నేనేం పువ్వు పార్టీ నేతని కాదు….టీఆర్ఎస్ పార్టీ నేతని: విపక్ష నాయకులకు పువ్వాడ స్ట్రాంగ్ కౌంటర్
"ఓవైపు ఓటింగ్ జరుగుతుండగా డబ్బులు కార్లో పెట్టుకొని పోలింగ్ బూత్‌కి రావడానికి నేనేం పువ్వ పార్టీ నేతని కాదు....టీఆర్ఎస్ పార్టీ నేతని" అన్నారు..
“ఓవైపు ఓటింగ్ జరుగుతుండగా డబ్బులు కార్లో పెట్టుకొని పోలింగ్ బూత్‌కి రావడానికి నేనేం పువ్వు పార్టీ నేతని కాదు….టీఆర్ఎస్ పార్టీ నేతని” అన్నారు తెలంగాణ మంత్రి పువ్వాడ అజయ్. బీజేపీ నాయకులు కుట్రతోనే తనపై దాడికి పాల్పడ్డారని చెప్పారు. ఇక ఇదే ఘటనపై సీపీఐ నేత నారాయణ చేసిన వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చారాయన. బర్తరఫ్ చేయడానికి తానేం మగ్దుమ్ భవన్‌లో బంట్రోతుని కాదన్నారు. నిరాధారమైన ఆరోపణలతో బీజేపీకి కొమ్ము కాస్తున్న సిపీఐ నేత చికెన్ నారాయణ తనను విమర్శించే ముందు వాస్తవాలు తెలుసుకోవాలని హెచ్చరించారు. ఓటర్లను ప్రలోభపెట్టేందుకు మంత్రి పోలింగ్ బూత్‌కు వచ్చారని… బీజేపీ కార్యకర్తలు అడ్డుకునే ప్రయత్నం చేయడంతో పారిపోతుండగా మంత్రి కారు బ్యానట్‌పై నుండి ఓ వ్యక్తి కిందపడినట్లుగా విపక్షపార్టీలు ఆరోపణలు గుప్పించిన నేపథ్యంలో మంత్రి పువ్వాడ ఇలా స్పష్టతనిచ్చే ప్రయత్నం చేశారు. జీహెచ్ఎంసీ ఎన్నికల పోలింగ్ సమయంలో కూకట్‌పల్లి నియోజకవర్గం ఫోరం మాల్ దగ్గర తనపై హత్యాయత్నం జరిగిందన్నారు మంత్రి. బీజేపీ నేతలు తనపై కావాలనే దాడి చేసేందుకు రావడంతో సెక్యురిటీ, అక్కడున్న టీఆర్‌ఎస్ శ్రేణులు తనను కాపాడినట్లు చెప్పారు. అందువల్లే కారును ఆపకుండా వెళ్లిపోయినట్లుగా వివరణ ఇచ్చారు. ఖమ్మంలో నిర్మిస్తున్న ఐటి హబ్‌ని పరిశీలించేందుకు వచ్చిన మంత్రి అజయ్ ఈ వ్యాఖ్యలు చేశారు.