బీజేపీ వ్యవహారశైలిపై మండిపడిన ఉద్ధవ్ థాక్రే
విజయదశమి పండుగను పరస్కరించుకుని మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాక్రే ప్రజలను ఉద్దేశించి మాట్లాడారు.. తొలిసారి ముఖ్యమంత్రి హోదాలో మాట్లాడిన ఆయన పలు అంశాలను స్పృషించారు..

విజయదశమి పండుగను పరస్కరించుకుని మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాక్రే ప్రజలను ఉద్దేశించి మాట్లాడారు.. తొలిసారి ముఖ్యమంత్రి హోదాలో మాట్లాడిన ఆయన పలు అంశాలను స్పృషించారు.. పలువురిపై విమర్శలు గుప్పించారు. నర్మగర్భ వ్యాఖ్యలు చేశారు.. స్వతంత్ర వీరసావర్కర్ ఆడిటోరియంలో జరిగిన విజయదశమి మేళా కార్యక్రమంలో మాట్లాడిన ఉద్ధవ్ థాక్రే మహారాష్ట్ర గవర్నర్ వ్యవహారశైలి దగ్గర నుంచి మొదలు పెడితే భారతీయ జనతాపార్టీ తీరు తెన్నులను, సుశాంత్‌సింగ్ రాజ్‌పుత్ ఆత్మహత్య విషయాన్ని, ముంబాయిని కంగనా రనౌత్ పీవోకేగా అభివర్ణించిన సంగతినీ ప్రస్తావించారు.. దసరా రోజున పది తలల రావణాసుడిని ప్రతిరూపంగా కొన్ని ముఖాలను కాల్చివేస్తున్నామని, అందులో ముంబాయిని పీవోకే అన్న ముఖం కూడా ఉందని పరోక్షంగా కంగనాను ఉద్దేశించి థాక్రే వ్యాఖ్యానించారు. సుశాంత్ ఆత్మహత్య చేసుకున్న ఘటనలో తన కుమారుడిని లాగే ప్రయత్నం చేశారని, ఉత్తపుణ్యానికే తమ మీద నిందలు వేశారని అన్నారు.. న్యాయం తమవైపు ఉన్నప్పుడు ఎవరికీ భయపడాల్సిన అవసరం లేదని చెప్పారు. కొందరేమో తనకు హిందుత్వ గురించి పాఠాలు చెప్పాలనుకుంటున్నారని, వారు తమను తాము తెలుసుకుంటే మంచిదని గవర్నర్, బీజేపీ నేతలను ఉద్దేశించి అన్నారు. నల్లటోపీ పెట్టుకున్న ఆ వ్యక్తి ఆర్‌ఎస్‌ఎస్ చీఫ్ మోహన్ భగవత్ దసరా ప్రసంగాన్ని వింటే మంచిదంటూ ఇన్‌డైరెక్ట్‌గా భగత్‌సింగ్ కొశ్యారీకి చెప్పారు.. హిందుత్వ అంటే గుళ్లోకెళ్లి పూజలు చేయడం మాత్రమే కాదని ఉద్ధవ్ థాక్రే అన్నారు. గోవాలో బీఫ్‌పై నిషేధం లేదని, మహారాష్ట్రంలో ఉందని, ఇలాంటివాళ్లా తనకు హిందుత్వ గురించి చెప్పేది అని ఎద్దేవా చేశారు. ఇక బీహార్ ముఖ్యమంత్రి నితీశ్‌కుమార్‌కు కూడా కొన్ని సూచనలు చేశారు థాక్రే.. హర్యానా ఎన్నికలప్పుడు కుల్దీప్ సింగ్ బిష్ణోయ్‌ను ముఖ్యమంత్రిని చేస్తామని బీజేపీ వాళ్లు చెప్పిన విషయాన్ని ఓసారి గుర్తు చేసుకుంటే మంచిదని అన్నారు. మహారాష్ట్ర ఎన్నికలప్పుడు కూడా ఇలాగే అన్నారని, ఇప్పుడు నితీశ్‌ను కాబోయే సీఎం అంటున్నారని థాక్రే చెప్పారు.. సంఘ్ విముక్త భారత్‌ను కోరుకున్న నితీశ్‌కుమార్‌కు శుభం జరగాలని కోరుకుంటున్నానన్నారు. బీహార్ ఎన్నికల్లో గెలిస్తే కరోనా వ్యాక్సిన్‌ను ఉచితంగా ఇస్తామని బీజేపీ వాళ్లు అంటున్నారు.. మరి మహారాష్ట్ర ప్రజలు ఈ దేశవాసులు కాదా? అని ప్రశ్నించారు. బీజేపీవాళ్లు దేశాన్ని విభజిస్తున్నారని, మహారాష్ట్రంలో వారి ఆటలు సాగవని అన్నారు.