AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

సీఏఏపై సుప్రీంకోర్టుకెక్కిన ఐరాస హెచ్చార్సీ .. భారత్ ఖండన

వివాదాస్పద సీఏఏపై ఐక్యరాజ్యసమితి మానవ హక్కుల సంఘం హైకమిషనర్ మిషెల్ బెచిలెట్ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ చట్టం విషయంలో జోక్యం చేసుకోవాలని ఆమె కోరారు.

సీఏఏపై సుప్రీంకోర్టుకెక్కిన ఐరాస హెచ్చార్సీ .. భారత్ ఖండన
Umakanth Rao
| Edited By: |

Updated on: Mar 03, 2020 | 4:24 PM

Share

వివాదాస్పద సీఏఏపై ఐక్యరాజ్యసమితి మానవ హక్కుల సంఘం హైకమిషనర్ మిషెల్ బెచిలెట్ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ చట్టం విషయంలో జోక్యం చేసుకోవాలని ఆమె కోరారు. ఇది కనీవినీ ఎరుగని చర్య.. ఐరాస మానవహక్కుల సంఘం కూడా ఈ చట్టంపై పిటిషన్ వేసిందంటే.. దీనికి వ్యతిరేకంగా దాఖలైన వందకు పైగా పిటిషన్లలో ఇది కూడా ఒక భాగమైనట్టే అని భావిస్తున్నారు. సీఏఏ కొన్ని మతాల వారికి ముప్పుగా పరిణమించేదిగా ఉందని, ఇది పూర్తిగా మత ప్రతిపాదికపైనే రూపొందించిన చట్టమని పేర్కొన్న ఆమె.. అంతర్జాతీయ మానవ హక్కుల చట్టం కింద ఇది నిషిధ్ధమని అభిప్రాయపడ్డారు. అయితే దీనిని ఇండియా తీవ్రంగా ఖండించింది.  ఈ చట్టం అమలు పూర్తిగా తమ అంతర్గత వ్యవహారమని, చట్టాలు చేసే అధికారం మా పార్లమెంటుకు ఉందని విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి రవీష్ కుమార్ అన్నారు. జెనీవాలోని  ఐరాస మానవహక్కుల సంఘం హైకమిషనర్ భారత సుప్రీంకోర్టులో దీనిపై ఇంటర్వెన్షన్ అప్లికేషన్ దాఖలు చేసినట్టు ఆ సమితిలోని  భారత శాశ్వత ప్రతినిధి తమకు తెలియజేశారని ఆయన అన్నారు. కానీ భారత సార్వభౌమాధికారంలో జోక్యం చేసుకునే హక్కు మూడో పార్టీకి లేదని తాము గట్టిగా భావిస్తున్నామని రవీష్ కుమార్ చెప్పారు.

ఇండియా ప్రజాస్వామ్య దేశమని, విభజన కారణంగా ఏర్పడిన ‘ట్రాజెడీ’ని ఎదుర్కొనేందుకు ఈ విధమైన చట్టాల ఆవశ్యకత ఎంతైనా ఉందని ఆయన పేర్కొన్నారు. సుప్రీంకోర్టు మా వైఖరినే సమర్థిస్తుందని ఆశిస్తున్నామని ఆయన అన్నారు. సీఏఏ పై ఇప్పటికే సుప్రీంకోర్టులో 144 పిటిషన్లు దాఖలయ్యాయి. కాగా ఈ చట్టంపై కోర్టు స్టేని ఇవ్వలేదు.