ఏడుకొండలలోని అంజనాద్రే ఆంజనేయుడి జన్మస్థలమా..? పండితులతో కమిటీని ఏర్పాటు చేసిన టీటీడీ..
తిరుమల గిరుల్లోనే అంజనీపుత్రుడు హనుమంతుడు జన్మించాడని కొద్దిరోజులుగా సోషల్ మీడియాలో వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో..
Hanuman Birth Place: తిరుమల గిరుల్లోనే అంజనీపుత్రుడు హనుమంతుడు జన్మించాడని కొద్దిరోజులుగా సోషల్ మీడియాలో వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆంజనేయుడు అసలు ఎక్కడ జన్మించాడో తెలుసుకునేందుకు పురాణాలు, ఇతర గ్రంధాలను పరిశోధించాలని గతంలోనే టీటీడీ అధికారులను ఆదేశించింది. ఇక తాజాగా టీటీడీ ఈవో జవహర్ రెడ్డి ఈ అంశంపై పండితులతో సమావేశాన్ని నిర్వహించారు. ఆంజనేయుడి జన్మస్థలం తిరుమల గిరులను పురాణాలు చెబుతున్నాయని సమావేశంలో పాల్గొన్న పండితులు ఈవో దృష్టికి తీసుకు వచ్చారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కొన్ని దేవాలయాల స్థల పురాణాల ఆధారంగా వేర్వేరు ప్రాంతాలను హనుమంతుని జన్మ స్థలంగా ప్రచారం చేస్తున్నారని అన్నారు. ఈ నేపథ్యంలో పౌరాణిక, చారిత్రక, ఆచార వ్యవహార దృష్ఠితో హనుమంతుడు తిరుమలలో జన్మించాడని పరిశోధించి నిరూపించడానికి పండితులతో ఓ కమిటీని ఏర్పాటు చేశారు. ఆధునిక కాలంలో శ్రీవారి భక్తులందరికి ఆంజనాద్రిపై మరింత భక్తి విశ్వాసాలు ఏర్పడాలని ఈవో సూచించారు. అంజనీసుతుడి జన్మస్థలం తిరుమల అని నిరూపించడానికి తగిన సమాచారం సిద్ధం చేయాలని ఆయన పండితులను కోరారు.
స్కంధ పురాణం, వరాహ పురాణం, పద్మ పురాణం, బ్రహ్మాండ పురాణం, భవిష్యోత్తర పురాణం, వెంకటాచల మహాత్యం మొదలైన పురాణాల్లో ఉన్న శ్లోకాలను పండితులు సమావేశంలో ప్రస్తావించారు. త్వరగా ఈ అంశాన్ని ఆధారాలతో సహా పరిష్కరించే ప్రయత్నం చేయాలని ఈవో సూచించారు.