఉన్నవారికి నొప్పి తక్కువగానే ఉన్నా, తల భారంగా ఉంటుంది. మానసిక అయోమయం, గందరగోళం ఉంటుంది. అలసట కనిపిస్తుంది. ఈ లక్షణాలు నెలసరి మొదలైన క్షణం నుంచీ ఉండి, క్రమేపీ తగ్గుతాయి. నెలసరి సమయంలో మానసిక, శారీరక అసౌకర్యాలు భరించలేనంతగా ఉంటే ఉపశమనం కోసం కొన్ని రకాల ఆయుర్వేద చిట్కాలను పాటించవచ్చు. అవేమిటో ఇప్పుడు తెలుసుకుందాం..
ఆయుర్వేద చిట్కాలు
నువ్వుల నూనె మర్దన: ఆయుర్వేదంలో అభ్యంగన స్నానం కోసం నువ్వుల నూనెను వాడతారు. ఈ నూనెలో ఉండే లినోలిక్ యాసిడ్‌కు ఇన్‌ఫ్లమేషన్‌ను తగ్గించే గుణం ఉంటుంది. విషాలను హరించే తత్వం కూడా ఈ నూనెకు ఉన్నందున నెలసరి సమయంలో పొత్తికడుపు మీద సున్నితంగా మర్దన చేయాలి. ఇలా చేస్తే కడుపు నొప్పి నుంచి ఉపశమనం పొందవచ్చు.
మెంతులు: కాలేయం, మూత్రపిండాలు, మెటబాలిజం పనితనంలో మెరుగుదలకు మెరుగైన ఔషధం మెంతులే. వీటితో నెలసరి నొప్పులు కూడా తగ్గుతాయి. కాబట్టి 2 టీస్పూన్ల మెంతులను 12 గంటలపాటు నీళ్లలో నానబెట్టి తాగాలి. అలా చేయడం వల్ల నొప్పుల నుంచి ఉపశమనం పొందవచ్చు.
వేడి కాపడం: పొత్తికడుపు మీద వేడి కాపడం పెడితే గర్భాశయ కండరాలు ఉపశమనం పొంది నొప్పులు తగ్గుతాయి. అందుకోసం వేడి నీళ్లతో నింపిన వాటర్ బ్యాగ్‌లను పొత్తికడుపు మీద ఉంచి కాపడం పెట్టాలి. వేడి జావ తాగినా, వేడి నీళ్ల స్నానం చేసినా కూడా చక్కని ఫలితం ఉంటుంది.
శొంఠి, మిరియాల టీ: శొంఠి, మిరియాల పొడితో చేసిన హెర్బల్ టీలో పాలు కలపకుండా తాగితే, నొప్పులకు కారణమయ్యే హార్మోన్ల పరిమాణం తగ్గి నొప్పులు తగ్గుతాయి.
జీలకర్ర వైద్యం: జీలకర్ర వేసి మరిగించిన నీళ్లు తాగినా కూడా నొప్పుల నుంచి ఉపశమనం లభిస్తుంది.
ఆహారపు అలవాట్లలో తీసుకోవలసిన జాగ్రత్తలు
- చక్కెర, మైదా, కృత్రిమ రంగులను ఆహారంలో కలపడాన్ని కట్టిబెట్టేయాలి.
- ఉప్పు మన శరీరంలో నీరు నిల్వ ఉండేలా చేస్తుంది. కాబట్టి దీని వాడకం వల్ల నెలసరి సమయంలో ఒళ్లు మరింత బరువై బద్ధకం ఆవరిస్తుంది.
- కాఫీలో ఉండే కెఫీన్ వల్ల నెలసరి నొప్పులు ఎక్కువవుతాయి. కాబట్టి దీనికి నెలసరి సమయంలో స్వస్తి పలకాలి.
- ప్రతి రోజూ పరగడుపున నిమ్మరసం తాగడం అలవాటు చేసుకోవాలి.
- రోజుకు కనీసం 8 గంటల నిద్ర తప్పనసరి. నిద్రతో శరీరం ఉపశమనం పొందుతుంది. ఫలితంగా నొప్పులూ అదుపులోకి వస్తాయి.
మరిన్ని లైఫ్ స్టైల్ వార్తల కోసం..