బ్రిటన్‌లో మొదలైన ఆస్ట్రాజెన్‌కా-ఆక్స్‌ఫర్డ్ వ్యాక్సినేషన్.. మొదటి టీకా తీసుకున్నది ఎవరంటే..?
ఆక్స్‌ఫర్డ్ రూపొందించిన కోవిడ్ వ్యాక్సన్‌ను 82 ఏళ్ల డయాలసిస్ పేషెంట్ బ్రియాన్ పింకర్‌కు వైద్య సిబ్బంది తొలి టీకా వేశారు.

Oxford-AstraZeneca COVID-19 Vaccine: కరోనా మహమ్మారిని అంతం చేసేందుు రూపొందించిన వ్యాక్సిన్ అత్యవసర వినియోగానికి ప్రపంచ దేశాలు సిద్ధమవుతున్నాయి. కోవిడ్‌కు తోడు కొత్త రకం వైరస్ స్ట్రెయిన్ ప్రబలుతున్న బ్రిటన్‌లో అత్యవసర వినియోగానికి ఆ దేశ ప్రభుత్వం అనుమతనిచ్చింది. ఈ నేపథ్యంలో 82 ఏళ్ల డయాలసిస్ పేషెంట్ బ్రియాన్ పింకర్.. ఆక్స్‌ఫర్డ్ వ్యాక్సిన్ తీసుకున్న తొలి వ్యక్తిగా నిలిచారు. ఆక్స్‌ఫర్డ్ యూనివర్సిటీ ఆస్పత్రిలో ఆయనకు వైద్య సిబ్బంది టీకా వేశారు. ఆస్ట్రాజెన్‌కా-ఆక్స్‌ఫర్డ్ తయారు చేసిన టీకాను తీసుకోవడంతో పట్ల బ్రియాన్ సంతోషం వ్యక్తం చేశారు. ఆక్స్‌ఫర్డ్‌లోనే పుట్టి, పెరిగినట్లు ఆ 82 ఏళ్ల వృద్ధుడు చెప్పుకొచ్చాడు. కోవిడ్ వ్యాధి కోసం టీకాను ఆక్స్‌ఫర్డ్‌లో రూపొందండం గర్వంగా ఉందని ఆయన అన్నారు. నర్సులు, డాక్టర్లు, స్టాప్ అంతా ఉత్సాహాంగా ఉన్నారని, ఇక తాను తన భార్య షిర్లేతో కలిసి త్వరలోనే 48వ పెళ్లిరోజు జరుపుకోనున్నట్లు బ్రియాన్ తెలిపారు.
ఆక్స్‌ఫర్డ్ హాస్పిటల్‌లో చీఫ్ నర్సింగ్ ఆఫీసర్‌గా చేస్తున్న సామ్ ఫోస్టర్ ఆ వృద్ధుడికి టీకా వేశారు. టీకాను అభివృద్ధి చేసిన ప్రాంతానికి కొన్ని వందల మీటర్ల దూరంలోనే ఆక్స్‌ఫర్డ్ వ్యాక్సిన్ ఇవ్వడం ప్రత్యేకంగా భావిస్తున్నట్లు సామ్ ఫోస్టర్ తెలిపారు. కాగా, కరోనా విజృంభిస్తున్న తరుణంలో ఆస్ట్రజెన్‌కాతో వ్యాక్సిన్ ప్రయోగం చేపట్టిన ఆక్స్‌ఫర్డ్ యూనివర్సిటీ ఇటీవల వ్యాక్సిన్‌ను అందుబాటులోకి తీసుకువచ్చింది. ఈ టీకాకు గత డిసెంబర్ 30న బ్రిటన్ ప్రభుత్వం అనుమతులు ఇచ్చింది. దీంతో ఇవాళ్టి నుంచి బ్రిటన్ దేశంలో వ్యాక్సినేషన్ ప్రక్రియ మొదలైంది.