Telangana Schools: సెప్టెంబర్ 1న స్కూల్స్ షురూ.. శిథిలావస్థలో ప్రభుత్వ పాఠశాలలు.. సమస్యలు, సవాళ్ల మధ్య పిల్లలు బడిబాట
తెలంగాణలో మూడంటే మూడ్రోజుల్లో బడిగంట మోగబోతుంది. సెప్టెంబర్ ఒకట్నుంచి స్కూల్స్ తెరుచుకోబోతున్నాయి. పిల్లలంతా బ్యాగ్‌లు భుజాన వేసుకొని బడిబాట పట్టబోతున్నారు.
Telangana Schools start on September 1: తెలంగాణలో మూడంటే మూడ్రోజుల్లో బడిగంట మోగబోతుంది. సెప్టెంబర్ ఒకట్నుంచి స్కూల్స్ తెరుచుకోబోతున్నాయి. పిల్లలంతా బ్యాగ్‌లు భుజాన వేసుకొని బడిబాట పట్టబోతున్నారు. అయితే, పిల్లలు చదువుకోవడానికి అనువుగా స్కూళ్లు ఉన్నాయా? సమస్యలు, సవాళ్ల మధ్య పిల్లలు బడిబాట పడతారా? అనేది ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది.
కరోనా మహమ్మారి సృష్టించిన కల్లోలానికి 18 నెలలుగా వేసిన తాళాలు వేసినట్టే ఉన్నాయి. అటువైపు కన్నెత్తి చూసిన వాళ్లు కూడా లేరు. అసలు, అవి ఎలాగున్నాయో పట్టించుకున్న పాపాన పోలేదు. చెత్త ఎత్తింది లేదు. మరమ్మతులు చేసిందీ లేదు. ఏ స్కూల్లో చూసినా ఇదే పరిస్థితి. దీంతో అవి అసలు పాఠశాలలా? లేక భూత్ బంగ్లాలా? అన్నట్టుగా తయారయ్యాయి. కొన్ని స్కూళ్లయితే ఏ క్షణం కూలిపోతాయో తెలియనంతగా శిథిలావస్థకు చేరుకున్నాయి. ఇలా చెప్పుకుంటూ పోతే ప్రభుత్వ స్కూళ్లలో అనేక సమస్యలు తిష్టవేశాయి. మరి, ఇలాంటి పరిస్థితుల మధ్య పిల్లలు బడికెళ్లేదెలా? ఇదే, ఇప్పుడు ఛాలెంజింగ్ గా మారింది.
వరంగల్ జిల్లా వర్ధన్నపేట మండలం ల్యాబర్తి గ్రామంలోని ఈ జిల్లా ప్రజాపరిషత్ సెకండరీ స్కూల్ భూత్ బంగ్లాలా మారిపోయింది. బిల్డింగ్ మొత్తం శిథిలావస్థకు చేరుకుంది. ఏ క్షణాన కూలిపోతుందో తెలియనంతగా భవనం పెచ్చులూడుతోంది. స్కూల్ పైకప్పు నుంచి, గోడల నుంచి నీరు కారుతోంది. ఇక, క్లాస్ రూములైతే భయానకంగా కనిపిస్తున్నాయి. పాములు తేళ్లకు నిలయంగా మారింది. ఈ స్కూల్ లోనే ఇప్పుడు పిల్లలకు పాఠాలు చెప్పేందుకు టీచర్లు రెడీ అవుతున్నారు. చెత్తను తొలగించవచ్చు, కానీ పెచ్చులూడిన భవనాల సంగతేంటి? కూలడానికి సిద్ధంగా ఉన్న భవనాల్లో భద్రత ఎంత? ఇలాంటి అనుమానాలే పిల్లల తల్లిదండ్రులను వెంటాడుతున్నాయి.
అయితే, సెప్టెంబర్ ఫస్ట్ నుంచి స్కూల్స్ ప్రారంభానికి అన్ని చర్యలు చేపట్టినట్లు తెలంగాణ విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి తెలిపారు. కోవిడ్ రూల్స్ ను పాటిస్తూ తరగతుల నిర్వహణకు ఏర్పాటు చేసినట్లు టీవీ9తో చెప్పారు. 18 నెలలుగా స్కూళ్లు మూతపడటంతో పిల్లలకు సైకలాజికల్ గా సమస్యలు వచ్చే ప్రమాదం ఉందన్నారు. పిల్లల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకునే విద్యాసంస్థలను ప్రారంభిస్తున్నట్లు తెలిపారు. ప్రభుత్వ స్కూళ్లలో చిన్నచిన్న సమస్యలు ఉన్న మాట నిజమేనని ఒప్పుకున్న సబితా ఇంద్రారెడ్డి. గ్రామ సర్పంచుల సహకారంతో వాటిని అధిగమించాలంటూ హెడ్మాస్టర్లకు సూచించారు.
రాష్ట్రవ్యాప్తంగా స్కూళ్లను తెరవాలన్న నిర్ణయం మంచిదే అయినా, ఇన్ని సమస్యలు, సవాళ్ల మధ్య ఆదరాబాదరాగా ప్రారంభించడం ఎందుకన్న మాట వినిపిస్తోంది. ఒకవైపు కరోనా, మరోవైపు భయపెడుతోన్న భవనాలు… ఇలాంటి పరిస్థితుల మధ్య పిల్లలను తల్లిదండ్రులు స్కూళ్లకు పంపుతారో లేదోనన్న ప్రశ్న వెంటాడుతోంది.
Read Also… MLA Roja: ఓ మంచి పని చేసిన రోజా.. అయినా కానీ పాపం ఊహించని విధంగా ప్రతిపక్షాలకు దొరికిపోయారు