Lock-down ఏపీ అలా.. తెలంగాణ ఇలా… ఎవరి వాదన వారిదే!

Lock-down ఏపీ అలా.. తెలంగాణ ఇలా... ఎవరి వాదన వారిదే!

ఇటీవల కాలంలో ఏపీ, తెలంగాణ ప్రభుత్వాలు పలు అంశాలపై ఒకే విధానంతో ముందుకు వెళుతున్నాయి. ప్రభుత్వాధినేతల మధ్య వున్న సఖ్యత కావచ్చు. మరే ఇతర కారణమైనా కావచ్చు పలు కీలకాంశాలపై ఘర్షణ ధోరణి వీడి.. పరస్పరం సహకారంతో ముందుకు సాగుతున్నాయి. కానీ.. తాజాగా ఓ అంశంపై రెండు తెలుగు రాష్ట్రాలు భిన్నమైన విధానాన్ని ఎంచుకున్నాయి.

Rajesh Sharma

|

Apr 08, 2020 | 6:57 PM

AP, Telangana governments took different stands on crucial issue: ఇటీవల కాలంలో ఏపీ, తెలంగాణ ప్రభుత్వాలు పలు అంశాలపై ఒకే విధానంతో ముందుకు వెళుతున్నాయి. ప్రభుత్వాధినేతల మధ్య వున్న సఖ్యత కావచ్చు. మరే ఇతర కారణమైనా కావచ్చు పలు కీలకాంశాలపై ఘర్షణ ధోరణి వీడి.. పరస్పరం సహకారంతో ముందుకు సాగుతున్నాయి. ఇటీవల కాలంలో కరోనా వ్యాప్తి విషయంలోను రెండు ప్రభుత్వాలు పరస్పరం సహకరించుకున్నాయి. ముఖ్యంగా రెండు రాష్ట్రాల్లో వున్న విద్యార్థులు, ప్రైవేటు ఉద్యోగులు, వలస కార్మికులకు చేయూతనందించే విషయంలో తెలుగు ప్రభుత్వాలు దాదాపుగా కలిసి పని చేశాయి. కానీ.. తాజాగా ఓ అంశంపై రెండు తెలుగు రాష్ట్రాలు భిన్నమైన విధానాన్ని ఎంచుకున్నాయి.

దేశవ్యాప్తంగా లాక్ డౌన్ కొనసాగుతున్న తరుణంలో ఎంతకాలం ఈ లాక్ డౌన్ అన్న చర్చలు మొదలయ్యాయి. ఆగమేఘాల మీద లాక్ డౌన్ ని అమల్లోకి తెచ్చిన కేంద్రం ప్రభుత్వం సైతం లాక్ డౌన్ పీరియడ్ నుంచి బయటికి వచ్చే మార్గాన్ని వెతుక్కుంటోంది. ఇందుకోసం విపక్షాలతోపాటు రాష్ట్ర ప్రభుత్వాల అభిప్రాయాలను కోరుతోంది. ఇందులో భాగంగానే ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ మంగళవారం మాజీ ప్రధానులు, మాజీ రాష్ట్రపతులు, సీనియర్ నేతలైన సోనియాగాంధీ వంటి వారితో వీడియోకాన్ఫరెన్సులో మాట్లాడారు. బుధవారం దేశంలో పార్లమెంటుకు ప్రాతినిధ్యం వహిస్తున్న అన్ని రాజకీయ పార్టీల పార్లమెంటరీ పార్టీల నేతలతో ప్రధాని వీడియో కాన్ఫరెన్సు నిర్వహించారు.

ఈ వీడియో కాన్ఫరెన్సుకు టీఆర్ఎస్ పార్టీ తరపున ఆ పార్టీ పార్లమెంటరీ పార్టీ నేత కే.కేశవరావు, లోక్‌సభలో టీఆర్ఎస్ పక్షం నేత నామా నాగేశ్వర రావు హాజరు కాగా.. వైసీపీ తరపున పార్లమెంటరీ పార్టీ నేత విజయసాయి రెడ్డి, లోక్ సభ‌లో వైసీపీ పక్షం నేత మిథున్ రెడ్డి హాజరయ్యారు. అయితే.. ఈ భేటీలో టీఆర్ఎస్ లాక్ డౌన్ ‌ను కనీసం మరో రెండు వారాలు కొనసాగించాలని ప్రధానికి సూచించింది. వైసీపీ మాత్రం అందుకు భిన్నంగా కరోనా ప్రభావం లేని చోట్ల ప్రజలను ఇబ్బందులకు గురి చేయడం సరికాదంటూ.. కరోనా హాట్ స్పాట్లలో లాక్ డౌన్ కొనసాగిస్తూ.. కరోనా ప్రభావం లేని చోట్ల నార్మల్ జనజీవనాన్ని కల్పించాలని సూచించింది.

సో.. లాక్ డౌన్ కొనసాగింపును తెలంగాణలో అధికార పార్టీ టీఆర్ఎస్ కోరుతుండగా.. ఏపీలో అధికార పార్టీ వైసీపీ మాత్రం లాక్ డౌన్‌ని పాక్షికంగా ఎత్తివేయాలని, హాట్ స్పాట్లలో పకడ్బందీ చర్యలు తీసుకోవాలని సూచించింది. తెలంగాణలో హైదరాబాద్ నగరంతోపాటు నిజామాబాద్, కరీంనగర్, వరంగల్ జిల్లా కేంద్రాల్లో కరోనా ప్రభావం కనిపిస్తోంది. మిగిలిన జిల్లాల్లో కొద్దిపాటిగా వున్నా పూర్తి నియంత్రణలోనే పరిస్థితి వుంది. మరోవైపు రబీ పంట దిగుబడులు వస్తున్న తరుణంలో రూరల్ ఏరియాలో రైతాంగం పరిస్థితి అగమ్య గోచరంగా వుంది. ఈ క్రమంలో రూరల్ ఏరియాలో లాక్ డౌన్ ఎత్తివేసి.. అర్బన్ ప్రాంతాల్లో మరీ ముఖ్యంగా కరోనా ప్రభావం వున్న ఏరియాల్లో లాక్ డౌన్ మరింత పకడ్బందీగా అమలు చేయాలని పలువురు సూచిస్తున్నారు.

విదేశీ ప్రయాణాలు లేనపుడు, రవాణా సౌకర్యాలు నియమిత సంఖ్యలో కొనసాగుతున్నప్పుడు.. కొంత కాలం ఆంక్షలతో కూడిన మార్కెట్ సౌకర్యాలను కల్పించడం ద్వారా బిజినెస్ మెరుగుపరచడంతోపాటు.. సామాన్యులకు ఉపాధి సౌకర్యాలను మెల్లిగా రీస్టోర్ చేయవచ్చని సామాజిక వేత్తలు సలహాలిస్తున్నారు. ఈ క్రమంలో ప్రధాన మంత్రి ఏప్రిల్ 11వ తేదీన మరోసారి ముఖ్యమంత్రులతో నిర్వహించనున్న వీడియోకాన్ఫరెన్సు తర్వాత లాక్ డౌన్ విషయంలో మరికొంత క్లారిటీ వచ్చే సంకేతాలు కనిపిస్తున్నాయి.

Follow us on

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu