కొత్త రెవెన్యూ బిల్లుకు శాసనమండలి ఏకగ్రీవ ఆమోదం
తెలంగాణ రాష్ర్ట ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టనున్న కొత్త రెవెన్యూ బిల్లుకు శాసనమండలి ఏకగ్రీవంగా ఆమోదం తెలిపింది. కొత్త రెవెన్యూ చట్టానికి సంబంధించిన బిల్లును ముఖ్యమంత్రి కేసీఆర్ సోమవారం శాసన మండలిలో ప్రవేశపెట్టి చర్చను ప్రారంభించారు.
తెలంగాణ రాష్ర్ట ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టనున్న కొత్త రెవెన్యూ బిల్లుకు శాసనమండలి ఏకగ్రీవంగా ఆమోదం తెలిపింది. కొత్త రెవెన్యూ చట్టానికి సంబంధించిన బిల్లును ముఖ్యమంత్రి కేసీఆర్ సోమవారం శాసన మండలిలో ప్రవేశపెట్టి చర్చను ప్రారంభించారు. మండలి సభ్యులు లేవనెత్తిన సందేహాలకు సీఎం కేసీఆర్ వివరణ ఇచ్చారు. అనంతరం ఈ బిల్లును ఆమోదిస్తున్నట్లు శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి ప్రకటించారు. నూతన రెవెన్యూ బిల్లుతో పాటు వీఆర్వో పోస్టుల రద్దు బిల్లుకు, తెలంగాణ మున్సిపల్ నిబంధన సవరణ బిల్లుకు, తెలంగాణ పంచాయతీరాజ్ సవరణ బిల్లుకు మండలి ఏకగ్రీవంగా ఆమోద ముద్ర వేసింది. అనంతరం శాసనమండలిని మంగళవారానికి వాయిదా వేస్తున్నట్లు చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి ప్రకటించారు.
అంతకుముందు సీఎం కేసీఆర్ కొత్త రెవిన్యూ బిల్లును ప్రవేశపెడుతూ ప్రసంగించారు.పేదల హక్కులను కాపాడేందుకు తమ ప్రభుత్వం పకడ్బందీ చర్యలు తీసుకుంటుందని సీఎం కేసీఆర్ స్పష్టం చేశారు. ఎవరూ చేయని సాహసాన్ని తమ ప్రభుత్వం చేస్తున్నామని తెలిపారు. సమగ్ర భూ సర్వేతో సమస్యలన్నీ పరిష్కారం అవుతాయన్నారు. ఆధునాతమైన టెక్నాలజీతో సర్వే చేయబోతున్నాం. ఈ సర్వే పూర్తిగా పారదర్శకంగా ఉంటుందని సీఎం స్పష్టం చేశారు. సమగ్ర భూ సర్వే చేసి కన్‌క్లూజివ్ టైటిల్ ఇచ్చే ప్రయత్నం చేస్తామని సీఎం పేర్కొన్నారు.