యూపీ: శాడిస్ట్ క్రిమినల్ హతం.. 23 మంది చిన్నారులు సేఫ్!
UP Hostage Crisis: ఉత్తరప్రదేశ్‌లోని ఫరూఖాబాద్ జిల్లాలో 23 మంది చిన్నారులను బందీగా చేసుకున్న ఆగంతుకుడిని గురువారం రాత్రి కమాండోలు రెస్క్యూ ఆపరేషన్‌లో హతమార్చారు. అంతేకాక గాయాలతో ఆసుపత్రి పాలైన అతని భార్య కూడా మృతి చెందింది. పోలీసుల కథనం ప్రకారం.. ఓ హత్యకేసులో జీవితఖైదు శిక్షను అనుభవిస్తున్న సుభాష్ బాథమ్ అనే నిందితుడు ఇటీవల పెరోల్ మీద బయటికి వచ్చాడు. తన కూతురు గౌరి బర్త్‌డే పార్టీకి రమ్మని చుట్టుపక్కల పిల్లలను ఆహ్వానించాడు. దాదాపు 23 […]
UP Hostage Crisis: ఉత్తరప్రదేశ్‌లోని ఫరూఖాబాద్ జిల్లాలో 23 మంది చిన్నారులను బందీగా చేసుకున్న ఆగంతుకుడిని గురువారం రాత్రి కమాండోలు రెస్క్యూ ఆపరేషన్‌లో హతమార్చారు. అంతేకాక గాయాలతో ఆసుపత్రి పాలైన అతని భార్య కూడా మృతి చెందింది. పోలీసుల కథనం ప్రకారం.. ఓ హత్యకేసులో జీవితఖైదు శిక్షను అనుభవిస్తున్న సుభాష్ బాథమ్ అనే నిందితుడు ఇటీవల పెరోల్ మీద బయటికి వచ్చాడు. తన కూతురు గౌరి బర్త్‌డే పార్టీకి రమ్మని చుట్టుపక్కల పిల్లలను ఆహ్వానించాడు. దాదాపు 23 మంది చిన్నారులు ఇంట్లోకి రాగానే తలుపులు మూసేసి వారిని బందీలుగా చేసుకున్నాడు.
ఈలోపు బబ్లీ అనే పొరిగింటి మహిళ తన కుమార్తెను తీసుకెళ్లేందుకు వెళ్లగా.. సుభాష్ తలుపు తియ్యడానికి నిరాకరించడమే కాకుండా ఆమెను తిట్టి పంపించాడు. ఆమె తన ఇంట్లోని కుటుంబసభ్యులకు జరిగిన విషయాన్ని తెలియజేసింది. ఇక స్థానికులు, గ్రామస్తులు కలిసి సుభాష్ ఇంటి తలుపును విరగొట్టడానికి ప్రయత్నించగా.. అతడు వారిపై కాల్పులు జరిపాడు. దీంతో వారు పోలీసులకు సమాచారం అందించారు.
క్విక్ రియాక్షన్ టీమ్, స్పెషల్ ఆపరేషన్ గ్రూప్ పోలీసులు హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకొని రెస్క్యూ ఆపరేషన్ ప్రారంభించారు. తలుపులు తెరవాలని వారు ఆదేశించినా కూడా సుభాష్ వినకుండా కిటికీ నుంచి గ్రానైడ్‌ను విసరడమే కాకుండా తుపాకీతో కాల్పులు జరిపాడు. ఈ కాల్పుల్లో ఇద్దరు పోలీసులు గాయాలపాలయ్యారు. ఇక సుమారు 10 గంటల పాటు జరిగిన ఈ హైడ్రామాలో చివరికి నిందితుడిని కమాండోలు మట్టుబెట్టారు. అటు సుభాష్ భార్య స్థానికుల దాడిలో గాయాలపాలవడంతో పోలీసులు ఆమెను ఆసుపత్రిలో చేర్చగా.. చికిత్స పొందుతూ తుదిశ్వాసను విడిచింది. ‘నిందితుడు కాల్పుల్లో చనిపోయాడని.. అతని చెరలో ఉన్న 23 మంది పిల్లలను సురక్షితంగా కాపాడామని’ డీజీపీ ఓపి సింగ్ అనంతరం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వెల్లడించారు.