AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఒక్క ఆకుతో ఎన్నో అద్భుతాలు.. తమలపాకుల ఈ సీక్రెట్ గురించి మీకు తెలుసా..?

భారతీయ సంస్కృతిలో తమలపాకులకు విశిష్ట స్థానం ఉంది. తమలపాకు సంప్రదాయంగా శుభకార్యాల్లో బంధాలను సూచిస్తుంది. ఇది జీర్ణక్రియకు అద్భుతమైన ఔషధం. కాల్షియం గ్రహణానికి, పిల్లల్లో కడుపు నొప్పికి, కళ్ల వేడి తగ్గించడానికి తమలపాకును పలు రకాలుగా ఉపయోగిస్తారు. అయితే, దీనిని ఔషధంగా వాడాలి తప్ప అలవాటుగా మార్చుకోకూడదంటున్నారు ఆరోగ్య, ఆయుర్వేద నిపుణులు..

ఒక్క ఆకుతో ఎన్నో అద్భుతాలు.. తమలపాకుల ఈ సీక్రెట్ గురించి మీకు తెలుసా..?
Betel Leaves
Shaik Madar Saheb
|

Updated on: Mar 17, 2026 | 4:57 PM

Share

తమలపాకు, భారతీయ సంస్కృతిలో ప్రాముఖ్యత కలిగిన ఒక మొక్క.. శుభకార్యాల నుండి వ్యాపార ఒప్పందాల వరకు తాంబూలం మార్పిడి ద్వారా బంధాలను, విశ్వాసాన్ని వ్యక్తం చేసే ఒక సంప్రదాయంగా ఇది వేళ్లూనుకుంది. తమలపాకు కేవలం ఆచార వ్యవహారాలకు మాత్రమే పరిమితం కాకుండా, అనేక అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తుంది. ఎన్నో ఔషధ గుణాలు దాగున్న తమలపాకు.. బహుళ ప్రయోజనాలను అందిస్తుందని.. ఆరోగ్యానికి ఇది చాలా మంచిదని పేర్కొంటున్నారు ఆరోగ్య నిపుణులు..తమలపాకు జీర్ణక్రియను మెరుగుపరచడం, దగ్గు-జలుబు తగ్గించడం, నోటి దుర్వాసన పోగొట్టడం, యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ ఫంగల్ లక్షణాల ద్వారా రోగనిరోధక శక్తిని పెంచడంలో అద్భుతంగా పనిచేస్తుంది. ఇంకా మలబద్ధకం నివారణకు, చర్మ, జుట్టు ఆరోగ్యానికి కూడా సహాయపడుతుంది. ఇది ఆయుర్వేదంలో ఒక ముఖ్యమైన ఔషధ ఆకుగా పేర్కొంటారు.

తమలపాకు – సంప్రదాయ ప్రాముఖ్యత:

తమలపాకు చరిత్రను పరిశీలిస్తే, ఇది కేవలం నమలడానికి మాత్రమే కాదని తెలుస్తుంది. పెళ్లిళ్లు, ఇతర శుభకార్యాల్లో తాంబూలం ఇచ్చిపుచ్చుకోవడం అనేది రెండు కుటుంబాల మధ్య సంబంధాన్ని, ఒప్పందాన్ని సూచిస్తుంది. పూర్వకాలంలో వ్యాపార లావాదేవీలలో సైతం ఒప్పందాలను దృఢపరచడానికి తాంబూలం వినియోగించేవారని చరిత్ర చెబుతోంది. తాంబూలం మార్పిడిని ఒక రకమైన అగ్రిమెంట్ లేదా బంధంగా భావించేవారు.. ఇది లిఖితపూర్వక ఒప్పందాల అవసరాన్ని తగ్గించేది.

జీర్ణవ్యవస్థకు మేలు: తమలపాకు ప్రధాన ఆరోగ్య ప్రయోజనాలలో ఒకటి జీర్ణక్రియకు సహాయపడటం.. భారీగా భోజనం చేసిన తర్వాత, ముఖ్యంగా నూనె, స్వీట్లు ఎక్కువగా ఉన్న ఆహారం తీసుకున్నప్పుడు, ఒక తమలపాకును చిన్న పటిక బెల్లం ముక్కతో కలిపి నమలడం వల్ల ఆహారం సులభంగా జీర్ణమవుతుంది. ఇది గ్యాస్ట్రిక్ సమస్యలను నివారిస్తుంది, ఆహారం అరగడానికి తోడ్పడుతుంది. రాత్రిపూట దీనిని తీసుకుంటే ఉదయం సుఖ విరేచనం అయ్యేందుకు సహాయపడుతుంది. అయితే, దీనిని అలవాటుగా కాకుండా, అవసరమైనప్పుడు ఔషధంగా మాత్రమే ఉపయోగించాలని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు.

కాల్షియం గ్రహణానికి: తమలపాకుతో పాటు కొద్దిగా సున్నం కలిపి నమలడం వల్ల శరీరం కాల్షియంను మెరుగ్గా గ్రహిస్తుంది. కాల్షియం మాత్రల కన్నా ఈ సహజ పద్ధతి ద్వారా శరీరానికి కాల్షియం లభిస్తుందని చెబుతారు. సున్నం చాలా తక్కువ మోతాదులో, తమలపాకుకు పలచగా రాసి తీసుకోవాలి.

పిల్లల్లో కడుపు నొప్పికి ఉపశమనం: చిన్న పిల్లల్లో వచ్చే కడుపు నొప్పి, ఉబ్బరానికి తమలపాకు ఒక సహజ చికిత్స. తమలపాకుకు కొద్దిగా ఆముదం రాసి, పెనంపై గోరువెచ్చగా వేడి చేసి, పిల్లల పొట్టపై ఉంచి బట్టతో కట్టాలి. ఇలా రెండు సార్లు చేస్తే పొట్ట ఉబ్బరం తగ్గి, జీర్ణక్రియ మెరుగుపడుతుంది.

కళ్ల సంరక్షణకు: కళ్ల వేడిని తగ్గించడానికి, దృష్టి లోపాలను నియంత్రించడానికి తమలపాకును ఉపయోగించవచ్చు. పెరుగు లేదా చిక్కటి మజ్జిగలో తమలపాకులను నలిపి ముంచి, సుమారు అరగంట నుండి రాత్రంతా నానబెట్టాలి. అనంతరం, ఆ మజ్జిగను కళ్లపై వేసుకుని 20-30 నిమిషాల పాటు విశ్రాంతి తీసుకోవాలి. ఇది కళ్ల వేడిని తగ్గించి, దృష్టికి మేలు చేస్తుందని వివరించారు.

తమలపాకు ఇతర ఉపయోగాలు:

తమలపాకుతో బటర్ మిల్క్ (మజ్జిగ) కూడా తయారు చేసుకోవచ్చు. ఒక లీటరు మజ్జిగకు రెండు లేదా మూడు ఆకులు, కొద్దిగా సోంపు, జీలకర్ర, పటిక బెల్లం (తీపి కోసం), లేదా పచ్చిమిర్చి, పుదీనా, అల్లం (కారంగా కావాలంటే) కలిపి మిక్సీ చేసి తాగవచ్చు. తమలపాకుతో బజ్జీలు కూడా తయారు చేస్తారు.. ఇవి రుచిగా ఉంటాయి.

అయితే, తమలపాకును వాడేటప్పుడు సరైన పద్ధతిని పాటించడం అత్యవసరం. దీనిని ఔషధంగా భావించి, పరిమితంగా వాడాలి. రోజువారీ అలవాటుగా మార్చుకోవడం వల్ల కొన్ని అనారోగ్య సమస్యలు తలెత్తవచ్చని నిపుణులు హెచ్చరిస్తున్నారు. తమలపాకులో దాగి ఉన్న ఈ అద్భుత రహస్యాలను తెలుసుకొని, సరైన రీతిలో వినియోగించుకోవడం ద్వారా మనం ఆరోగ్యాన్ని పెంపొందించుకోవచ్చు.

మరిన్ని లైఫ్‌స్టైల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us