Hyderabad: హైదరాబాద్‌లో నీటి కష్టాలకు చెక్.. కేవలం రూ.400కే ట్యాంకర్.. ఈ నెంబర్‌కు కాల్ చేస్తే..
హైదరాబాద్‌లో నీటి కొరతను అధిగమించేందుకు జలమండలి నేటి నుంచి గ్రీన్ ట్యాంకర్ల ద్వారా నీటి సరఫరా చేపట్టనుంది. ఇందుకోసం ఇప్పటికే ట్యాంకర్లను సిద్దం చేసింది. వీటి ద్వారా అతి తక్కువ ధరకే నీటి సరఫరా చేయనుంది. వీటిని ఇతర అవసరాల కోసం వినియోగించుకోవచ్చు.

ఎల్‌నివో ప్రభావంతో ఈ ఏడాది వర్షాలు లేకపోవడంతో హైదరాబాద్‌లో నీటి కష్టాలు తీవ్రతరం అవుతున్నాయి. నీటి కొరత వల్ల ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. రానున్న రోజుల్లో సూపర్ ఎల్‌నివో పరిస్థితుల వల్ల పరిస్థితి మరింత దిగజారనుందని, నీటి సమస్య మరింత ఎక్కువవుతుందని జీహెచ్‌ఎంసీ అధికారులు హెచ్చరిస్తున్నారు. దీంతో నీటిని పొదుపుగా వాడుకోవాలని, అసలు వృథా చేయవద్దని సూచిస్తోంది. నీటిని వృథా చేసేవారికి జలమండలి కఠిన చర్యలు తీసుకుంటోంది. వారికి భారీగా జరిమానాలు విధించడంతో పాటు వాటర్ కనెక్షన్ కూడా రద్దు అవకాశముంది. అయితే నీటి కొరతను తీర్చేందుకు జలమండలి ప్రత్యామ్నాయ చర్యలు చేపడుతోంది. అందులో భాగంగా శుద్ది చేసిన నీటిని నవంబర్ 1 నుంచి సరఫరా చేస్తోంది. ఈ నీటికి త్రాగునీటి, గృహ అవసరాలకు కాకుండా ఇతర అవసరాలకు ఉపయోగించుకోవచ్చు. నేటి నుంచి గ్రీన్ ట్యాంకర్ల ద్వారా వీటిని సరఫరా చేయనుంది.
ఈ పనులకు ఉపయోగించుకోవచ్చు
మురుగునీటిని ఆధునిక టెక్నాలజీ ఉపయోగించి శుద్ది చేస్తారు. ఇళ్లు, కర్మాగారాల నుంచి వచ్చే మురుగునీటిని శుద్ది చేస్తారు. ఈ నీటిని నిర్మాణ రంగం, తోపపని, స్విమ్మింగ్ పూల్స్ వంటి ఇతర పనులకు ఉపయోగించుకోవచ్చు. నీటి కొరత వల్ల ఆందోళన పరిస్థితులు నెలకొన్న క్రమంలో ఈ నీటిని సరఫరా చేసేందుకు జలమండలి ప్రత్యేకంగా గ్రీన్ ట్యాంకర్లను తీసుకొచ్చింది. తొలి విడతలో 21 గ్రీన్ ట్యాంకర్లను అందుబాటులోకి తీసుకురాగా.. నవంబర్ 1 నుంచి వీటి ద్వారా సరఫరా ప్రారంభించనుంది. కేవలం డెలివరీ ఛార్జీలు వసూలు చేసి వీటిని అవసరమైన వారికి సరఫరా చేస్తారు. భవనాల క్యూరింగ్, ల్యాండ్ స్కేపింగ్ పనులు, స్విమ్మింగ్ పూల్స్ వంటి అవసరాలకు వీటిని వినియోగించుకోవచ్చు.
ట్యాంకర్ ధర ఎంతంటే..?
5 వేల లీటర్ల నీటి సరఫరా ధర విషయానికొస్తే తొలి 4 కిలోమీటర్లకు రూ.400గా నిర్ణయించారు. ఆ తర్వాత ప్రతీ కిలోమీటర్‌కు అదనంగా రూ.55 వసూలు చేస్తారు. ఇక 10 వేల లీటర్ల ధర రూ.800గా నిర్ణయించగా.. ఆ తర్వాత ప్రతీ కిలోమీటర్‌కు రూ.65 వసూలు చేయనున్నారు. 20 వేల లీటర్ల ధర తొలి 4 కిలోమీటర్లకు రూ.1600గా ఉండగా.. ఆ తర్వాత ప్రతీ కిలోమీటర్‌కు రూ.80గా నిర్ణయించారు. 155313 నెంబర్‌కు కాల్ చేయడం ద్వారా ట్యాంకర్ బుక్ చేసుకోవచ్చు. భవనాల క్యూరింగ్, ఇతర అవసరాల కోసం 140 ఎంఎల్‌డీ నీరు అవసరమవుతుందని జలమండలి అంచనా వేసింది. ఇక తోటపనులకు 12.47 ఎంఎల్‌డీ నీరు వినియోగించనుండగా.. స్విమ్మింగ్ పూల్స్ కోసం 11.30 ఎంఎల్‌డీ నీరు అవసరమవుతుందని గుర్తించింది. నగరంలో 27 ఫిల్లింగ్ కేంద్రాలు ఉండగా.. వీటి ద్వారా 646 ఎంఎల్‌డీ శుద్ది చేసిన నీటిని సరఫరా చేయనున్నారు. నగంరలో 45 ప్రాంతాల్లో మురుగునీటిని శుద్ది చేసే కేంద్రాలు న్నాయి. వీటి ద్వారా 1500 మిలియన్ గ్యాలన్ల నీటిని శుద్ది చేసిన మూసీలోకి విడుదల చేస్తున్నారు.
