AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

తెలుగు రాజులు రెనాటి చోళుల మూలాలు రాయలసీమలోనే..

ఆవిష్కరణలో పురావస్తు సర్వే ఆఫ్ ఇండియా నిపుణులు మరో మైలురాయిని సాధించారు. దక్షిణ భారతాన్ని శాసించిన రెనాటి చోళుల ఖచ్చితమైన స్థానాన్ని కనుగొన్నట్లు తెలిపారు. తెలుగు రాజులు రెనాటి చోళులు కర్ణాటక నుండి కాకుండా కడప నుండి పరిపాలించారని ఎఎస్ఐ నిపుణులు స్పష్టం చేశారు.

తెలుగు రాజులు రెనాటి చోళుల మూలాలు రాయలసీమలోనే..
Balaraju Goud
|

Updated on: Jul 21, 2020 | 6:02 PM

Share

ఆవిష్కరణలో పురావస్తు సర్వే ఆఫ్ ఇండియా నిపుణులు మరో మైలురాయిని సాధించారు. దక్షిణ భారతాన్ని శాసించిన రెనాటి చోళుల ఖచ్చితమైన స్థానాన్ని కనుగొన్నట్లు తెలిపారు. తెలుగు రాజులు రెనాటి చోళులు కర్ణాటక నుండి కాకుండా కడప నుండి పరిపాలించారని ఎఎస్ఐ నిపుణులు స్పష్టం చేశారు.

రాయలసీమలో రెనాడు ప్రాంతాన్ని పరిపాలించిన రెనాటి చోళులు సంస్కృతానికి బదులుగా పరిపాలన శాసనాల్లో తెలుగును మొట్టమొదటిసారిగా ఉపయోగించారు. పుణ్యకుమారుని తిప్పలూరు శాసనము ప్రకారము వీరి రాజధాని కమలాపురము తాలూకాలోని పెదచెప్పలిగా ఏఎస్ఐ నిపుణులు నిర్ధారించారు. ఇక్కడ లభించిన ప్రాచీనకాలపు కోట చిహ్నాలు, తామ్రశాసనాలు, శిలాశాసనాలు దొరికాయనిపేర్కొన్నారు.

మైసూర్‌లోని పురావస్తు సర్వే ఎపిగ్రఫీ శాఖ ఇటీవల ఏడవ శతాబ్దానికి చెందిన రెనాటి చోళాలకు సంబంధించిన రెండు శాసనాలను కనుగొన్నారు. మొదటి శాసనం కడపలోని కమలాపురం ప్రాంతంలో వారి రాజధాని పాలన గురించి వివరించగా, మరొకటి రెనాటి చోళాల బనాస్ యుద్ధం గురించి తెలియజేస్తూ ఉన్నట్లు పురావస్తు శాఖ తెలిపింది. ఆంధ్రప్రదేశ్‌లోని కడప జిల్లాలోని లంకమల్ల అడవి ప్రాంతంలో రాతిపై ఉన్న శాసనాలను కనుగొనట్లు వివరించారు. జంతువుల సంరక్షణ కోసం రెనాటి చోళులు అధిక ప్రాధాన్యత ఇచ్చారని, ప్రత్యేక వన్యప్రాణుల రక్షణ సేవను ఏర్పాటు చేశారని కూడా స్పష్టం చేశారు.

పురావస్తు శాఖ డైరెక్టర్ కె. మునిరత్నంరెడ్డి, అతని బృందం కడప జిల్లాలోని సిద్ధవతం మండలం లోని పెంక ఒడ్డున లంకమల్ల అడవిలోని నిత్యపుజకోనలోని శివాలయం సమీపంలో శిలల మీద చెక్కిన శాసనాలను గుర్తించారు. ఈ స్క్రిప్ట్ క్రీ.శ ఏడవ శతాబ్దం నాటిదని దీన్ని పూర్తిగా తెలుగులో వ్రాయబడిందని తేల్చారు. ఎరికల్ కమాండర్ నరసింగ చేత చిరియటపాల కొండపై ఇష్టకమలేశ్వర దేవునికి ఆలయం నిర్మించినట్లు ఆధారాలున్నాయని నిపుణులు తెలిపారు.

కడప జిల్లాలోని కలమల్ల గ్రామంలో కనుగొనబడిన రెనాటి చోళ రాజవంశానికి చెందిన ఎరికల్ ముత్తురాజా ధనంజయకు సంబంధించి ఇది ఇప్పటివరకు కనుగొన్న తొలి తెలుగు శాసనం క్రీ.శ. ఆరవ శతాబ్దం నాటిదని మునిరత్నం రెడ్డి తెలిపారు. అంతవరకు కొందరు నిపుణులు పొరుగున ఉన్న కర్ణాటకలోని తుమ్కూర్ జిల్లాలో నిదుగల్‌తో రెనాటి చోళులకు సంబంధాలు ఉన్నట్లు తెలిపారు. అయితే, తాజా అధ్యయనంలో కడపలోనే వారి మూలాలు బయటపడుతున్నాయి.

ఇదిలావుంటే, రేనాటి అని వ్యవహరింపబడిన కడపజిల్లా, చిత్తూరు జిల్లా, అనంతపురం జిల్లాలోని కొన్ని ప్రాంతాలను రేనాటి చోళులు పరిపాలించినట్లు చరిత్రకారులు అభిప్రాయపడుతున్నారు. ముఖ్యంగా దేశంలో తెలుగు భాష శాసనభాషగా పరిణతి చెందింది ఇదే సమయంలోనని స్పష్టమవుతోంది. ఈ ప్రాంతాన్ని మహారాజవాడి లేక మార్జవాడి అని కూడా అంటారు. క్రీ. శ. 6వ శతాబ్దము నుండి 9వ శతాబ్దము వరకు చోళవంశమునకు చెందిన రాజులు ఈ ప్రాంతాన్ని రాజధానిగా చేసుకుని పరిపాలించినట్లు ఆధారాలు స్పష్టమవుతున్నాయని పురావస్తు సర్వే ఆఫ్ ఇండియా నిపుణులు తెలిపారు. మొదట 7,000 గ్రామాల పరిమితి గల దేశము 16వ శతాబ్దినాటికి ఉదయగిరి పెనుగొండ దుర్గాల మధ్య విస్తరించింది.

ఈ వంశీయులు తెలుగుభాషలోనే శాసనాలు వేయించినట్లు అనవాళ్లు లభ్యమవుతున్నాయి. మొట్ట మొదట తెలుగుభాషలో శాసనములు వేయించిన కీర్తి రేనాటిచోళులకే దక్కింది. వీరి శాసనములలో ఆంధ్రభాష స్థానమాక్రమించి, ప్రాకృత ప్రభావితమై, తెలుగు భాష ప్రాథమిక దశను సూచిస్తుంది. ప్రాకృత పదములతో కలిసి ఉన్న తెలుగు పదాలు, వింతవింత రూపాలతో కనిపించి, ఆంధ్రభాషావికాసాన్ని సూచిస్తుంది. వీరి శాసనములలో ధనంజయుని కలమళ్ళ శాసనము మొదటి తెలుగు శాసనము క్రీ.శ.575 లో వేయింపబడిందని చరిత్రకారులు చెబుతుంటారు.

లంకమల్ల అటవీ ప్రాంతంలో 10 కిలోమీటర్ల పరిధిలో 13 దేవాలయాల అవశేషాలను అర్కియాలజీ బృందం కనుగొన్నది. దీన్ని బట్టి ఈ ప్రాంతం చారిత్రక ప్రాముఖ్యతను సూచిస్తుంది. ఈ దేవాలయాల వద్ద భక్తులు పూజలు చేశారని, వారికి దేవాలయాల వద్దకు వెళ్ళడానికి ఒక మార్గం ఏర్పాటు చేసినట్లు అనవాళ్లను గుర్తించారు. అప్పటి కార్యనిర్వహక కార్యదర్శి డబ్ల్యుఎస్ మేయర్ జారీ చేసిన 1893 జనవరి 14 నాటి భూమి ఆదాయ రికార్డులో ఈ దేవాలయాల జాబితాను కూడా చేర్చారు. ఎరికల్ ముత్తురాజు సంబంధించిన మరొక శాసనం ప్రకారం.. నిత్యపుజకోన నుండి 10 కిలోమీటర్ల దూరంలో ఉన్న కమలాపురం మండల ఎర్రగుడిపాడుకు వచ్చేవారని తెలుస్తోంది. దీనికి సంబంధించిన కల్నల్ కొల్లిన్ మాకెంజీ మాన్యుస్క్రిప్ట్స్‌లోని ఎర్రగుడిపాడు కైఫియాట్స్ (స్థానిక పత్రం) లో స్పష్టంగా ప్రస్తావించబడిందని పురావస్తు శాఖ తెలిపింది.

ఎరికల్ ముత్తురాజా ధనజయ చేత ఎర్రగుడిపాడు వద్ద ఇటుక ఆలయ నిర్మాణం గురించి ప్రస్తావించారు. ఈ శాసనాల ఆధారంగా, కమలాపురం ప్రాంతంలో ఎక్కడో ఎరికల్‌ను గుర్తించే అవకాశం ఉంది. ఎరికల్ ప్రాంతం ఎరాగల్‌గా మార్పు చెందిందని, కొన్ని సంవత్సరాల తరువాత ఎరిగల్వా , ఎరగుడి , ఎర్రగుడిపాడుగా మారిందని ఎ.ఎస్.ఐ అధికారి చెప్పారు.

శివాలయానికి సమీపంలో ఉన్న మరొక శిల మీద చెక్కిన మరొక శాసనంలో ముసిది విల్లిశ్వర, తసీయా , జులాకుసికి చెందిన ఒక మహిళ అధికారి పద్మనాథజియా, విచ్లాసా సైనిక అధికారుల యుద్ధానికి సంబంధించిన అనవాలు స్పష్టమయ్యాయి. వీరంతా బానాస్‌తో పోరాడినట్లు చరిత్రకారులు వెల్లడించారు. రెనాసి చోళుల ఆధిపత్యం కోసం బానాస్ మధ్య యుద్ధం జరిగినట్లు ఈ శాసనంలో పురావస్తు నిపుణులు తెలిపారు. ఇక దీనిపై మరింత లోతుగా అధ్యయనం చేస్తున్నాట్లు పురావస్తు శాఖ డైరెక్టర్ కె. మునిరత్నంరెడ్డి వెల్లడించారు.