ముద్దుగున్న పొద్దుతిరుగుడుతో పుష్కలమైన ఆరోగ్యం.. విత్తనాలే కాదు..ఆకులతో అద్బుతాల్లేన్నో..
పసుపురంగు పొద్దుతిరుగుడు అందానికే కాదు, ఔషధ గుణాలతో నిండిన ఆరోగ్య నిధి. ఆయుర్వేదంలో దీని పువ్వులు, ఆకులు, విత్తనాలు, నూనె శారీరక, మానసిక సమస్యలకు చికిత్సకు ఉపయోగిస్తారు. బ్యాక్టీరియాతో పోరాడటం, నొప్పి, వాపు తగ్గించడం, జీర్ణక్రియ మెరుగుపరచడం, చర్మ సమస్యల నివారణ, గుండె, థైరాయిడ్ ఆరోగ్యానికి పొద్దుతిరుగుడు అద్భుత ప్రయోజనాలను అందిస్తుంది.

పసుపురంగులో ఎంతో ఆకర్షణీయంగా కనిపించే పొద్దుతిరుగుడు.. తోట అలంకరణ మాత్రమే కాదు.. ఔషధ గుణాలతో నిండిన ఆరోగ్య నిధి కూడా. దీని వినియోగం అనేక ప్రయోజనాలను అందిస్తుంది. ఆయుర్వేదంలో దీనిని సూర్యముఖి అని కూడా పిలుస్తారు. దీని పువ్వులు, విత్తనాలు, ఆకులు, నూనె శతాబ్దాలుగా శారీరక, మానసిక ఆరోగ్య సమస్యలకు చికిత్స చేయడానికి ఉపయోగించబడుతున్నాయి. పొద్దుతిరుగుడు విత్తనాల ప్రయోజనాలేంటో చాలా మందికి తెలిసే ఉంటుంది. కానీ, దాని ఆకులు, పువ్వుల వల్ల కలిగే అద్భుతాలేంటో ఇక్కడ చూద్దాం…
పొద్దుతిరుగుడు పువ్వులలో ట్రైటెర్పీన్ గ్లైకోసైడ్లు అనే సమ్మేళనాలు పుష్కలంగా ఉంటాయి. ఇవి బ్యాక్టీరియాతో పోరాడడంలో, నొప్పిని తగ్గించడంలో, వాపును తగ్గించడంలో (యాంటీ ఇన్ఫ్లమేటరీ) అత్యంత ప్రభావవంతమైనవి. అవి గుండె, థైరాయిడ్ ఆరోగ్యాన్ని ప్రోత్సహించే యాంటీఆక్సిడెంట్లలో కూడా సమృద్ధిగా ఉంటాయి.
ఔషధ గుణాలు అధికంగా ఉండే పొద్దుతిరుగుడు పువ్వుల వినియోగం అనేక ప్రయోజనాలను అందిస్తుంది. అవి కీళ్ల నొప్పులు, ఆర్థరైటిస్, శరీర దృఢత్వం నుండి ఉపశమనం కలిగిస్తాయి. మలబద్ధకం, ఉబ్బరం, గ్యాస్, కుడుపులో నులి పురుగులను కూడా తొలగిస్తాయి. జీర్ణవ్యవస్థను బలోపేతం చేస్తాయి. పొద్దుతిరుగుడు పువ్వులు చర్మానికి కూడా ఒక వరం. పొద్దుతిరుగుడు పువ్వు నూనెను శరీరానికి అప్లై చేయటం వేయడం వల్ల లేదా విత్తనాలను తీసుకోవడం వల్ల కురుపులు, దురద, చర్మ వ్యాధులకు ప్రయోజనకరంగా ఉంటుంది.
పొద్దుతిరుగుడు ఆకుల కషాయం:
పొద్దు తిరుగుడు ఆకులతో కషాయం లేదా టీ తయారు చేసి వాడితే జ్వరాన్ని తగ్గించడంలో సహాయపడుతుందని ఆయుర్వేద నిపుణులు అంటున్నారు. ఈ పువ్వు గుండె, థైరాయిడ్‌కు కూడా మంచిది. యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉండటం వల్ల ఇది గుండె జబ్బులు, థైరాయిడ్ సమస్యలకు మేలు చేస్తుంది. పొద్దుతిరుగుడు విత్తనాలలో ఒమేగా-6 కొవ్వు ఆమ్లాలు, విటమిన్ E, మెగ్నీషియం, సెలీనియం, జింక్ కూడా పుష్కలంగా ఉన్నాయి.
పొద్దుతిరుగుడు నూనెను వంటలలో కూడా ఉపయోగిస్తారు. ఇది శరీరంలో మంచి కొలెస్ట్రాల్‌ను పెంచుతుంది. పొద్దుతిరుగుడు పువ్వుల రోజువారీ వినియోగం చాలా ప్రయోజనకరంగా ఉంటుందని నిపుణులు అంటున్నారు. అయితే, దానిని తీసుకునే ముందు ఆయుర్వేద వైద్యుడిని సంప్రదించడం ముఖ్యం.
మరిన్ని లైఫ్‌స్టైల్ న్యూస్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.








