తెలుగు రాష్ట్రాల సీఎంలు కలిసేది ఇందుకే..

చాలా రోజుల తర్వాత తెలుగు రాష్ట్రాల సీఎంలు కేసీఆర్, జగన్‌లు జనవరి 13న భేటీ కాబోతున్నారు. జగన్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తొలి రోజుల్లో ఇద్దరు సీఎంలు పదే పదే ఆత్మీయ సమావేశాలతో హల్‌చల్ చేసినా.. ఆతర్వాత వీరిద్దరి మధ్య పలు అంశాలు గ్యాప్ పెంచాయని ప్రచారం జరిగింది. కానీ, అదేమీ లేదన్నట్లుగా సంక్రాంతికి ముందు ఈ ఇద్దరు మరోసారి హైదరాబాద్‌లో భేటీ కాబోతున్నారు. తెలంగాణ సీఎం నివాసం ప్రగతిభవన్‌తో ఇందుకోసం ఏర్పాట్లు జరుగుతున్నట్లు వార్తలొస్తున్నాయి. నిజానికి […]

తెలుగు రాష్ట్రాల సీఎంలు కలిసేది ఇందుకే..
Follow us
Rajesh Sharma

| Edited By: Pardhasaradhi Peri

Updated on: Jan 08, 2020 | 3:06 PM

చాలా రోజుల తర్వాత తెలుగు రాష్ట్రాల సీఎంలు కేసీఆర్, జగన్‌లు జనవరి 13న భేటీ కాబోతున్నారు. జగన్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తొలి రోజుల్లో ఇద్దరు సీఎంలు పదే పదే ఆత్మీయ సమావేశాలతో హల్‌చల్ చేసినా.. ఆతర్వాత వీరిద్దరి మధ్య పలు అంశాలు గ్యాప్ పెంచాయని ప్రచారం జరిగింది. కానీ, అదేమీ లేదన్నట్లుగా సంక్రాంతికి ముందు ఈ ఇద్దరు మరోసారి హైదరాబాద్‌లో భేటీ కాబోతున్నారు. తెలంగాణ సీఎం నివాసం ప్రగతిభవన్‌తో ఇందుకోసం ఏర్పాట్లు జరుగుతున్నట్లు వార్తలొస్తున్నాయి.

నిజానికి ముఖ్యమంత్రులిద్దరి మధ్య మంచి స్నేహం వున్నా.. రెండు రాష్ట్రాల మధ్య వున్న ఎన్నో అపరిష్కృత అంశాలు వీరిద్దరి మీటింగ్‌కి ఎంతో కొంత హోం వర్క్ చేయాల్సిన పరిస్థితి కల్పిస్తున్నాయి. ఉదాహరణకు వీరిద్దరి తొలి భేటీలో ప్రధానంగా ప్రస్తావనకు వచ్చి, అందరి దృష్టిని ఆకర్షించింది గోదావరి జలాలను కృష్ణా నదిలోకి తరలించడం ద్వారా రెండు రాష్ట్రాల్లో నీటి కొరత వున్న ప్రాంతాలను సస్యశ్యామలం చేయాలన్న సంకల్పం. ఈ సంకల్పం పట్ల రెండు రాష్ట్రాల ప్రజలు హర్షాతిరేకాలు వ్యక్తం చేశారు. ఒకరిద్దరు నీటి పారుదల రంగ నిఫుణులు మినహా ఎక్కువ మంది ఈ ప్రతిపాదనను స్వాగతించారు.

ఆ తర్వాత ఎక్కడ్నించి గోదావరి నీటి తరలింపు జరగాలి? ఎక్కడ కృష్ణానదితో అనుసంధానం చేయాలి? ఎక్కడ రిజర్వాయర్లు కట్టాలి? ఎక్కడి వరకు కాల్వలు తవ్వాలి? ఈ అనుసంధాన ప్రక్రియలో ఎవరి ఖర్చు ఎంత? అన్న అంశాలపై రెండు రాష్ట్రాల సాగునీటి రంగ అధికారులు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేయడంతో సీఎంల ప్రతిపాదనకు తాత్కాలికంగా బ్రేక్ పడింది. తాజాగా వీరిద్దరు మరోసారి కల్వబోతున్న తరుణంలో ఈ అంశమే ఎజెండాలో ప్రధానంగా చర్చకు రావచ్చన్న భావన వ్యక్తమవుతోంది.

ఇక ఇటీవల తెలంగాణ నుంచి రిలీవ్ అయి.. ఏపీలో చేర్చుకోకపోవడంతో త్రిశంకు స్వర్గంలో కొట్టమిట్టాడుతున్న విద్యుత్ ఉద్యోగుల అంశం సీఎంల సమావేశంలో చర్చకు రావచ్చన్న చర్చ జరుగుతోంది. 653 మంది విద్యుత్ ఉద్యోగులను రిలీవ్ చేయాలని తెలంగాణకు, వారిని జాయిన్ చేసుకోవాలని వన్ మ్యాన్ కమిటీ ఆదేశాలిచ్చింది. ధర్మాధికారి ఆదేశాల మేరకు తెలంగాణ వారిని రిలీవ్ చేసి ఏపీకి పంపింది.

అయితే, వారిని రిలీవ్ చేయవద్దని ఏపీ అధికారులు తెలంగాణ ప్రభుత్వాన్ని ముందుగానే కోరారు. ఏపీ విఙ్ఞప్తిని పట్టించుకోకుండా ధర్మాధికారి ఆదేశాలను అమలు చేసేసింది తెలంగాణ. ఇక్కడ రిలీవ్ అయి ఏపీకి చేరిన విద్యుత్ ఉద్యోగులను అక్కడ ఉన్నతాధికారులు జాయిన్ చేసుకోకపోవడంతో వారిప్పుడు దిక్కు తోచని పరిస్థితిలో పడిపోయారు. ఈ 653 మంది విద్యుత్ ఉద్యోగుల భవిష్యత్ ఏంటన్నది సీఎంల భేటీలో తేలే అవకాశం కనిపిస్తోంది.

నిజానికి కేసీఆర్, జగన్ ఇద్దరు ముఖ్యమంత్రుల హోదాలో గత ఏడు నెలల కాలంలో మొత్తం ఎనిమిది సార్లు కలిశారు. మూడు సార్లు ప్రగతి భవనే ఇందుకు వేదికయ్యింది. విభజన చట్టంలో పేర్కొన్న అంశాల్లో చాలా అంశాలింకా అపరిష్కృతంగానే వున్నాయి. 9, 10 షెడ్యూల్‌లో పేర్కొన్న సంస్థల విభజన ఇంకా పూర్తి కాలేదు. ఆర్టీసీ లాంటి సంస్థల విభజన కూడా వందశాతం పూర్తి కాలేదు. ఈ అంశాలన్నింటిపై గత సమావేశాల్లో ఇద్దరు సీఎంలు ఓ నిర్ణయానికి వచ్చారు. దానికి అనుగుణంగా కొంత పురోగతి జరిగినా.. ఆ తర్వాత అధికారుల కొర్రీలతో వాటి అమలులో జాప్యం జరుగుతోంది. ఈ నేపథ్యంలో జనవరి 13న జరిగే మీటింగ్‌లో చిక్కు ముడులను విప్పేందుకు సీఎంలిద్దరు ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారనేది ఆసక్తికరంగా మారింది.