AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Telangana: గురూజీ అంటూ వచ్చారు.. గుండెలో గునపం దింపారు.. జోగిని వేశంలో శిష్యులుగా చేరి..

గురువును నమ్మించి శిష్యులుగా చేరారు.. ఆయన దగ్గరే ఉంటూ నమ్మకాన్ని సంపాదించారు. చివరకు అదే నమ్మకాన్ని ఆసరాగా చేసుకుని కర్కశంగా ప్రాణాలు తీశారు. ఆధ్యాత్మికత ముసుగులో సాగిన పరిచయం.. చివరకు హత్య, భారీ దోపిడీకి దారితీసింది. గురూజీ వద్ద చేరిన శిష్యులే ఘాతుకానికి ఒడిగట్టిన ఈ ఘోర ఘటన ఎక్కడ జరిగిందో తెలుసుకోవాలంటే ఈ స్టోరీ చదవాల్సిందే.

Telangana: గురూజీ అంటూ వచ్చారు.. గుండెలో గునపం దింపారు.. జోగిని వేశంలో శిష్యులుగా చేరి..
Yadadri Guruji Murder
M Revan Reddy
| Edited By: |

Updated on: Nov 01, 2026 | 12:37 PM

Share

యాదాద్రి జిల్లా చౌటుప్పల్ మార్కండేయ కాలనీకు చెందిన శివసత్తు (జోగిని) రాళ్లబండి సుధాకర్ స్వామి గురూజీ (48)గా కొనసాగుతున్నాడు. తన ఇంటి వద్ద, ఇతర ఆలయాల్లో శివసత్తుగా సుధాకర్ గురూజీ ఆధ్యాత్మిక కార్యక్రమాలను నిర్వహిస్తున్నాడు. అయితే ఆధ్యాత్మికత ముసుగులో అస్సాంకు చెందిన ఇద్దరు వ్యక్తులు శిష్యులుగా సుధాకర్ గురూజీ వద్ద చేరారు. గురువు వద్ద నమ్మకంగా ఉంటూ.. ఆయన ఇంటి పరిస్థితులు, విలువైన వస్తువుల గురించి తెలుసుకున్నారు.

కళ్లల్లో పెప్పర్ స్ప్రే.. కాళ్లు, చేతులు కట్టేసి..

సుధాకర్ గురూజీ వద్ద నమ్మకంగా ఉంటున్న దుండగులు.. ఆయన ఇంట్లోని బంగారు, డబ్బులపై కన్నేశారు. ఈ క్రమంలో అర్ధరాత్రి సుధాకర్ స్వామిపై దాడికి దిగారు. సుధాకర్ కళ్లలో పెప్పర్ స్ప్రే చల్లి, కాళ్లు చేతులు కట్టేసి హత్య చేశారు. అనంతరం ఇంట్లోని బీరువాను తెరిచి 70 తులాల బంగారం, రూ.10 లక్షల నగదును దోచుకెళ్లారు. ఆ తర్వాత మృతుడికి చెందిన స్కార్పియో వాహనంలో చౌటుప్పల్ నుంచి పరారయ్యారు.

ఆధారాలు చెరిపే ప్రయత్నం..

సుధాకర్ గురూజీనీ హత్య చేసిన దుండగులు తర్వాత పోలీసులకు ఎలాంటి ఆధారాలు దొరకకుండా వాటిని చెరిపే ప్రయత్నం చేశారు. ఇంట్లోని సీసీ కెమెరాల ఫుటేజ్‌ను రికార్డు చేసే హార్డ్‌డిస్క్‌ను సైతం ఎత్తుకెళ్లారు. దీంతో కేసు దర్యాప్తులో పోలీసులకు సవాలు ఎదురైంది. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని క్లూస్ టీంతో ఆధారాలు సేకరించారు. ఇంట్లోని పరిస్థితులు, దొరికిన భౌతిక ఆధారాలు, వాహనం కదలికలు.. ఇలా ప్రతి అంశాన్ని పరిశీలించారు. ఈ కేసును పోలీసులు సీరియస్ గా తీసుకున్నారు. సీసీ కెమెరాల హార్డ్‌డిస్క్‌ను ఎత్తుకెళ్లినా.. వాహనంలోని జీపీఎస్‌ను మర్చిపోయారు. అయితే దుండగులు తీసుకెళ్లిన స్కార్పియో వాహనంలోని జీపీఎస్ కీలకంగా మారింది. వాహనం కదలికలను సాంకేతికంగా పరిశీలించిన పోలీసులు నిందితుల ఆచూకీని గుర్తించారు.

పోలీసులకు సవాల్ గా మారిన కేసు

అస్సాంకు చెందిన వ్యక్తులుగా అనుమానిస్తున్న నిందితుల కోసం గాలింపు చేపట్టిన పోలీసులు ఎట్టకేలకు వారిని బోధన్ లో అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి మరిన్ని వివరాలు రాబట్టే పనిలో ఉన్నారు. హత్యకు అసలు కారణం, దోపిడీలో మరెవరైనా భాగస్వాములుగా ఉన్నారా? అపహరించిన సొత్తు ఎక్కడుంది? అనే కోణాల్లో దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు చెబుతున్నారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us