
గుడ్లు అంటే ఎవరికి ఇష్టం ఉండదు? వాటితో రకరకాల వంటకాలు తయారు చేసుకుని తింటుంటారు భోజన ప్రియులు. కాల్షియం పుష్కలంగా ఉండే గుడ్లు ఆరోగ్యానికి కూడా ఎంతో మంచివని అందరికీ తెలిసిందే. కానీ గుడ్లు వినియోగించేటప్పుడు వీటిని బయటి పెంకులను చాలా మంది వృథాగా పడేస్తుంటారు. ఇలా వ్యర్థంగా పారవేసే గుడ్డు పెంకులతో ఎన్నో లాభాలు ఉన్నాయంటున్నారు ఆరోగ్య నిపుణులు. ఇవి ముఖ సౌందర్యాన్ని పెంచడంలో ఎంతో ప్రయోజనకరంగా ఉంటాయి. కాబట్టి, ఇకపై ఇంట్లో గుడ్డు ఉడకబెట్టిన తర్వాత దాని పెంకును పారవేయడానికి బదులు.. చర్మ సౌందర్యాన్ని మెరుగుపరచడానికి వినియోగించవచ్చు. ఎలాగంటే..
చాలా మందికి మొటిమల వల్ల ఏర్పడిన నల్ల మచ్చలు ఎంతకూపోవు. దీంతో చర్మంపై నల్లటి మచ్చలు ముఖంపై వికారంగా కనిపిస్తాయి. గుడ్డు పెంకులను మెత్తగా పొడిచేసి, అందులో తేనె కలిపి ఫేస్ ప్యాక్‌ను తయారు చేసుకోవచ్చు. ముందుగా గుడ్డు పెంకులను శుభ్రంగా కడిగి, ఆరబెట్టి, మెత్తగా రుబ్బుకోవాలి. ఈ పొడికి తేనె కలిపి, ముఖానికి అప్లై చేసి, పూర్తిగా ఆరిన తర్వాత చల్లటి నీటితో శుభ్రం చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల ముఖంపై ఉన్న మచ్చలు పూర్తిగా తొలగిపోతాయని నిపుణులు చెబుతున్నారు.
చర్మ కాంతిని పెంచడానికి మార్కెట్లో దొరికే ఉత్పత్తులను ఉపయోగించే బదులు, గుడ్డు పెంకు పొడిని ఉపయోగించవచ్చు. గుడ్డుపై ఉండే పెంకు పొడిని, తెల్లసొన సమాన మొత్తంలో తీసుకుని.. బాగా కలుపుకోవాలి. దీన్ని ముఖానికి అప్లై చేసి గంట తర్వాత చల్లటి నీటితో శుభ్రం చేసుకోవాలి. దీన్ని వారానికి రెండుసార్లు అప్లై చేయడం వల్ల ముఖం కాంతివంతంగా మారుతుంది. చర్మంపై మంటను తగ్గించడానికి యాపిల్ సైడర్ వెనిగర్, లవంగాలను గుడ్డు పెంకు పొడితో కలిపి ఉపయోగించవచ్చు. అర కప్పు ఆపిల్ సైడర్ వెనిగర్‌లో కొద్ది మొత్తంలో గుడ్డు పెంకు పొడిని వేసి దాదాపు ఐదు రోజులు నానబెట్టాలి. తర్వాత పేస్ట్ లా చేసి, దానిని కాటన్ బాల్ మీద రుద్ది చర్మానికి అప్లై చేయాలి. అది ఆరిన తర్వాత, చల్లటి నీటితో శుభ్రం చేసుకోవాలి. ఇలా వారానికి రెండుసార్లు చేయడం వల్ల మంట వంటి సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది.
మీ ముఖం మీద మొటిమల మచ్చలు ఉంటే, రెండు టేబుల్ స్పూన్ల గుడ్డు పెంకుల పొడిని నిమ్మరసంతో కలిపి పేస్ట్ లా తయారు చేసుకోవాలి. దీన్ని చర్మంపై ఉన్న మచ్చలకు అప్లై చేసి, కొంత సమయం అలాగే ఉంచి, ఆపై ముఖాన్ని చల్లటి నీటితో కడగాలి. ఈ విధంగా గుడ్డు పెంకులను ఉపయోగించడం వల్ల ముఖంపై మచ్చలు తొలగిపోయి ముఖ సౌందర్యం రెట్టింపు అవుతుంది.
గమనిక: ఇక్కడ ఉన్న విషయాలు కేవలం సమాచార ప్రయోజనాల కోసం మాత్రమే. ఈ టిప్స్ ప్రయత్నించే ముందు వైద్య సలహా తీసుకోవాలి.