దొంగగా భావించి ఓ వ్యక్తిని కొట్టి చంపిన వాచ్‌మన్
హైదరాబాద్ శివారులో దారుణం జరిగింది. చీకట్లో వచ్చిన వక్తిని దొంగగా భావించి, కట్టేసి కొట్టడంతో ఓ వ్యక్తి ప్రాణాలను కోల్పోయాడు.
హైదరాబాద్ శివారులో దారుణం జరిగింది. చీకట్లో వచ్చిన వక్తిని దొంగగా భావించి, కట్టేసి కొట్టడంతో ఓ వ్యక్తి ప్రాణాలను కోల్పోయాడు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. బాచుపల్లి పోలీసు స్టేషన్ పరిధిలోని ప్రగతినగర్‌లో నూతనంగా నిర్మిస్తున్న అభి వెంచర్‌లో పని చేయడానికి మేస్త్రీల బృందం సోమవారం ఒడిశా నుంచి వచ్చింది. అయితే, మంగళవారం తెల్లవారుజామున 4 గంటల సమయంలో లక్ష్మణ్ జా (48) అనే మేస్త్రీ అభి వెంచర్‌కు ఆనుకొని ఉన్న మరో నూతనంగా నిర్మిస్తున్న జ్యోత్స్న అపార్ట్‌మెంట్‌లోకి వెళ్లాడు. అలికిడి కావడంతో ఆ అపార్ట్‌మెంట్‌లో వాచ్‌మన్‌గా పనిచేస్తున్న నర్సింహ అతన్ని బంధించాడు. లక్ష్మణ్‌ను చూసి దొంగగా భావించి కర్రతో తలపై కొట్టి తాడుతో బంధించాడు. వాచ్‌మన్ చుట్టుపక్కల వారికి సమాచారాన్ని అందించి మరోసారి కొట్టడంతో లక్ష్మణ్ తీవ్రగాయాలతో స్పృహ కోల్పోయాడు. అక్కడికి చేరుకున్న ఇరుపొరుగు వారు అతని పరిస్థితి విషమించడంతో ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో లక్ష్మణ్ మృతి చెందాడు. దీంతో స్థానికులు బాచుపల్లి పోలీసులకు సమాచారం ఇచ్చారు. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆస్పత్రికి తరలించి, నర్సింహను అదుపులోకి తీసుకున్నారు.