AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Vaccine registration in PHC: కోవిడ్ వ్యాక్సిన్ పొందేందుకు కేంద్రం కొత్త గైడ్‌లైన్స్.. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లోనూ పేర్లు నమోదుకు అవకాశం

కోవిడ్‌ టీకా పొందడానికి అర్హులైన లబ్ధిదారులు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లోనూ తమ పేర్లు నమోదు చేసుకోవచ్చని కేంద్రం వెల్లడించింది.

Vaccine registration in PHC: కోవిడ్ వ్యాక్సిన్ పొందేందుకు కేంద్రం కొత్త గైడ్‌లైన్స్..  ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లోనూ పేర్లు నమోదుకు అవకాశం
Balaraju Goud
|

Updated on: Jan 08, 2021 | 6:16 PM

Share

కోవిడ్ వ్యాక్సిన్ పొందేందుకు కేంద్ర ప్రభుత్వం కొత్త మార్గదర్శకాలను విడుదల చేసింది. తొలి దశలో కోవిడ్‌ టీకా పొందడానికి అర్హులైన లబ్ధిదారులు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లోనూ తమ పేర్లు నమోదు చేసుకోవచ్చని కేంద్రం వెల్లడించింది. మీ-సేవ, ఈ-సేవ తదితర సామాజిక సేవా కేంద్రాల ద్వారా కూడా తమ వివరాలను నమోదు చేసేందుకు కేంద్ర వైద్యారోగ్య శాఖ అవకాశం కల్పించింది. కరోనా వికృతరూపానికి తల్లడిల్లుతున్న బాధితులకు వ్యాక్సిన్ అందించడంలో భాగంగా అత్యవసర వినియోగానికి కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది. ఈ నేపథ్యంలో వచ్చేవారం తొలి విడత వ్యాక్సినేషన్‌ అధికారులు సిద్ధమవుతున్నారు. ఇప్పటికే డ్రైరన్ నిర్వహించిన మెడికల్ సిబ్బంది.. ఇందుకు అనుగుణంగా ఏర్పాట్లు చేస్తున్నారు.

ఇందులో భాగంగా 50 ఏళ్లు దాటినవారు, 18-50 ఏళ్ల లోపు దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్నవారు తమ సమాచారాన్ని నమోదు చేసుకోవడానికి వీలుగా కేంద్ర ఆరోగ్య శాఖ ఈ రెండు కొత్త విధానాలను అందుబాటులోకి తీసుకొచ్చింది. మండల స్థాయిలో వైద్యాధికారి పర్యవేక్షణలో ఆరోగ్య సిబ్బందే నమోదు ప్రక్రియను నిర్వహిస్తున్నారు. మరోవైపు, ప్రభుత్వ, ప్రైవేటు వైద్య సిబ్బంది, పోలీసు, రెవెన్యూ, పురపాలక శాఖల ఉద్యోగుల జాబితాను కొవిన్‌ వెబ్‌ యాప్‌ ద్వారా పొందుపరుస్తున్నారు. అలాగే, ఈ రెండు వర్గాల సమాచారాన్నీ ఆన్‌లైన్‌లో నమోదుచేయడానికి కేంద్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. తెలంగాణలో 50 ఏళ్లు పైబడినవారు సుమారు 64 లక్షల మంది ఉండగా, 18-50 ఏళ్ల లోపు దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులు సుమారు 6 లక్షల మంది వరకూ ఉంటారని ఆరోగ్యశాఖ అంచనా వేసింది.

తొలి విడత టీకా తీసుకునే లబ్ధిదారుల్లో 50 ఏళ్లు పైబడినవారు, దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులు అధిక సంఖ్యలో ఉన్న క్రమంలో ఈ రెండు కేటగిరీల లబ్ధిదారులను గుర్తించడానికి ఓటరు కార్డు విధానాన్ని అనుసరించాలని కేంద్ర ప్రభుత్వం తొలుత సూచించింది. ఇంత భారీ సంఖ్యలో లబ్ధిదారులను కేవలం ఓటరు కార్డు జాబితా ప్రాతిపదికన గుర్తించడం సవాలుతో కూడుకున్నదని భావించిన రాష్ట్ర ప్రభుత్వం ఈ అంశాన్ని కేంద్రం దృష్టికి తీసుకెళ్లింది. కొవిన్‌ యాప్‌ ద్వారా నేరుగా నమోదు చేసుకునే విధానాన్నీ అనుసరించాలనే సూచనలను పంపింది.

మరోవైపు, యాప్‌ ద్వారా నేరుగా సమాచారాన్ని నమోదుచేసేంత అవగాహన ఎక్కువమందిలో ఉండదని వైద్య వర్గాలు కేంద్ర సర్కారు దృష్టికి తీసుకెళ్లాయి. ఈ అంశాలను పరిగణనలోకి తీసుకున్న కేంద్ర సర్కార్ తాజాగా సరికొత్త మార్గదర్శకాలను ప్రకటించింది. నాలుగు విధానాలు అందుబాటులోకి వచ్చినప్పుడు అర్హులైన వారి సమాచారాన్ని కొవిన్‌ యాప్‌లో పొందుపర్చడం సులభతరమవుతుందంటున్నారు వైద్యనిపుణులు.

కేంద్ర కొత్తగా విడుదల చేసిన మార్గదర్శకాలుః

  • ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, మీ-సేవ, ఈ-సేవ కేంద్రాల్లో అక్కడి సిబ్బందే కొవిన్‌ వెబ్‌ యాప్‌లో సమాచారాన్ని పొందుపర్చుతారు.
  • పుట్టిన తేదీ ధ్రువపత్రం, ఓటరు కార్డు, పాస్‌పోర్టు లేదా పుట్టిన తేదీని ధ్రువీకరించే మరే ఇతర అధికారిక ధ్రువపత్రాన్ని తీసుకెళ్లాలి.
  • 18-50 ఏళ్లలోపు దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులు తమ అనారోగ్యాన్ని ధ్రువపరుస్తూ వైద్యులు ఇచ్చిన చీటీని తీసుకెళ్లినా నమోదు చేస్తారు.
  • ఇబ్బందులు, సందేహాల నివృత్తికి ప్రత్యేకించి 1075 టోల్‌ఫ్రీ నంబరు ఏర్పాటు.
  • 24 గంటలపాటు అందుబాటులో టోల్‌ఫ్రీ నెంబర్
  • 2-3 రోజుల్లో తెలంగాణకు 6.5 లక్షల టీకాలు

ఇదీ చదవండి…Covid Strain Cases In India: దేశంలో 82 కరోనా స్ట్రెయిన్ కేసులు.. అప్రమత్తమైన కేంద్ర వైద్యారోగ్య శాఖ