Devdutt Padikkal : బౌలర్లు బంతులు వేస్తున్నారు..తను మాత్రం సెంచరీలు బాదుతున్నాడు..ఇది క్రికెటా లేక వీడియో గేమా?
Devdutt Padikkal : కర్ణాటక ఓపెనర్ దేవదత్ పడిక్కల్ ప్రస్తుతం ఒక మిషన్ మీద ఉన్నట్లు కనిపిస్తున్నాడు. నిద్రలేవడం, గ్రౌండ్‌లోకి వెళ్లడం, సెంచరీ బాదడం.. ఇదే అతనికి దినచర్యగా మారిపోయింది. విజయ్ హజారే ట్రోఫీలో పడిక్కల్ వరుస సెంచరీలతో ప్రకంపనలు సృష్టిస్తున్నాడు.

Devdutt Padikkal : కర్ణాటక ఓపెనర్ దేవదత్ పడిక్కల్ ప్రస్తుతం ఒక మిషన్ మీద ఉన్నట్లు కనిపిస్తున్నాడు. నిద్రలేవడం, గ్రౌండ్‌లోకి వెళ్లడం, సెంచరీ బాదడం.. ఇదే అతనికి దినచర్యగా మారిపోయింది. విజయ్ హజారే ట్రోఫీలో పడిక్కల్ వరుస సెంచరీలతో ప్రకంపనలు సృష్టిస్తున్నాడు. కేవలం నాలుగు మ్యాచ్‌ల్లోనే మూడు భారీ సెంచరీలు బాది సెలెక్టర్ల గుండెల్లో రైళ్లు పరిగెత్తిస్తున్నాడు. జార్ఖండ్‌పై 147, కేరళపై 124, తాజాగా పుదుచ్చేరిపై 113 పరుగులతో విరుచుకుపడ్డాడు. అయితే ఇన్ని రికార్డులు సృష్టిస్తున్నా, ఈ యువ ఆటగాడిని దురదృష్టం మాత్రం వెంటాడుతూనే ఉంది.
లిస్ట్-ఏ క్రికెట్‌లో పడిక్కల్ గణాంకాలు చూస్తుంటే ఇదొక మామూలు రికార్డులా అనిపించదు. అతను ఇప్పటివరకు ఆడిన 36 ఇన్నింగ్స్‌ల్లో ఏకంగా 12 సెంచరీలు, 12 హాఫ్ సెంచరీలు నమోదు చేశాడు. అంటే ఆడిన ప్రతి మూడు ఇన్నింగ్స్‌ల్లో రెండు సార్లు 50 కంటే ఎక్కువ పరుగులు చేస్తున్నాడన్నమాట. అతని బ్యాటింగ్ సగటు అక్షరాలా 82.56. మొత్తం 2,477 పరుగులు బాదాడు. లిస్ట్-ఏ క్రికెట్‌లో ఇంతటి అద్భుతమైన రికార్డు ఉన్న ఆటగాడు మరొకరు లేరు అంటే అతిశయోక్తి కాదు. ఇంత చేస్తున్నా టీమిండియా వన్డే జట్టులోకి మాత్రం పిలుపు రాకపోవడం నిజంగా దురదృష్టమనే చెప్పాలి.
ప్రస్తుతం భారత వన్డే జట్టులో విపరీతమైన పోటీ నెలకొంది. ఓపెనింగ్ స్థానం కోసం యశస్వి జైస్వాల్, శుభ్‌మన్ గిల్ వంటి యువకులు, రోహిత్ శర్మ వంటి దిగ్గజాలు ఉన్నారు. డబుల్ సెంచరీ బాదిన ఇషాన్ కిషన్ లాంటి వారే జట్టులో చోటు కోసం ఎదురుచూడాల్సిన పరిస్థితి ఉంది. దీంతో పడిక్కల్ ఎన్ని సెంచరీలు కొట్టినా సెలెక్టర్ల దృష్టిలో పడటం కష్టమవుతోంది. ముఖ్యంగా 2027 వన్డే వరల్డ్ కప్ వరకు ఈ సమీకరణాలు మారేలా లేవు. రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ వంటి సీనియర్లు రిటైర్ అయితే తప్ప పడిక్కల్ లాంటి టాలెంటుకు వన్డే క్యాప్ దక్కడం అసాధ్యంగా కనిపిస్తోంది.
ప్రస్తుత విజయ్ హజారే సీజన్‌లో పడిక్కల్ టాప్ స్కోరర్‌గా దూసుకుపోతున్నాడు. 4 మ్యాచ్‌ల్లోనే 101.5 సగటుతో 406 పరుగులు చేశాడు. పుదుచ్చేరితో జరిగిన మ్యాచ్‌లో 116 బంతుల్లో 4 సిక్సర్లు, 10 ఫోర్లతో 113 పరుగులు చేసి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు. అతని స్ట్రైక్ రేట్ కూడా 106గా ఉండటం విశేషం. పడిక్కల్ ఇదే ఫామ్‌ను కొనసాగిస్తే, సెలెక్టర్లు అతడిని ఎంతో కాలం విస్మరించలేరు. పడిక్కల్ బ్యాట్ నుంచి వస్తున్న ఈ సెంచరీల వర్షం త్వరలోనే అతడిని బ్లూ జెర్సీలో నిలబెడుతుందని అభిమానులు ఆశిస్తున్నారు.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
