TS MLC Elections: తెలంగాణలో స్థానిక కోటా సమరానికి సర్వం సిద్ధం.. 6 ఎమ్మెల్సీ స్థానాలకు రేపే పోలింగ్
తెలంగాణలో స్థానిక సంస్థల కోటా ఎమ్మెల్సీ ఎన్నికలకు రేపు పోలింగ్ జరుగనుంది. 5 ఉమ్మడి జిల్లాల్లో ఆరు ఎమ్మెల్సీ స్థానాలకు శుక్రవారం జరిగే పోలింగ్ కోసం ఎన్నికల సంఘం అన్ని ఏర్పాట్లు చేశామని రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి తెలిపారు.
Telangana MLC Elections 2021: తెలంగాణలో స్థానిక సంస్థల కోటా ఎమ్మెల్సీ ఎన్నికలకు రేపు పోలింగ్ జరుగనుంది. 5 ఉమ్మడి జిల్లాల్లో ఆరు ఎమ్మెల్సీ స్థానాలకు శుక్రవారం జరిగే పోలింగ్ కోసం ఎన్నికల సంఘం అన్ని ఏర్పాట్లు చేశామని రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి తెలిపారు. ఎన్నికలు ప్రశాంతంగా, పారదర్శకంగా నిర్వహించేందుకు అన్ని చర్యలు తీసుకున్నామని సీఈవో శశాంక్ గోయల్ తెలిపారు. పోలింగ్ సరళిని ఎప్పటికప్పుడూ పరిశీలించేందుకు వెబ్ క్యాస్టింగ్ ని ఏర్పాటు చేశామన్నారు..
రాష్ట్రంలో ఉమ్మడి ఆదిలాబాద్, మెదక్, కరీంనగర్, ఖమ్మం, నల్గొండ జిల్లాలోని 12 ఎమ్మెల్సీ స్థానాలు సంబంధించిన పదవికాలం జనవరి 4వ తేదీన ఖాళీ కానుంది. ఈ నేపథ్యంలో 12స్థానిక సంస్థల ఎమ్మెల్సీ స్థానాలకు నోటిఫికేషన్ వచ్చింది. అయితే, ఇప్పటికే ఆరు ఎమ్మెల్సీ స్థానాలు ఏకగ్రీవం అయ్యాయి. మిగతా ఆరు ఎమ్మెల్సీ స్థానాలకు రేపు శుక్రవారం పోలింగ్ జరుగనుంది. ఉదయం ఎనిమిది గంటల నుండి సాయంత్రం నాలుగు వరకు జరగనుంది. ఈనెల 14న ఓట్ల లెక్కింపు చేపట్టి ఫలితాలను వెల్లడించనున్నారు. ఈ ఎన్నికలను అత్యంత ప్రశాంతంగా, పారదర్శకంగా నిర్వహించేందుకు సీఈవో శశాంక్ గోయల్ ఎన్నికల ఏర్పాట్లను చేసినట్లు తెలిపారు.
ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో రెండు స్థానాలకు గాను 10 అభ్యర్థులు పోటీలో నిలిచారు. ఉమ్మడి నల్గొండ జిల్లాలో ఒక్క స్థానానికి 7మంది అభ్యర్థులు, ఆదిలాబాద్‌లో ఒక్క స్థానానికి ఇద్దరు, ఖమ్మంలో ఒక్క స్థానానికి నలుగురు, మెదక్ జిల్లాలో ఒక్క స్థానానికి ముగ్గురు అభ్యర్థులు పోటీలో ఉన్నారు. బ్యాలెట్ పేపర్ ద్వారా ఈ ఎన్నికల నిర్వహణ ఉన్నందున వాయిలేట్ కలర్ పెన్‌ను ఓటర్లు ఉపయోగించి ప్రియార్టీ ప్రకారం ఓటు హక్కును వినియోగించుకోవాలని ఎన్నికల అధికారులు సూచించారు. ఇప్పటికే పోలింగ్ కేంద్రాలకు బ్యాలెట్ బాక్స్‌లతో సిబ్బంది చేరుకున్నట్లు ఎన్నికల ప్రధానాధికారి వెల్లడించారు.
6 స్థానిక సంస్థల ఎన్నికల ఏర్పాట్లపై ఆయా జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలు, పోలీసు కమీషనర్లతో సీఈవో శశాంక్ గోయల్ సమీక్ష నిర్వహించారు. బ్యాలెట్ పేపర్లు, బ్యాలెట్ బాక్సులు, శాంతి భద్రతలు, పోలింగ్ కేంద్రాల వద్ద నిఘా తదితర అంశాలపై చర్చించారు. పోలింగ్ కేంద్రాల్లో సీసీ కెమెరాలు, వెబ్ క్యాస్టింగ్ ఏర్పాటు చేసినట్లు ఆయన తెలిపారు. అదే విధంగా ఆయా జిల్లాల్లో పోలింగ్ ముగిసేవరకు మద్యం అమ్మకాలు బంద్ చేయాలని ఆదేశాలు జారీ చేశారు.
ఇక, ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో 937మంది ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. ఇందుకోసం 8 పోలింగ్ స్టేషన్లు ఏర్పాటు చేశారు. అలాగే, ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో 1,324 ఓటర్లకు గానూ 8 పోలింగ్ స్టేషన్లు ఏర్పాటు చేశారు. అటు ఉమ్మడి మెదక్ జిల్లాలో 1,026 మంది ఓటు వేయనున్నారు. ఇందుకోసం 9పోలింగ్ స్టేషన్లను ఏర్పాటు చేసినట్లు ఈసీ అధికారులు తెలిపారు. ఉమ్మడి నల్గొండ జిల్లాలో 1,271 ఓటర్లు ఉండగా, 8 పోలింగ్ స్టేషన్లు ఏర్పాటు చేశారు. ఉమ్మడి ఖమ్మం జిల్లా 768 ఓటర్లకు గానూ, 4పోలింగ్ స్టేషన్లను ఏర్పాటు చేశారు. మొత్తం ఆరు ఎమ్మెల్సీ స్థానాల్లో 5,326 మంది ఓటర్లు ఉండగా ఇందులో పురుషులు 2,329 మంది , స్త్రీలు 2,997 ఉన్నారు. అయితే, ఆదిలాబాద్ లో వివిధ కారణాలతో ఇద్దరు ఓటర్లు పోస్టల్ బ్యాలెట్ ద్వారా వారి ఓటు హక్కును వినియోగించుకున్నారు. కాగా, మొత్తంగా చూస్తే ఎక్స్ అఫిషియో 65మంది ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకోనున్నారు.
కరోనా నిబంధనలు పాటించి ఓటర్లు తమ ఓటు వినియోగించుకోవాలని, సిబ్బంది, ఓటర్లు తప్పకుండా గ్లౌస్, మాస్క్ లు ధరించి పోలింగ్ లో పాల్గొనాలని సీఈవో శశాంక్ కోరారు. ఎవరైనా ఓటర్లు కరోనా రోగులు అయితే చివరి గంటలో ఓటు హక్కును వినియోగించుకునేలా అనుమతి ఇస్తామని పేర్కొన్నారు.